‘కార్పొరేషన్‌ పేరిట ప్రభుత్వం అప్పులు చేస్తోంది’

25 Aug, 2020 15:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కార్పొరేషన్ పెట్టి భారీగా రుణాలు తీసుకుంటుందని, 200 శాతం అదనంగా లోన్లు తీసుకోవడానికి తెర లేపిందని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘రుణాలు తీసుకోవడానికి ప్రత్యేకంగా ఆర్డినెన్స్ జారీ చేశారు. అప్పులను చూస్తుంటే రాష్ట్రం ఏమైపోతుందా అని భయమేస్తోంది.  మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలోకి వెళ్లింది. ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.318918 కోట్ల అప్పు చేసింది.

70 ఏళ్లలో రూ.69000 కోట్ల అప్పు ఉంటే 6 ఏళ్లలో 3 లక్షల రూపాయల కోట్లు అప్పు చేశారు. అదనంగా అప్పులు చేసేందుకు ప్రత్యేకంగా గెజిట్ విడుదల చేశారు. ప్రభుత్వం 6 లక్షల కోట్లు అప్పు చేసేందుకు ప్లాన్ చేసింది. ఇప్పటికే 3 లక్షల కోట్లు అప్పులకు 40వేల కోట్లు వడ్డీ చెల్లిస్తుంటే.. 6 లక్షల కోట్ల అప్పును ఎలా తీరుస్తారు? చివరికి ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో రాష్ట్రం ఉంది. అప్పులు తీర్చడానికి మళ్లీ ప్రజలపై భారం వేయక తప్పని పరిస్థితి.  దీని గురించి ప్రజలు ఆలోచన చేయాలి.  ఇప్పటికైనా ఈ సీఎం చేస్తున్న అప్పులను ఆపకపోతే బతికే పరిస్థితి లేదు. భవిష్యత్తులో ప్రభుత్వం అప్పులు చేయకుండా ఉండేందుకు కాంగ్రెస్ తరపున ప్రజల్లో చర్చ చేస్తాం. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైద్యానికి ఖర్చు భరించలేక పేద ప్రజలు అప్పుల పాలవుతున్నారు.  కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలను ఆదుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రులను కాంగ్రెస్ తరపున విజిట్ చేస్తాం. రేపటి నుంచి భద్రాచలం నుంచి విజిట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం’ అని తెలిపారు. 

చదవండి: ట్విస్ట్‌ : శ్రీశైలం అగ్ని ప్రమాదంలో కొత్త కోణం

మరిన్ని వార్తలు