బీజేపీ–టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ

19 Mar, 2022 01:30 IST|Sakshi
పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత.. 

నలుగురు బీజేపీ కార్యకర్తలకు గాయాలు 

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సోషల్‌ మీడియాలో బీజేపీ నాయకుడు చేసిన పోస్టు ఘర్షణకు దారితీసింది. దీంతో పోలీస్‌స్టేషన్‌ ఎదుటే బీజేపీ–టీఆర్‌ఎస్‌ వర్గాలు గొడవపడ్డాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన బీజేవైఎం మండల అధ్యక్షుడు బోనాల సాయికుమార్‌ టీఆర్‌ఎస్‌ కార్యకర్త శివరామకృష్ణపై అనుచిత వ్యాఖ్యలుచేస్తూ రెండు రోజుల కిందట సోషల్‌ మీడియాలో పోస్టుపెట్టారు. దీనిపై స్పందించిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ముగ్గురు శుక్రవారం రాత్రి పదిర గ్రామంలోని సాయికుమార్‌ ఇంటికెళ్లారు.

ఆ సమయంలో సాయికుమార్‌ లేకపోవడంతో అతని తల్లిదండ్రులు మణెమ్మ, రవీందర్‌లతో అమర్యాదగా మాట్లాడారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మణెమ్మ, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గోపి, మరికొంత మందితో కలిసి ఎల్లారెడ్డిపేట ఠాణాకు వచ్చారు. ఇది తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ నాయకులు స్టేషన్‌కు చేరుకోగా ఇరు పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈక్రమంలోనే స్టేషన్‌లో ఉన్న గోపితోపాటు మండల ఉపాధ్యక్షుడు రామచంద్రం, మరో ఇద్దరిపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడిచేశారు. రామచంద్రంకు బలమైన గాయాలవడంతో ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీస్‌స్టేషన్‌ వద్ద పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయడంతో సీఐ మొగిలి, ఎస్సై శేఖర్, సిబ్బందితో కలిసి ఇరువర్గాలను శాంతింపజేశారు.

దాడిపై బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. స్టేషన్‌ ఎదుటే ఇరు వర్గాలు రాళ్లతో దాడిచేసుకున్నాయి. సిరిసిల్ల ప్రాంతంలో బలపడుతున్న బీజేపీని అణచివేయాలనే ఉద్దేశంతో మంత్రి కేటీఆర్‌ డైరెక్షన్‌లోనే తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని గోపి ఆరోపించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, గ్రామస్థాయి కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు, నాయకులు సోషల్‌మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో దూషిస్తూ రెచ్చగొడుతున్నారని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తెలిపారు.

మరిన్ని వార్తలు