ప్రైవేటు టీచర్లపై సీఎం కేసీఆర్ వరాల జల్లు

9 Apr, 2021 04:07 IST|Sakshi

ప్రైవేటు టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వ సాయం

స్కూళ్ల మూసివేత నేపథ్యంలో ఆపత్కాల సాయాన్ని ప్రకటించిన సీఎం కేసీఆర్‌

ఏప్రిల్‌ నుంచి విద్యా సంస్థలు తిరిగి తెరిచేదాకా అందనున్న సాయం

1.45 లక్షల మంది ఉపాధ్యాయులు, సిబ్బందికి ఊరట

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారితో విద్యాసంస్థలు మూతపడి.. జీతాలు రాక తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ప్రైవేటు టీచర్లకు, సిబ్బందికి సాంత్వన కలిగించే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీసుకున్నారు. గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి నెలకు రూ.2,000 చొప్పున ఆపత్కాల ఆర్థికసాయం అందిస్తామని సీఎం గురువారం ప్రకటించారు. అలాగే ప్రతి కుటుంబానికి నెలకు 25 కేజీల బియ్యాన్ని రేషన్‌ షాపుల ద్వారా పంపిణీ చేస్తామని తెలిపారు. ఏప్రిల్‌ నుంచి విద్యాసంస్థలు తిరిగి తెరిచేదాకా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినెలా ఈ సాయం అందనుంది.

ఇందుకోసం ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంకు ఖాతా వివరాలతో స్థానిక జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని సీఎం సూచించారు. విద్యాశాఖ సమన్వయంతో ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కుటుంబాలను మానవీయ దృక్పథంతో ఆదుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేసీఆర్‌ తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 1.45 లక్షల మంది ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి లబ్ధి చేకూరుతుంది.

నేడు కలెక్టర్లతో సమీక్ష!
ప్రైవేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి ఆర్థిక సహాయం అందజేతపై శుక్రవారం ఉదయం 11.30 గంటలకు బీఆర్‌కేర్‌ భవన్‌ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మలను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా విద్యాశాఖ అధికారులు, పౌరసరఫరాల శాఖ డీఎస్‌ఓలు, ఇతర సిబ్బంది పాల్గొంటారు. ఆర్థిక సహాయానికి సంబంధించిన విధివిధానాలు, కార్యాచరణ ప్రణాళిక అమలుకు సూచనలు చేయనున్నారు.  

చదవండి: మంత్రి ప్రకటన: 13వ తేదీనే ఉగాది
చదవండి: ఫలితాల తర్వాత ఆమె ‘జై శ్రీరామ్‌’ అనక తప్పదు

మరిన్ని వార్తలు