లౌకికవాదమే దేశానికి శ్రీరామరక్ష: భట్టి

15 Aug, 2022 00:55 IST|Sakshi

పెనుబల్లి: లౌకిక వాదమే దేశానికి శ్రీరామరక్షని... విచ్ఛిన్నకర శక్తులు దేశాన్ని మతం, కులాల పేరుతో ప్రజల్లో చిచ్చు రగులుస్తున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా కూసుమంచి నుంచి ‘ఆజాదీ కా గౌరవ్‌’ పేరుతో చేపట్టిన 75 కి.మీ. పాదయాత్ర ఆదివారం రాత్రి పెనుబల్లి మండలం వీఎం బంజర్‌ రింగ్‌ సెంటర్‌ వద్ద ముగిసింది.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో భట్టి మాట్లాడుతూ.. ఎనిమిదేళ్ల మోదీ పాలనలో దేశ ప్రజలకు చెప్పుకోదగ్గ ఒక్క పథకాన్ని కూడా రూపొందించలేదని విమర్శించారు. ఆహార భద్రత, ఉపాధి హామీ, అటవీ భూములకు పట్టాలు, బహుళార్థసాధక ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు కాంగ్రెస్‌ పాలనలోనే జరిగాయని ఆయన గుర్తు చేశారు.

బీజేపీ పార్టీ స్వాతంత్య్రోద్యమాన్ని పక్కదారి పట్టించే కుట్రలు చేస్తోందని విమర్శించారు. బహుళజాతి సంస్థలు, భూస్వాములు, పెట్టుబడిదారుల కింద ప్రతి ఒక్కరూ బానిసలుగా బ్రతకాల్సి వస్తుందనే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ..కాంగ్రెస్‌ త్యాగాలతోనే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించగా, బీజేపీ నేతలు తామే స్వాతంత్య్రాన్ని తీసుకొచ్చినట్లుగా చరిత్రను వక్రీకరిస్తున్నారని విమర్శించారు.  

మరిన్ని వార్తలు