కక్షతోనే ఆంక్షలు.. కేంద్రం తీరుతో రాష్ట్రానికి రూ. 40,000 కోట్ల గండి

25 Nov, 2022 02:46 IST|Sakshi

తెలంగాణ అభివృద్ధి ముందుకు సాగకుండా ఆర్థిక దిగ్బంధం: సీఎం కేసీఆర్‌ 

అకస్మాత్తుగా ఎఫ్‌ఆర్బీఎం పరిమితిలో కోత 

ఆర్థిక సంస్థల నుంచి రుణాలు రాకుండా అడ్డగింత 

రాజకీయ ప్రేరేపిత, కక్షపూరిత విధానాలు సరికాదు 

బీజేపీ ప్రభుత్వ తప్పుడు విధానాలు దేశాభివృద్ధికి గొడ్డలిపెట్టు 

అన్నిరాష్ట్రాల గొంతు కోస్తూ సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు 

ఈ అంశాలన్నింటినీ రాష్ట్ర ప్రజలకు వివరిద్దామని మంత్రులకు సూచన 

వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఎండగడతామని వెల్లడి

వివరాలతో ప్రకటన విడుదల చేసిన సీఎం కార్యాలయం 

సాక్షి, హైదరాబాద్‌: అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న అనవసర ఆంక్షలతో తీవ్ర నష్టం కలుగుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి సమకూరాల్సిన ఆదాయంలో రూ.40 వేల కోట్లకుపైగా గండిపడిందని, ఈ రాజకీయ ప్రేరేపిత, కక్షపూరిత విధానాలు సరికాదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియజేసేందుకు డిసెంబర్‌ నెలలో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డిలను ఆదేశించారు. ఈ మేరకు వివరాలతో సీఎం కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రకటనలోని అంశాలివీ.. 

అకస్మాత్తుగా పరిమితులు మార్చి.. 
‘‘ప్రతి ఆర్థిక సంవత్సరానికి ముందు కేంద్రం విడుదల చేసే బడ్జెట్‌ గణాంకాలను అనుసరించి రాష్ట్రాలు తమ బడ్జెట్‌ అంచనాలను రూపొందించుకుంటాయి. ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు ప్రతి రాష్ట్రానికి ఆనవాయితీగా ఎఫ్‌ఆర్బీఎం పరిమితులను ముందస్తుగా కేంద్రం విధిస్తోంది. 2022–23 ప్రారంభంలోనే తెలంగాణ ఎఫ్‌ఆర్‌బీఎం రుణాల పరిమితిని రూ.54 వేల కోట్లుగా     కేంద్రం ప్రకటించింది. దానికి అనుగుణంగా రాష్ట్రం బడ్జెట్‌ అంచనాలను రూపొందించుకుంది. కానీ కేంద్రం అకస్మాత్తుగా తెలంగాణ ఎఫ్‌ఆర్బీఎం రుణ పరిమితిని రూ.39 వేల కోట్లకు కుదించడంతో రాష్ట్రానికి అందాల్సిన రూ.15వేల కోట్లు తగ్గాయి. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న రాష్ట్రాలు ఎఫ్‌ఆర్బీఎం పరిమితికి అదనంగా 0.5 శాతం రుణాలు సేకరించుకునేందుకు నిబంధనలు అనుమతిస్తాయి.

ఆర్థికంగా అత్యంత పటిష్టంగా ఉన్న తెలంగాణకు మాత్రం ఈ అవకాశాన్ని ఇవ్వలేదు. వ్యవసాయ, రైతాంగ వ్యతిరేక విద్యుత్‌ సంస్కరణలను రాష్ట్రంలో అమలు చేస్తామంటేనే 0.5 శాతం అదనపు రుణ పరిమితికి అనుమతిస్తామని కేంద్రం ఆంక్షలు పెట్టింది. దీనితో మరో రూ.6 వేల కోట్ల రుణాలను సమీకరించుకునే అవకాశాన్ని రాష్ట్రం కోల్పోయింది. ఎన్ని కష్టాలనైనా భరిస్తామని.. కానీ తెలంగాణ రైతులకు, వ్యవసాయానికి నష్టం చేసే కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ సంస్కరణలకు ఒప్పుకోబోమని సీఎం కేసీఆర్‌ కేంద్రానికి ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.21 వేల కోట్ల నిధులు  కేంద్ర ప్రభుత్వ సంకుచిత విధానాల వల్ల నిలిచిపోయి రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయింది. అక్కడితో ఆగకుండా రాష్ట్రానికి రావాల్సిన రూ.20 వేల కోట్ల బడ్జెటేతర రుణాలను కూడా కేంద్రం నిలిపివేయించింది. ఈ అనాలోచిత విధానాలు, పూర్తి ఆర్థిక అజ్ఞానంతో కూడిన నిర్ణయాలతో రాష్ట్రానికి రావాల్సిన రూ.40వేల కోట్లకుపైగా నిధులకు గండిపడింది. 

ఒప్పంద రుణాలూ నిలిపివేసి.. 
ప్రజల అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే పలు ఆర్థిక సంస్థలతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం నిధులు (రుణాలు) సమీకరిస్తోంది. కానీ కేంద్రం ఆ నిధులను కూడా కక్షసాధింపు నిబంధనలతో రాకుండా నిలిపివేయించింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో అధికారులు ఆయా సంస్థలతో నిరంతర సంప్రదింపులు జరిపారు. రాష్ట్ర ప్రగతి కోసం వారిచ్చే రుణాలను తిరిగి చెల్లించే ఆర్థిక పరిపుష్టి కలిగి ఉన్నామని స్పష్టంగా వివరించారు. దీనిని అర్థం చేసుకున్న ఆర్థిక సంస్థలు రాష్ట్రం మీద భరోసాతో గత ఒప్పందాల మేరకు నిధులను విడుదల చేస్తున్నాయి. 

దేశ అభివృద్ధికి గొడ్డలిపెట్టు 
కేంద్రం అడుగడుగునా రాష్ట్రాన్ని ఆర్థిక దిగ్భంధం చేసి ప్రగతికి అడ్డుపుల్లలు వేస్తోంది. కేంద్ర అసమర్థ, అనుచిత నిర్ణయాలతో సకాలంలో నిధులు అందక అభివృద్ధి ఆగిపోయి రాష్ట్రాల ప్రగతి కుంటుపడే పరిస్థితులు దాపురిస్తున్నాయి. కేంద్ర తప్పుడు విధానాలు దేశాభివృద్ధికే గొడ్డలిపెట్టుగా మారే ప్రమాదం పొంచి ఉంది. పూర్తి ఆర్థిక అజ్ఞానంతో కూడిన, అనాలోచిత, అసంబద్ధ నిర్ణయాలతో ఒక్క తెలంగాణ ప్రగతిని మాత్రమే కాదు దేశ ఆర్థిక పరిస్థితిని కూడా కేంద్రం దిగజారుస్తోంది. రాజకీయ ప్రేరేపితమైన కక్షపూరిత దిగజారుడు విధానాలతో దేశంలోని అన్ని రాష్ట్రాల గొంతు కోస్తూ, నష్టపరుస్తూ, కేంద్రం సమాఖ్య స్పూర్తికి తూట్లు పొడుస్తోంది..’’ అని సీఎంఓ ప్రకటనలో పేర్కొంది. 

కక్షసాధింపు చర్యలపైనా నిలదీసేలా.. 
కేంద్ర ఆంక్షలతో నిధులు అందకపోవడాన్ని ప్రజలకు వివరించడం కోసం అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు కేసీఆర్‌ నిర్ణయించినా.. ఇతర కీలక అంశాలు కూడా ఎజెండాలో ఉండనున్నట్టు టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో ‘ఎమ్మెల్యేలకు ఎర’ అంశం తెరమీదికి రాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను ఏర్పాటు చేసింది. మరోవైపు మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, మల్లారెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని కొన్నిరోజులుగా ఆదాయపన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. దీనితో కేంద్రం సీబీఐ, ఐటీ, ఈడీ సంస్థలను అడ్డుపెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టీఆర్‌ఎస్‌ ఆరోపణలు చేస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకే ఎమ్మెల్యేల కొనుగోళ్లతోపాటు ఐటీ, ఈడీ సంస్థల ద్వారా దాడులకు పాల్పడుతోందనే అంశాన్ని అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ వివరించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన ప్రయత్నాలు, తాము అడ్డుకున్న తీరును కూడా ప్రజలకు వివరించాలని భావిస్తున్నట్టు సమాచారం.  

ఒకట్రెండు రోజుల్లో అసెంబ్లీ తేదీలు ఖరారు 
సీఎం కేసీఆర్‌ చెప్పిన మేరకు అసెంబ్లీ సమావేశాల తేదీలు ఒకట్రెండు రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష వర్గాలు వెల్లడించాయి. టీఆర్‌ఎస్‌ 2018లో రెండోసారి అధికారంలోకి వచి్చన తర్వాత ఇప్పటివరకు 11 సార్లు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించగా.. తొలిసారిగా శీతాకాలంలో సమావేశాలను నిర్వహిస్తోంది. 

మరిన్ని వార్తలు