కడుపులో పెట్టుకుంటం: సీఎం కేసీఆర్‌ 

24 Mar, 2023 03:22 IST|Sakshi
గురువారం మహబూబాబాద్‌ జిల్లా రెడ్డికుంట తండాలో పంట నష్టపోయిన రైతును పరామర్శిస్తున్న సీఎం కేసీఆర్‌

పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు ప్రకటించిన సీఎం కేసీఆర్‌ 

నిరాశ పడొద్దు..ధైర్యం కోల్పోవద్దంటూ విజ్ఞప్తి 

2,28,258 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వెల్లడి 

రూ. 228 కోట్లు గంటలోనే మంజూరు 

కరీంనగర్‌లో జీవో కాపీ కూడా చూపించిన ముఖ్యమంత్రి 

‘ఫస్ట్‌ టైం ఇన్‌ ఇండియా.. చాలా కాస్ట్‌లీ’ అంటూ వ్యాఖ్య 

కేంద్రానికి నివేదిక పంపడం లేదన్న కేసీఆర్‌ 

మా రైతుల్ని మేమే కాపాడుకుంటామని స్పష్టీకరణ 

నాలుగు జిల్లాల్లో ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటన 

పంటలు దెబ్బతింటే తెలిసీ తెలియక నష్టపరిహారం అంటారు. కానీ వాస్తవంగా దీన్ని సహాయ పునరావాస చర్యలు అంటారు. నష్ట పరిహారం అనేది ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేరు. సాధ్యం కాదు కూడా. మళ్లీ రైతు పుంజుకుని వ్యవసాయం చేసుకునేందుకు వీలుగా సహాయ సహకారాలు అందించాలి. అందుకే ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నాం.     
– సీఎం కేసీఆర్‌ 

సాక్షి ప్రతినిధులు ఖమ్మం, కరీంనగర్‌/సాక్షి, మహబూబాబాద్, వరంగల్‌/దుగ్గొండి:  ఇటీవలి అకాల వర్షాలకు రాష్ట్రంలోని 2,28,258 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని సీఎం కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ప్రభుత్వం తరఫున సహాయ పునరావాస చర్యగా దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రూ.228 కోట్లు గంటలోనే మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.

ఆ తర్వాత  కరీంనగర్‌లో సంబంధిత జీవో కాపీని కూడా చూపించారు. ‘ఇది చాలా కాస్ట్‌లీ. ఎకరానికి రూ.10 వేలు ఫస్ట్‌ టైమ్‌ ఇన్‌ ఇండియా. ఈ పంట.. ఆ పంట అని కాకుండా దెబ్బతిన్న ప్రతి ఎకరాకు ప్రకటిస్తున్నా. తక్షణమే ఈ సహాయం బాధిత రైతులకు అందుతుంది..’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

రైతులెవరూ అధైర్య పడొద్దని, అండగా ఉంటామని, కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. గురువారం ఆయన ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఉన్నతాధికారులతో కలిసి పర్యటించారు. ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం రావినూతల, గార్లపాడు గ్రామాల్లో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించారు.

మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాలో మొక్కజొన్న, మిర్చి, మామిడి తోటలను, వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం అడవిరంగాపురంలో వరి, టమాట పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. అడవి రంగాపురంలో పంట నష్టం చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని సందర్శించారు. పలుచోట్ల మీడియాతో మాట్లాడారు.  

కేంద్రానికి చెప్పినా దున్నపోతు మీద వాన పడినట్టే.. 
‘తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత రైతులకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేశాం. వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో మందుకెళ్తున్నాం. ఇటువంటి పరిస్థితిలో గాలి దుమారం, వడగళ్ల వాన రైతులను నిండా ముంచేసింది. మొక్కజొన్న 1,29,446 ఎకరాల్లో, వరి 72,709, మామిడి 8,865, ఇతర పంటలు 17,238 ఎకరాల్లో దెబ్బతిన్నాయి.

నర్సంపేటలాంటి ప్రాంతాల్లో పంటలు గుర్తుపట్టలేనంతగా పాడయ్యాయి. కరీంనగర్‌లో 100 శాతం దెబ్బతిన్నాయి. నేను హైదరాబాద్‌ నుంచే ఎకరానికి రూ.3 వేలు చెల్లిస్తామని చెప్పి చేతులు దులుపుకోవచ్చు. కానీ రైతుల కష్టాలు నాకు తెలుసు. రైతులు బాధ తెలిసిన వాళ్లంగా రైతుల వద్దకు వచ్చి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న కోడ్‌ ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు పెద్దగా రావు.

ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మరీ దుర్మార్గంగా, దౌర్భాగ్యంగా ఉంది. వారికి రాజకీయాలు తప్ప ప్రజలు లేరు.. రైతులు లేరు అనే పరిస్థితి ఉంది. చీఫ్‌ సెక్రటరీ, మేము పంటల నష్టంపై రాస్తే కేంద్ర బృందం వస్తుంది. ఎప్పుడు వస్తుందో.. ఏం సంగతో దేవునికి ఎరుక. వచ్చినా.. దొంగలు పడిన తర్వాత ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుగా ఆరు నెలలకు కాని రూపాయి రాదు.

కేంద్రం ఇస్తే మహద్భాగ్యంగా.. మొక్కజొన్నకు ఎకరానికి రూ.3,333, వరికి రూ.5,400, మామిడి తోటలు ధ్వంసం అయితే రూ.7,200.. ఇదీ ఉన్నటువంటి స్కేల్‌. ఇది ఏ మూలకూ సరిపోదు. గతంలో పంపినదానికి ఒక్క రూపాయి కూడా కేంద్రం ఇవ్వలేదు.

ఈ విధానాలకు నిరసనగా మేం కేంద్రానికి పంట నష్టంపై నివేదిక పంపదలుచుకోలేదు. చెప్పదలుచుకోలేదు.. చెప్పినా దున్నపోతు మీద వానపడినట్టే. భగవంతుడు తెలంగాణకు ఆర్థిక శక్తి ఇచ్చాడు. మా రైతులను మేమే కాపాడుకుంటాం. వందశాతం మేమే ఆదుకుంటాం..’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.  

రబ్బరు బంతిలా తిరిగి ఎగరాలి 
‘ఖమ్మం జిల్లా జిల్లాలో కౌలు రైతుల సంఖ్య ఎక్కువగా ఉంది. వీరిని కూడా ఆదుకునేలా సీఎస్‌కు చెప్పి.. జిల్లా కలెక్టర్‌కు ప్రత్యేక ఆదేశాలు ఇప్పిస్తాం. డబ్బు రైతుకు ఇవ్వకుండా కౌలు రైతులను ఆదుకునేలా లిఖితపూర్వక ఆదేశాలు ఇస్తాం. పంట నష్టపరిహారం విషయంలో 2015 నాటి జీవోను కూడా సడలిస్తాం. అయితే మొత్తానికి కాకుండా ప్రస్తుతం కౌలు రైతులకు జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని జీవోను రివైజ్‌ చేస్తాం.

తెలంగాణ ప్రభుత్వమే రైతు ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో రైతులు నిరాశకు గురి కావద్దు. ధైర్యం కోల్పోవద్దు. రబ్బరు బంతిలా తిరిగి ఎగిరే విధంగా, జరిగిన నష్టానికి ఏమాత్రం చింతించకుండా భవిష్యత్తులో ఉన్నతమైన పంటలు గొప్పగా పండించే ఆలోచనకు పోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. వానల ముప్పు ఇంకా తొలగిపోలేదు. మరో రెండు మూడురోజుల్లో వడగళ్లు మళ్లీ పడవచ్చు. అయినా అధైర్య పడొద్దు..’ అని సీఎం అన్నారు. 

దేశంలోనే నంబర్‌ వన్‌గా తెలంగాణ 
‘ఇప్పటికీ వ్యవసాయం దండగనే మూర్ఖులు, కొందరు మూర్ఖ ఆర్థికవేత్తలు ఉన్నారు. వ్యవసాయంతో ఏమీ రాదని చెప్పే వాళ్లూ ఉన్నారు. కానీ ఈ రోజు తెలంగాణ తలసరి ఆదాయం దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉంది. జీఎస్‌డీపీ పెరిగితేనే తలసరి ఆదాయం పెరుగుతుంది. జీఎస్‌డీపీ పెరుగుదలలో వ్యవసాయం పాత్ర చాలా పెద్దగా ఉంది. లక్షలాదిమంది పొట్ట పోసుకోవడానికి, అనేక రకాల ఉపాధులు కల్పించేలా వ్యవసాయం రంగం ఉంది.

ఒక అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దినం. రాష్ట్రంలో వ్యవసాయం అత్యున్నత స్థితిలో ఉంది. వలస వెళ్లిన రైతును తిరిగి రప్పించి, రైతుబంధు, రైతుబీమా, ఉచిత నీరు, ఉచిత విద్యుత్తు, నీటితీరువా రద్దు తదితర సదుపాయాలు కల్పించాం.

ఈ రోజు దేశం మొత్తం మీద చూస్తే తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాలన్నింట్లో వరి 50 లక్షల ఎకరాలు ఉంటే.. ఒక్క తెలంగాణలోనే 56 లక్షల్లో ఈ పంట ఉంది. ఇది మనందరికీ గర్వకారణం. రైతులు ఏమాత్రం నిరాశకు గురి కావద్దు. ప్రభుత్వం అండగా ఉంటుంది. అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా రూపుదాల్చుతాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. 

కొత్త వ్యవసాయ పాలసీ రావాలి 
‘దేశంలో ఒక పద్ధతి..పాడు అంటూ లేదు. ఇన్సూరెన్స్‌ కంపెనీలకు లాభం కలిగించే బీమాలే ఉన్నాయి తప్పితే.. పంట నష్టం జరిగినప్పుడు రైతుకు లాభం చేసే బీమాలు, కేంద్ర ప్రభుత్వ పాలసీలు లేవు. గత కేంద్ర ప్రభుత్వాలూ అంతే. ఇప్పుడున్న ప్రభుత్వమైతే చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే ఉంది. వాళ్లకు చెప్పినా.. గోడకు చెప్పినా ఒకటేలా అన్నట్లు పరిస్థితి ఉంది.

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత ఒక మాట చెబుతున్నాం. కొత్త వ్యవసాయ పాలసీ రావాలి..’ అని కేసీఆర్‌ అన్నారు. మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ కార్యదర్శి స్మిత సబర్వాల్, సీఎంఓ అధికారి రాహుల్‌ బొజ్జ, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి, ఎంపీలు సంతోష్‌కుమార్, వద్దిరాజు రవిచంద్ర, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీపీఎం, సీపీఐ కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు.  

బస్సులోనే మధ్యాహ్న భోజనం.. 
సమయం తక్కువగా ఉండడంతో సీఎం ఎక్కడా విరామం లేకుండా పర్యటించారు.  ఖమ్మం నుంచి మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాకు వచ్చిన కేసీఆర్‌.. ఉన్నతాధికారులు, మంత్రులు, ఎంపీలతో కలిసి బస్సులోనే మధ్యాహ్న భోజనం చేశారు. ముఖ్యమంత్రికి మంత్రి ఎర్రబెల్లి పెరుగన్నం వడ్డించారు.  

ధైర్యం చెప్పేందుకే వచ్చా.. 
కేసీఆర్‌ మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాలో రైతు సోమ్లా నాయక్‌ పంటను పరిశీలించారు. అనంతరం ఆయనతో మాట్లాడారు.  
సీఎం: అరే...మిర్చి పంటంతా పాడైంది కదా.. ఈ చేను ఎవరిది? 
రైతు: నాదే అయ్యా...నా పేరు సోమ్లా నాయక్‌.  
సీఎం: ఎన్ని ఎకరాల్లో మిర్చి వేసినవ్‌...ఎంత కాలంగా సాగు చేస్తున్నావు? 
రైతు: ఈ ఏడు రెండెకరాల్లో వేసినా. పదేళ్ల నుంచి మిర్చి సాగు చేస్తున్నా.  
సీఎం: మిర్చి మీద లాభాలు వస్తున్నాయా? 
రైతు: పోయినేడు నష్టమే వచ్చింది. ఈ సంవత్సరం ధర మంచిగానే ఉంది. క్వింటాల్‌కు రూ.20 వేలకు పైగా పలుకుతుందనుకుంటే మాయదారి రాళ్ల వాన నట్టేట ముంచింది.  
సీఎం: అవును ఈ ఏడు మిర్చికి బాగానే ధర ఉంది. కానీ పంటంతా నష్టపోయావు. ఇలాంటి పరిస్థితిలోనే మనసు నిబ్బరం చేసుకోవాలి. నీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. భవిష్యత్‌లో మరింత మెరుగ్గా వ్యవసాయం చేసుకునే విధంగా సౌకర్యాలు కల్పిస్తా.  
రైతు: అవును అయ్యా.. తెలంగాణ వచ్చిన తర్వాతే కరెంటు, నీళ్ల తిప్పలు పోయినయి.  
సీఎం: (రైతు భుజంపై చేయి వేసి) ఇది మన ప్రభుత్వం. రైతు ప్రభుత్వం. అందుకోసమే మీకు ధైర్యం కల్పించేందుకు వచ్చా. బాధ పడకండి..భయపడకండి. 

అటు తమ్మినేని.. ఇటు కూనంనేని.. 
కేసీఆర్‌ ఖమ్మం జిల్లా పర్యటనకు సీపీఎం, సీపీఐ కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. రావినూతల, గార్లపాడు గ్రామాల్లో ఇద్దరు నేతలు సీఎం వెంటే ఉండి పంటల పరిశీలనలో పాల్గొన్నారు.

జిల్లాలో పంట నష్టం వివరాలను తెలియజేయడంతో పాటు రైతులు, కౌలు రైతుల ఇబ్బందులను ఆయన దృష్టికి తెచ్చారు. ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు కుడి, ఎడమ సీట్లలో కూర్చున్నారు. రైతులు, కౌలు రైతులను ఆదుకోవాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశారు. 

మరిన్ని వార్తలు