ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు తీపికబురు!

5 Apr, 2021 02:59 IST|Sakshi

రిటైర్మెంట్‌ వయసు 61 ఏళ్లకు పెంపు 

ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌ 

మార్చి 30 నుంచి అమలుకు ఆదేశాలు    

గత నెలలో రిటైరైన వారికి మళ్లీ ఉద్యోగావకాశం 

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని.. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు (కార్పొరేషన్లు), గ్రాంట్‌–ఇన్‌–ఇన్‌స్టిట్యూషన్లు, సొసైటీలు, యునివర్సిటీలు (నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌), రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలోని ఇతర సంస్థల్లో సైతం అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదివారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఈ సంస్థలు తమ ఉద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును అడాప్ట్‌ చేసుకున్నాయని సీఎస్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు కోసం తీసుకొచ్చిన ‘తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ (రెగ్యులేషన్‌ ఆఫ్‌ సూపర్‌అన్యూయేషన్‌) చట్ట సవరణ’గత మార్చి 30 నుంచి అమల్లోకి వచ్చిందని, ఈ నేపథ్యంలో పైన పేర్కొన్న సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపును సైతం అదే తేదీ నుంచి అమలుపర్చాలని ఆదేశించారు.

ఆయా సంస్థల సర్వీసు రూల్స్‌కు ఈ మేరకు సవరణలు చేపట్టాలని కోరారు. ఇందుకు సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని తెలిపారు. పదవీ విరమణ వయసు పెంపునకు తీసుకున్న చర్యలపై నిర్దేశిత నమూనాలో రాష్ట్ర ఆర్థిక శాఖకు నివేదించాలని సూచించారు. గత నెల 30 నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని ఆదేశించడంతో.. గత నెల 31న పదవీ విరమణ చేసిన పైన పేర్కొన్న సంస్థల ఉద్యోగుల సర్వీసు మరో మూడేళ్లు పెరిగింది. మళ్లీ వారు విధుల్లో చేరేందుకు అవకాశం లభించింది.   

మరిన్ని వార్తలు