గవర్నర్‌కు జ్ఞానోదయం అయినందుకు సంతోషం: సీఎం

7 Aug, 2023 05:02 IST|Sakshi

ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు  

సాక్షి, హైదరాబాద్‌: ‘ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్‌ పాపం తెలిసో తెలియకో అనవసరంగా వివాదం కొని తెచ్చుకున్నారు. ఎందుకు పని పెట్టుకున్నారో తెలియదు. 96 క్లారిఫికేషన్లు అడిగారు. ఆ అంశాలన్నింటినీ ప్రభుత్వం పరిశీలించి, పరిగణనలోకి తీసుకున్నవే. మొత్తం మీద గవర్నర్‌కు జ్ఞానోదయమై ఆదివారం మధ్యాహ్నం బిల్లుకు ఆమోదం తెలిపి పంపినందుకు సంతోషం. ప్రభుత్వం, ఆర్టీసీ ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం..’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

ఆదివారం అసెంబ్లీలో ఈ అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘ఆర్టీసీని పెట్టిందే ప్రజారవాణా ఉండాలని. కాలక్రమేణా సంస్థ నష్టాల్లో పడింది. నేను రవాణా మంత్రిగా అంకితభావంతో పనిచేసి రూ.14 కోట్ల నష్టంలోని సంస్థను రూ.14 కోట్ల లాభాల్లోకి తెచ్చా. శక్తిసామర్థ్యాలుంటే సంస్థ నష్టాలను పూడ్చవచ్చు. కానీ డీజిల్‌ ధరల పెరుగుదలతో పరిస్థితి చేయిదాటింది. తమను ప్రభుత్వంలోకి తీసుకోవాలని గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే, తగిన డబ్బిస్తామని నడిపించుకోవాలని చెప్పాం. లాభాలు తీసుకురావాలని బెస్ట్‌ ఐపీఎస్‌ అధికారిని నియమించాం. మంచి అనుభవమున్న బాజిరెడ్డి గోవర్దన్‌ను చైర్మన్‌ను చేశాం.

వారు విశ్వప్రయత్నాలు చేసినా డీజిల్‌ ధరలు విపరీతంగా పెరగడంతో నష్టాలు మరింత పెరిగాయి. డీజిల్‌ లీటర్‌ రూ. 60 నుంచి రూ.110 కావడంతో ఆమాంతంగా ఖర్చు పెరిగి రోజుకు రూ.2.5 కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో ఇటీవల కేబినెట్‌లో.. గతంలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో కలపొద్దని అనుకున్నామని, ఇప్పుడేం చేద్దామని చర్చించాం. ప్రజలకు రవాణా సదుపాయం కల్పించడం ఏ ప్రభుత్వానికైనా సామాజిక బాధ్యత. పైగా ఆర్టీసీని తీసేయడానికి లేదు. అది మంచి నైపుణ్యాలున్న సంస్థ. జీరో యాక్సిడెంట్‌తో ప్రయాణికులను క్షేమంగా చేరవేసే సంస్థ. కానీ అది మనుగడ సాగించే అవకాశం లేదు.

దీంతో ప్రభుత్వమే సాకాలి. మరో దారిలేదు. ఇప్పటికే ఏడాదికి బడ్జెట్‌లో పెట్టి మరీ రూ.1,500 కోట్లు వారికి ఇస్తున్నాం. ప్రభుత్వంలో లేదన్న పేరే తప్ప గవర్నమెంటే సాదుతోంది. కాబట్టి ప్రభుత్వంలోకి తీసుకుందాం. ఉద్యోగులకు  భద్రత వస్తుంది. సంస్థకు చిక్కులు పోతాయనే ఉద్దేశంతో విలీనం నిర్ణయం కేబినెట్‌లో తీసుకున్నాం’ అని కేసీఆర్‌ వివరించారు.  

భూములపై కన్ను అంటూ నీచంగా మాట్లాడుతున్నారు.. 
‘గతంలో వద్దన్నవారే మళ్లీ ఎట్లా తీసుకున్నారని పిచ్చివాగుడు చేసే వాళ్లు ఉన్నారు. ప్రభుత్వం ఏ పనిచేసినా ఓ బాధ్యతతో, దృక్పథంతో, పరిశీలనతో చేస్తుంది. ఇక సగం సగం ఎందుకు పూర్తిగానే బాధ్యత తీసుకుందామని నిర్ణయించాం. మరో ఇద్దరు యువ ఐఏఎస్‌ అధికారులను పెట్టి ఆదాయం పెంచే చర్యలు తీసుకోవాలని అనుకున్నాం. కానీ ఆర్టీసీ ఆస్తులపై ప్రభుత్వం కన్నేసిందని  కొందరు దుర్మార్గులు, నీచులు మాట్లాడుతున్నారు.

ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? ఇంటి పిల్లవాడిని సాదుకోవాలి తప్ప చంపుకోలేము. మరిన్ని సౌకర్యాలు పెంచి, అవసరమైతే మరిన్ని స్థలాలు సేకరించి ప్రభుత్వ పరంగా సరీ్వసులు పెంచుతాం. ఆర్టీసీ ఉద్యోగులకూ పీఆర్‌సీ ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేవి వారికి కూడా వస్తాయి’ అని సీఎం తెలిపారు.   

మరిన్ని వార్తలు