అబ్బాబ్బా.. ఏమీ ఎండలు: ఇకపై 6 నెలలు ఎండాకాలం!

14 Mar, 2021 02:36 IST|Sakshi

2,100 ఏడాది నాటికి అదే పరిస్థితి ఉంటుందంటున్న శాస్త్రవేత్తలు

ఇప్పటికే రుతువుల క్రమంలో మార్పులు

ఏటికేడు పెరుగుతున్న సగటు ఉష్ణోగ్రతలు

గ్లోబల్‌ వార్మింగ్, కాలుష్యమే కారణం

నాలుగు నెలలు వానాకాలం..  ఇంకో నాలుగు నెలలు చలికాలం..
తర్వాత నాలుగు నెలలు ఎండాకాలం.. ఈ నాలుగు నెలలు మండిపోయినా.. 
మిగతా ఎనిమిది నెలలు కాస్త చల్లగా, ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ మెల్లమెల్లగా ఎండాకాలం టైం పెరిగిపోతోందట.. ఈ శతాబ్దం ముగిసేనాటికి, అంటే 2100 నాటికి ఏడాదిలో ఆరు నెలలు ఎండాకాలమే ఉంటుందట. ముఖ్యంగా చలికాలం బాగా తగ్గిపోయి నెలా, నెలన్నర రోజులకే పరిమితం అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరో నాలుగున్నర నెలలు వానాకాలం ఉంటుందని అంచనా వేసుకుంటున్నా.. అందులో గట్టిగా వానలు పడే టైం సగం రోజులే ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొన్నేళ్లుగా రుతువుల క్రమం మారిపోతోందని గుర్తు చేస్తున్నారు. చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్, అమెరికాలోని కెంట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ అంశంపై వేర్వేరుగా పరిశోధనలు చేశారు.

మార్చి నుంచి జూన్‌ దాకా.. అంటే సుమారు నాలుగు నెలల పాటు ఎండాకాలం ఉంటుంది. ఎంత వేసవి అయినా సరే.. రెండు మూడు దశాబ్దాల కిందటి వరకు 40 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రతలు నమోదుకావడం చాలా తక్కువగా ఉండేది. కానీ కొన్నేళ్లుగా ఎండా కాలం వచ్చిందంటేనే వణికిపోయే పరిస్థితి ఉంటోంది. వేసవిలో చాలా ప్రాంతాల్లో, చాలా రోజుల పాటు 40 సెంటీగ్రేడ్‌లకుపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్నిచోట్ల అయితే ఏకంగా 47, 48 డిగ్రీల వరకు వెళ్తున్నాయి. కొన్నేళ్లలో 50 డిగ్రీల దాకా పెరిగిపోయే అవకాశమూ ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇప్పుడీ పరిస్థితి ఏడాదిలో మూడు, నాలుగు నెలలే ఉంటుండగా.. ఇక ముందు ఆరు నెలల  పాటు కొనసాగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

70 ఏండ్ల రికార్డులను విశ్లేషించి.. 
1952 నుంచి 2011 వరకు రోజువారీ వాతావరణ రికార్డులను కెంట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు విశ్లేషించారు. వాతావరణ మార్పులకు సంబంధించి ఇప్పటికే రూపొందించిన మోడల్స్‌ ఆధారంగా పరిశీలన జరిపారు. వీటి ఆధారంగా భవిష్యత్తులో రుతువులు ఎలా మారుతాయన్నది అంచనా వేశారు. 1950వ దశాబ్దంలో సగటున 78 రోజులుగా ఉన్న ఎండాకాలం (వసంతకాలం మినహా).. ఇప్పుడు 95 రోజులకు చేరిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదే చలికాలం 73 రోజులకు, వానాకాలం కూడా 82 రోజులకు తగ్గిపోయాయని స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్తులో ఎండాకాలం ఏకంగా ఆరు నెలల పాటు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మధ్యదరా ప్రాంతాలు, టిబెట్‌ పీఠభూమి ప్రాంతాల్లో ఎండాకాలం ముందే మొదలై లేటుగా ముగుస్తోందని.. వానాకాలం, చలికాలం లేటుగా మొదలై, తొందరగా ముగుస్తున్నాయని తెలిపారు.

అన్నింటిపైనా ప్రభావం
కర్బన ఉద్గారాల విడుదల, కాలుష్యం, వాతావరణ మార్పులు ఇప్పుడున్నట్టుగానే కొనసాగితే.. భూమధ్యరేఖకుపైన ఉత్తరంగా ఉన్న దేశాలన్నింటా ఎండాకాలం పెరిగిపోతుందని పరిశోధనలో తేలింది. ఏడాదిలో ఆరు నెలల పాటు ఎండాకాలం కొనసాగితే చాలా ప్రమాదకరమైన పరిణామాలు నెలకొంటాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మనుషులు, చెట్లు సహా అన్ని జీవుల ఆరోగ్య పరిస్థితి, వ్యవసాయంపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. దోమలు, ఇతర కీటకాల పెరుగుదల కారణంగా రోగాల వ్యాప్తి కూడా పెరిగిపోతుందని చెబుతున్నారు. రుతువుల ఆధారంగా పండే పంటలు, పూలు పూయడం, చెట్లు ఆకు రాల్చి కొత్త చిగుర్లు వేయడం వంటివన్నీ అస్తవ్యస్తం అవుతాయని.. తీవ్రస్థాయిలో వడగాడ్పులు వీయడం, కార్చిచ్చులు చెలరేగడం వంటివి పెరిగిపోతాయని అంటున్నారు. మరోవైపు చలికాలంలో చలి తీవ్రత పెరగడం, మంచుతుఫాన్‌లు చెలరేగడం వంటివీ సంభవిస్తాయని పేర్కొంటున్నారు. మొత్తంగా ఒకదాని మీద ఒకటిగా ఆధారపడి ఉన్న పర్యావరణ, జీవావరణ వ్యవస్థలన్నింటిపైనా ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. 

సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి
కాలిఫోర్నియా, బర్కిలీ, హార్వర్డ్‌ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు ఆరేళ్ల కింద చేసిన పరిశోధనలో కూడా రుతువుల మార్పు జరుగుతోందని గుర్తించారు. వారు 1850 నుంచి 2007 వరకు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో వాతావరణ వివరాలను విశ్లేషించారు. ఎండాకాలం పరిధి పెరుగుతోందని, చలికాలం సమయం తగ్గుతోందని గుర్తించినట్టు వెల్లడించారు. ముఖ్యంగా చలికాలంలో సగటు ఉష్ణోగ్రతలు కొన్నేళ్లుగా పెరిగిపోతున్నాయని తేల్చారు. కాలాన్ని బట్టి వలసపోయే పక్షులు.. కొన్నేళ్లుగా ముందుగానే వలస పోతున్నాయని, కొన్నిరకాల చెట్లు ముందుగానే పుష్పిస్తున్నాయని ప్రకటించారు. మనుషుల కారణంగా పెరిగిపోతున్న గ్లోబల్‌ వార్మింగే దీనంతటికీ ప్రధాన కారణమని, వాతావరణంలో వేగంగా మార్పులు జరుగుతున్నాయని తెలిపారు.

  • కాలుష్యం కారణంగా గ్లోబల్‌ వార్మింగ్‌ పెరిగి.. ప్రపంచవ్యాపంగా వీచే రుతుపవనాల మార్గంలో, కాలంలో మార్పులు వస్తున్నాయి.
  • ప్రపంచవ్యాప్తంగా అడవులు తరిగిపోతుండటంతో కర్బన ఉద్గారాల నియంత్రణ తప్పిపోతోంది. దీనికితోడు పట్టణీకరణ పెరుగుతోంది. మొక్కలు, చెట్లు సంగ్రహించాల్సిన సూర్య కిరణాల వేడి వాతావరణంలోనే నిలిచిపోతోంది.


ఇప్పటికే మొదలైందా?

  • హిమాలయాల ప్రాంతంలో ఉండే రోడోడెండ్రాన్‌ చెట్లు సాధారణంగా ఏటా మార్చి, ఏప్రిల్‌ నెలల్లో అంటే ఎండాకాలం మొదట్లో పూలు పూస్తాయి. కానీ కొన్నేళ్లుగా జనవరిలోనే పూస్తున్నాయి. ఈసారి కూడా జనవరిలోనూ పూశాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.  
  • సాధారణంగా మామిడి చెట్లకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు అనుకూలం. అలాంటి ప్రాంతాల్లోనే పండ్లు కాస్తాయి. చలి, మంచు ప్రదేశాల్లో చెట్లు పెరిగినా పళ్లు కాయవు. కానీ అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో గత నాలుగైదేళ్లుగా కొండ ప్రాంతాల్లో కూడా మామిడి పండ్లు కాస్తున్నాయని, ఇంతకుముందెన్నడూ ఇలా జరగలేదని చెబుతున్నారు. 

- సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు