భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో భట్టి పర్యటన

27 Aug, 2020 13:18 IST|Sakshi
భద్రాచలం ఆస్పత్రి వద్ద మాట్లాడుతున్న భట్టి విక్రమార్క

సాక్షి, భద్రాచలం‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. బాధితులకు వైద్య సేవలు అందించే విషయంలో సీఎం కేసీఆర్‌ చేతులెత్తేశారని అన్నారు. సీఎల్పీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రభుత్వ ఆస్పత్రుల సందర్శన కార్యక్రమాన్ని బుధవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రి నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీపీఈ కిట్లు ధరించి, కరోనా నిబంధనలు పాటిస్తూ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డును పరిశీలించి, అందిస్తున్న వైద్య సేవల గురించి సూపరింటెండెంట్‌ చావా యుగంధర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. కరోనా బారిన పడిన వారు ఉంటే ఉంటారు.. పోతే పోతారు అన్న చందంగా సీఎం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టే విషయంలో తాము పలు సూచనలు చేసినా.. ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా వైద్య పోస్టులను భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. మూడు రాష్ట్రాలకు తలమానికంగా ఉన్న భద్రాద్రి ఏరియా ఆస్పత్రిలో కనీసం 1/3 వంతు మంది సిబ్బంది కూడా లేరని అన్నారు. ఇక్కడ మొత్తం 205 మంది  పని చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం 61 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితిలో ప్రజలకు మెరుగైన వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఇదే ఆస్పత్రిలో పనిచేసే డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, ఈ ప్రాంత మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారని, అలాంటి వారికే దిక్కు లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ ఈ ఏరియా ఆస్పత్రిలో సిబ్బంది కొరత గురించి గతంలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామని, అయినా సర్కారు పెడచెవిన పెట్టిందని విమర్శించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్య, జెడ్పీ మాజీ చైర్మన్‌ చందా లింగయ్య, ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. 

     
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు