వెబ్‌సైట్ నుంచి మేనిఫెస్టో తొలిగించిన టీఆర్ఎస్

21 Sep, 2020 16:45 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్ : ఫార్మాసిటీ పేరుతో ప్రభుత్వం దమనకాండ సాగిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం  కాకుండా ప్రైవేట్ కంపెనీల‌ కోసం పేద‌ల భూముల్ని లాక్కొంటున్నార‌ని మండిపడ్డారు. దళిత, గిరిజనుల కు మూడు ఎకరాలు ఇస్తామంటూ చెప్పి అవి ఇవ్వకపోగా వారి అసైన్డ్ భూములనే ప్ర‌భుత్వం తీసుకుంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వ భూములను ఫార్మాసిటీ పేరుతో దాదాపు 8వేల ఎకరాలను ప్ర‌భుత్వం ఆక్ర‌మ‌ణ‌లోకి తీసుకుంద‌ని భ‌ట్టి వ్యాఖ్యానించారు. అస‌లు ఫార్మాసిటీ ద్వారా ఎలాంటి  ప్రజా ప్రయోజనాలున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు.  మల్టీనేషనల్ కంపెనీలు సామ‌న్య ప్ర‌జ‌ల‌కు ఎలా ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని ప్ర‌శ్నించారు. పేదల భూములు లాక్కోవడం దుర్మార్గమ‌న్న భ‌ట్టి  ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తే స‌హించ‌మ‌న్నారు. ఎవ‌రైనా ఫిర్యాదు చేస్తే వారి త‌ర‌పున కాంగ్రెస్ పోరాడుతుంద‌ని హామీ ఇచ్చారు. (తెలంగాణ టీడీపీలో తిరుగుబాటు.. చంద్రబాబుకు లేఖ)

ఫార్మా వల్ల అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయ‌ని హెచ్చ‌రించారు. ఫార్మాసిటీ ని మొత్తం ప్రభుత్వం బ్రోకరేజ్ గా మార్చింద‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. 2.68 లక్షల డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లు 2016-17లో నిర్మిస్తామ‌ని కేసీఆర్ స‌భ‌లో వాగ్దానం చేసి మ‌రిచార‌ని విమ‌ర్శించారు. ఇప్పుడు అస‌లు వాటి జాడే లేద‌ని, ఫీల్డ్‌లో ఉన్న  3428 ఇళ్లు మాత్రమే చూపించారని దుయ్య‌బ‌ట్టారు. మంత్రి త‌ల‌సానికి కూడా ప్ర‌భుత్వం ల‌క్ష ఇళ్లు కూడా క‌ట్ట‌లేద‌న్న సంగ‌తి తెలియ‌న‌ట్లుంద‌ని, కేవ‌లం కాగిత‌పు లెక్క‌లే చూపిస్తున్నార‌ని పేర్కొన్నారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌ని టీఆర్ఎస్ పార్టీ వెబ్‌సైట్ నుంచి  మేనిఫెస్టోని సైతం తొలిగించిద‌ని తెలిపారు. (ఆ పార్టీలు రైతుల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి)

మరిన్ని వార్తలు