టీఆర్‌ఎస్, బీజేపీ నేతల ఘర్షణ

21 Jul, 2022 01:01 IST|Sakshi

మంచిర్యాల టౌన్‌: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు వేర్వేరుగా నిర్వహించిన నిరసన కార్యక్రమం ఘర్షణకు దారితీసింది. వరద బాధితులను ఆదుకోవడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫల మైందని, పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఉదయం నుంచి బీజేపీ నేతలు నోటికి నల్లగుడ్డను కట్టుకుని నిరసన తెలిపారు.

మధ్యాహ్న సమయంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ నేతలు.. కేంద్రం 14 నిత్యావసర సరకులపై ఐదు శాతం జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలు, గేదెలను తీసుకొచ్చి ఐబీ చౌరస్తాలో బైఠాయించారు. తమ పార్టీ జెండాలను టీఆర్‌ఎస్‌ నేతలు చౌరస్తా వద్ద నుంచి తొలగించి గేదెలకు వేశారంటూ బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయగా రెండు వర్గాలు కర్రలు, చెప్పులు విసురుకున్నాయి.

ఒక కర్ర ఎమ్మెల్యే దివాకర్‌రావు వైపు రాగా పక్కనే ఉన్న కార్యకర్తలు పట్టుకోవడంతో ముప్పు తప్పింది. గాల్లోకి విసిరిన కర్రలు తగిలి బీజేపీకి చెందిన ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. ఏసీపీ తిరుపతిరెడ్డి, పట్టణ సీఐ నారాయణనాయక్‌ ఇరువర్గాలకు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. దాడులకు దిగడాన్ని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఖండించగా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి కూడా దాడులు సరికాదని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు