వైభవంగా ముగింపు వేడుకలు

23 Aug, 2022 01:47 IST|Sakshi
వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా సురవరం ప్రతాపరెడ్డి, కొమురం భీం వారసులతో పాటు ‘వనజీవి’ రామయ్యను సన్మానిస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో మంత్రులు, సీఎస్‌ తదితరులు

సాక్షి, హైదరాబాద్‌/హిమాయత్‌నగర్‌: స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమం ఎల్బీ స్టేడియంలో సోమవారం వైభవంగా జరిగింది. వేడుకలకు రాష్ట్రం నలు మూలల నుంచి విద్యార్థులు, మహిళలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. తొలుత మహాత్మాగాంధీ చిత్రపటానికి సీఎం కేసీఆర్‌ పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను సీఎం ఘనంగా సన్మానించారు. సురవరం ప్రతాపరెడ్డి వారసుడు సురవరం అనిల్‌ కుమార్‌రెడ్డి, భాగ్యరెడ్డి వర్మ వారసుడు అజయ్‌గౌతమ్, కొమురం భీం వారసుడు కొమురం సోనేరావు, కల్నల్‌ సంతోష్‌బాబు తండ్రి బిక్కుమల్ల ఉపేందర్, భూదాన్‌ రాంచంద్రారెడ్డి తనయుడు అరవింద్‌రెడ్డి,  వనజీవి రామయ్య, రా వెల్ల వెంకట్రామారావు తనయుడు రావెల్ల మాధవరావు, కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాలు సాధించిన నిఖత్‌ జరీన్, ఆకుల శ్రీజ, మహ్మద్‌ హుసాముద్దీన్, ప్రముఖ గాయకుడు శంకర్‌ మహదేవన్, సంగీత దర్శకుడు కేఎం రాధాకృష్ణ, ప్రముఖ నాట్య కళాకారిణులు అలేఖ్య పుంజాల, వైష్ణవి విఘ్నేష్, సంగీత, నాటక అకాడమీ చైర్‌ పర్సన్‌ దీపికారెడ్డి, ఖవ్వాలీ నిర్వాహకులు వార్షీ బ్రదర్స్‌ను సన్మానించారు.

సీఎం తాతయ్యా.. సూపర్‌..
స్క్రీన్‌పై కేసీఆర్‌ కనిపించిన ప్రతిసారీ విద్యార్థులు ‘సీఎం తాతయ్యా సూపర్‌’ అంటూ కేరింతలు కొట్టారు. సీఎం సభా వేదికపైకి వెళ్తుండగా ఆ దృశ్యాలు ప్లే అవుతున్న క్రమంలో విద్యార్థులు సెల్ఫీలు తీసుకున్నారు. 
వేడుకల్లో శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్,  మంత్రులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 
సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌ దీపికారెడ్డి ప్రదర్శించిన ‘వజ్రోత్సవ భారతి‘ నృత్య రూపకంతో వేడు కలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ‘ఝాన్సీ లక్ష్మీబాయి’ నృత్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అనంతరం.. గంగా జమున తెహజీబ్‌ కు ప్రతీకగా వార్షీ బ్రదర్స్‌ ఖవ్వాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
గణపతి ప్రార్థనతో ప్రారంభమైన శంకర్‌ మహదేవన్‌ సంగీత విభావరి కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. 

ఇంటి పండుగలా వజ్రోత్సవాలు: సీఎస్‌
వజ్రోత్సవాల నివేదికను సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ విడుదల చేశారు. వేడుకల్లో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తమ ఇంటి పండగలా భావించి మమేకమయ్యారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు 1.20 కోట్ల జాతీయ పతా కాలను ఉచితంగా అందచేశామని, ప్రతి ఇంటిపై ఎగుర వేసిన ఈ జెండాలన్నీ మన రాష్ట్రంలోనే తయారు కావడం సంతోషకరమన్నారు. 18,963 ప్రాంతాల్లో 37,66,963 మొక్కలు నాటినట్లు తెలిపారు.  ఈనెల 16న 95.23 లక్షల మంది సామూహిక జాతీయ గీతాలాపన చేశారన్నారు.

మరిన్ని వార్తలు