బీజేపీ నో... డైలమాలో కాంగ్రెస్‌

27 Jun, 2021 03:18 IST|Sakshi

‘సీఎం దళిత సాధికారత’పై నేటి అఖిలపక్షానికి వామపక్షాల నుంచి చాడ, తమ్మినేని 

నేడు నిర్ణయించనున్న కాంగ్రెస్‌ 

దళితులను మోసగించేందుకే: బీజేపీ 

సాక్షి, హైదరాబాద్‌: ‘ముఖ్యమంత్రి దళిత సాధికారత’ కార్యక్రమంపై ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరగనుంది. దళితుల అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాల విధివిధానాల ఖరారుపై జరిపే ఈ ఉన్నత స్థాయి సమావేశానికి హాజరుకావాలని ప్రధాన రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. అయితే, ఈ భేటీని బహిష్కరిస్తున్నట్లు బీజేపీ ప్రకటించగా, కాంగ్రెస్‌ మాత్రం డైలమాలో ఉంది. వామపక్షాల నుంచి చాడ, తమ్మినేని హాజరవుతున్నట్లు ఆయా పార్టీలు ప్రకటించాయి. ఈ భేటీకి హాజరవుదామా వద్దా అనే విషయంలో కాంగ్రెస్‌ పార్టీలో కొంత మీమాంస నెలకొంది. సమావేశానికి వెళ్లాలా, గైర్హాజరవ్వాలా అనే విషయంపై ఆదివారం ఉదయం నిర్ణయం తీసుకుంటామని గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి.  

ఏడేళ్లుగా మోసం చేస్తూనే ఉన్నారు: బీజేపీ 
దళితుల అభివృద్ధిపై చర్చకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. దళితులను మోసం చేసే కార్యక్రమంలో భాగంగానే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ భేటీని ఏర్పాటు చేసిందని ధ్వజమెత్తింది. దళితుల గురించి మాట్లాడే నైతికత, అర్హత టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు లేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి శనివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తామని ప్రకటించి కేసీఆర్‌ మోసం చేశారని, ఇలా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి దళితులను టీఆర్‌ఎస్‌ మోసం చేస్తూనే ఉందన్నారు. గత ఏడేళ్లుగా మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు, దళితులు నమ్మే పరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు. దళితులకు సంబంధించి గతంలో చేసిన వాగా>్దనాలు ఏ మేరకు పూర్తిచేశారన్న దానిపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు. టీఆర్‌ఎస్‌ నుంచి దళితులు దూరమవుతున్నారని గ్రహించి.. మరియమ్మ ఘటన నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారే తప్ప దళితులపై ప్రేమతో కాదన్నారు.  

బహిష్కరణపై పార్టీ నేతలను సంప్రదించిన సంజయ్‌ 
అంతకుముందు రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలు, దళిత నాయకులతో అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గతంలో ఆర్భాటంగా ప్రకటించిన దళితులకు మూడెకరాల సాగుభూమి, దళితులపై కొనసాగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు విచారణ కమిషన్‌ వేయడం తదితర హామీల అమలు ద్వారా సీఎం కేసీఆర్‌ ముందుగా తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలనే అభిప్రాయం ఈ సందర్భంగా పార్టీనాయకుల్లో వ్యక్తమైంది. పాత వాగ్దానాలు అమలు చేశాక కొత్త వాటి గురించి మాట్లాడాలని, దళితులకు న్యాయం చేయకుండా అఖిలపక్ష భేటీకి బీజేపీ వెళితే తప్పుడు సంకేతాలు వెళతాయనే బండి సంజయ్‌ అభిప్రాయంతో ఇతర నాయకులు ఏకీభవించారు. 
 
వామపక్షాల నుంచి.. 
అఖిలపక్ష సమావేశానికి సీపీఐ నుంచి ఆ పార్టీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు బాలనర్సింహ, సీపీఎం నుంచి ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర సెక్రటేరియట్‌ సభ్యులు బి.వెంకట్, జాన్‌వెస్లీ హాజరుకానున్నారు.  
 
నేడు ఉదయం 11:30 గంటలకు భేటీ 
 ‘ముఖ్యమంత్రి దళిత సాధికారత’ కార్యక్రమంపై ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని ఎస్సీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. వీరితో పాటు వివిధ పార్టీల శాసనసభాపక్ష నేతలు, మాజీ సభ్యులు కడియం శ్రీహరి, మందా జగన్నాథం, మోత్కుపల్లి నర్సింహులు, ఆరెపల్లి మోహన్, జి.ప్రసాద్‌కుమార్‌ హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించి సభ్యులందరికీ వ్యక్తిగత ఆహ్వానాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంపారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. 

మరిన్ని వార్తలు