రాహుల్‌పై పోలీసుల తీరును ఖండిస్తున్నాం

2 Oct, 2020 13:20 IST|Sakshi

సాక్షి, న‌ల్గొండ : గాంధీ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ నాయ‌కులు నల్గొండ పట్టణంలో రామగిరిలో మహాత్మా గాంధీ విగ్రహనికి  పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్య‌క్ర‌మానికి సీనియర్‌ నాయ‌కుడు జానారెడ్డి, డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్, దుబ్బాక నర్సింహా రెడ్డి స‌హా కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేక బిల్లుల‌కు నిరసన‌గా సంతకాల సేకరణను చేప‌ట్టారు.

ఈ సంద‌ర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. 'వ్యవసాయ బిల్లులను పార్లమెంటరీ సంప్రదాయాన్ని అనుసరించకుండా మూజువాణి ఓటుతో తీసుకోచ్చారు. ఈ బిల్లులు వ్యవసాయదారులకి, వినియోగదారులకు ప్రమాదంగా మారే అవకాశం ఉంది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వీటి వల్ల మార్కెట్ వ్యవస్థ పోయి కార్పొరేట్ వ్యవస్థ వచ్చే అవకాశం ఉంది. దీనికి వ్యతిరేకంగా సంతకాలను సేకరించి కేంద్రానికి అందచేస్తాం' అని తెలిపారు. ప్రజాస్వామ్యంపై, మహిళలపై, దళితులపై, ప్రశ్నించే వారిపై కేంద్రం, రాష్ట్ర ప్ర‌భుత్వాలు దాడులకు పాల్పడుతున్నాయని దుయ్య‌బ‌ట్టారు. రాహుల్‌గాంధీపై పోలీసులు ప్ర‌వ‌రర్తించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాల్సిందిగా పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు