తెలంగాణ సర్కారును.. కూల్చేస్తారా?

5 Dec, 2022 00:45 IST|Sakshi
మహబూబ్‌నగర్‌ ఎంవీఎస్‌ డిగ్రీ కాలేజీ ఆవరణలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన జనం. ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

ప్రధాని మోదీ అలా అనొచ్చా.. సమంజసమేనా?: కేసీఆర్‌

బీజేపీ సర్కారు విధానాలు ఎటువైపు దారితీస్తున్నాయంటూ ఫైర్‌ 

బెంగాల్‌లో 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారనీ అన్నారు 

తెలంగాణపై కుట్రలు చేస్తారా?

ఇక్కడి ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? 

మా ఎమ్మెల్యేలను చీల్చాలని చూసిన వారిని జైల్లో వేశాం

‘పాలమూరు’కు కేంద్రం సహకరించట్లేదు

అబద్ధాలు, కుట్రలతో దేశం కష్టాల్లో ఉంది 

మహబూబ్‌నగర్‌ సభలో ముఖ్యమంత్రి 

తెలంగాణ ఏర్పడిన రోజు రాష్ట్ర బడ్జెట్‌ రూ.65 వేల కోట్లు. అదిప్పుడు రూ.2.5 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుతం తెలంగాణ జీఎస్‌డీపీ రూ.11.50 లక్షల కోట్లు. ప్రధాని మోదీ సహకరిస్తే రూ.14.50 లక్షల కోట్లకు చేరేది. అసమర్థ కేంద్రం తీరుతో తెలంగాణ జీఎస్‌డీపీకి రూ.3 లక్షల కోట్లు నష్టం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సరిగా కలిసి పనిచేస్తేనే ఇలాంటి వాటిని అధిగమించే అవకాశం ఉంటుంది. 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ‘‘తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నట్టు చెప్పారు. ఈ విధానాలు ఎటువైపు దారి తీస్తున్నాయి? దేశంలో ఎక్కడో ఓ చోట తిరుగుబాటు రావాలనే.. మా ఎమ్మెల్యేలను చీల్చే ప్రయత్నం చేసిన వారిని జైల్లో వేశాం..’’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు.

ఎన్నో కలలతో సాధించుకున్న తెలంగాణపై కుట్రలు చేస్తే ప్రజలు ఎలా ఊరుకుంటారని పేర్కొన్నారు. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేనితనంతో అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మనం ఒక్కరమే బాగుపడితే చాలదని, దేశం కూడా బాగుపడాలని.. అందుకోసం తెలంగాణ తరఫున జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాన్ని, జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. కలెక్టరేట్‌లో పూజల అనంతరం కలెక్టర్‌ వెంకట్రావ్‌ను చాంబర్‌లోని సీట్లో కూర్చోబెట్టి అభినందించారు. తర్వాత ఎంవీఎస్‌ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. ప్రసంగం వివరాలు సీఎం కేసీఆర్‌ మాటల్లోనే.. 
 
‘‘అనేక దౌర్జన్యాలు, ఉద్వేగాలు, అబద్ధాలు, కుట్రలు, బాధలతో దేశం కష్టాల్లో ఉంది. మహనీయులు పోరాటాలతో సాధించిన స్వాతంత్య్రం ఇందుకేనా? భారత జీవనాడి కలుషితమవుతోంది. దీనిపై చర్చ జరగాలి. మేధావులు, విద్యార్థులు, యువత ఆలోచించాలి. 75ఏళ్ల స్వాతంత్య్రంలో ఇన్ని ఇబ్బందులా? దిక్కుమాలిన రాజకీయాల కోసం దేశ ప్రగతిని పక్కన పెట్టడం ఎంత వరకు సమంజసం. ప్రజాసంక్షేమానికి సంబంధించి వారు చేయరు, మమ్మల్ని చేయనివ్వరు. ఇదేం పద్ధతి? మేధావులు, విద్యార్థులు, యువత ఆలోచించాలి. మాకెందుకులే అనుకోవద్దు. 
 
పాలమూరు– రంగారెడ్డికి కేంద్రం అడ్డంకులు 
పాలమూరు ఎంపీగా తెలంగాణ సాధించాను. ఆ గౌరవం, కీర్తి ప్రతిష్టలు పాలమూరు జిల్లాకే దక్కుతాయి. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడి పరిస్థితి చూసి నడిగడ్డలో ఏడ్చిన. ఇక్కడి బాధలు, కష్టాలు, బొంబాయి బస్సుల వద్ద రోదనలను చూసి గుండె తరుక్కుపోయి.. తెలంగాణ సాధనకు నాపై మరింత ఒత్తిడి తెచ్చాయి.

ఇక్కడి పంట పొలాలకు సాగునీరు అందించి పచ్చని మాగాణిగా మార్చాలనే సంకల్పం నన్ను తెలంగాణ సాధనవైపు నడిపింది. పాలమూరు జిల్లాను ఎప్పటికీ మరువలేను. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయాలని పనులు ప్రారంభిస్తే కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. 
 
నీటి వాటా తేల్చేందుకు 8 ఏళ్లు సరిపోలేదా? 
గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ సభ పెట్టి పాలమూరుకో హమ్‌ బనాయేంగే అన్నారు. అంతా పైన పటారం, లోన లొటారం. పాలమూరుకు మోదీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఫ్లోరైడ్‌ జిల్లా నల్లగొండ, కరువు జిల్లా పాలమూరు, ఎండిపోయిన జిల్లా రంగారెడ్డికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి నేను దండం పెట్టి చెప్పిన. 150 దరఖాస్తులు ఇచ్చి పరిష్కరించాలని కోరిన.

ప్రధానంగా ఈ జిల్లాల్లో తాగు, సాగునీరు కోసం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును తీసుకొచ్చాం. కానీ కేంద్రానికి కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్ర వాటా తేల్చేందుకు ఈ ఎనిమిదేళ్లు సరిపోలేదు. మనం తెలంగాణ రాష్ట్రం వచ్చాక అన్ని పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం. పాలమూరు పచ్చగా పంటల జిల్లాగా మారింది.

ఒక్క పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తికావాల్సి ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు. అయినా మక్తల్, నారాయణపేట తదితర నియోజకవర్గాల్లో త్వరలో కాల్వలను పూర్తి చేస్తాం. 25 లక్షల నుంచి 30 లక్షల ఎకరాల్లో పంటలు పండించే రోజులు వస్తాయి. 
 
రైతులు అప్పుల్లేకుండా ఉండాలన్నదే లక్ష్యం 
దేశంలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే. ఐదేళ్లలో మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగబోమని ప్రకటించి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. తెలంగాణలో రైతులు అప్పులు లేకుండా ఉండాలన్నదే లక్ష్యం. నేడు దేశం మెచ్చిన రైతాంగం తెలంగాణ రాష్ట్రంలో ఉంది.

పక్కరాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల సరిహద్దుల్లోని రైతులు తమను తెలంగాణలో కలపాలని ఒత్తిడి తెస్తున్నారు. ఇక్కడి అభివృద్ధి పక్కరాష్ట్రాల్లో ఎందుకు జరగడం లేదు? మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌తో పాటు ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ప్రజలు ఇప్పటికీ నీటికోసం అల్లడుతున్నారు..’’అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

ఈ పర్యటనలో సీఎం వెంట మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీలు రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, కె.దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. కాగా సీఎం కేసీఆర్‌ పాలమూరు పర్యటనకు వెళ్తుండగా జడ్చర్లలో కొందరు బీజేవైఎం నాయకులు ప్లకార్డులు పట్టుకుని కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఇది గమనించి వారిని వెంటనే అడ్డుకుని, జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 
 
పాలమూరుకు వరాలు 

సభ సందర్భంగా పాలమూరుకు సీఎం వరాల జల్లు కురిపించారు. సభ జరిగిన ఎంవీఎస్‌ కాలేజీకి స్టేడియం, ఆడిటోరియం కోసం సోమవారమే జీవో విడుదల చేస్తామన్నారు. సొంత జాగా ఉంటే డబుల్‌ బెడ్రూం ఇంటికోసం రూ.3 లక్షలు ఇచ్చే పథకంలో ఈ నియోజకవర్గానికి అదనంగా వెయ్యి ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. పాలమూరు ఎంపీగా, అక్కడి కష్టాలు తెలిసిన వాడిగా ఉమ్మడి జిల్లాలోని 14 మంది ఎమ్మెల్యేలకు నియోజకవర్గ నిధుల కింద రూ.220 కోట్లు అదనంగా మంజూరు చేస్తామని ప్రకటించారు. 

ఆ ఊరి నుంచి ‘కంటి వెలుగు’ పుట్టింది 
‘‘గజ్వేల్‌ నియోజకవర్గంలో చిన్న గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేద్దామనుకున్నాం. ఊరివాళ్లకు విశ్వాసం కల్పించాలనే ఆలోచనతో ఉచిత నేత్ర వైద్య శిబిరం పెట్టాం. అంత చిన్న ఊరులో 127 మంది కంటి జబ్బులతో బాధపడుతున్నట్టు తేలింది. ఇందులో 27 మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు సరిగా చదవడం లేదని బడిలో టీచర్లు, ఇంట్లో తల్లిదండ్రులు కొడుతున్నారు. వారికి కళ్లు సరిగా కనబడక చదవడం లేదని తెలిసి బాధపడ్డాం.

వెంటనే ఆరోగ్యశాఖ మంత్రి, వైద్యారోగ్యశాఖ అధికారులతో మాట్లాడాం. కంటి వైద్యం విషయంలో చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. అందరికీ హైదరాబాద్‌లోని సరోజిని దవాఖానా ఒక్కటే. అంతకు మించి ఏమీ లేదు. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి చాలా ఆలోచించి ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని తీసుకువచ్చాం. అంతేతప్ప చిల్లరమల్లర రాజకీయాలు, ఓట్ల కోసం కాదు. త్వరలో కంటి వెలుగు రెండో దశ చేపట్టబోతున్నాం..’’ అని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. 
 
జై భారత్‌.. జై తెలంగాణ.. 
‘‘మనం ఒక్కరమే బాగుపడితే కాదు.. దేశం కూడా బాగుపడాలే.. అందుకోసం తెలంగాణ తరఫున జాతీయ రాజకీయాల్లో సైతం చురుకైన పాత్ర వహించాల్సిన అవసరముంది. మీరు ఇక్కడ గట్టిగా చూసుకుంటామంటే అక్కడ నేను గట్టిగా చూసుకుంటా.. బీఆర్‌ఎస్‌ ఒకేనా. బీఆర్‌ఎస్‌తో అందరం కలిసిపోదాం. భగవంతుడిపై నమ్మకంతో సర్వశక్తులు ఒడ్డి తెలంగాణతో పాటు దేశాన్ని బాగు చేసుకుందాం..’’ అని సభలో సీఎం కేసీఆర్‌ పేర్కొనగా ప్రజలు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌తోపాటు జనాలు ‘జై భారత్‌.. జై తెలంగాణ..’ నినాదాలు చేశారు. 
 
కేసీఆర్‌ నోట.. పాలమూరు పాట 
పాలమూరు కష్టాలు, బాధలు చూసి మిత్రులు గోరటి వెంకన్న, సాయిచంద్‌కు పాటలు రాయాలని సూచించానని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ‘పల్లె పల్లెలో పల్లేర్లు మొలిచే పాలమూరులోనా’ అనే పాటను తానే రాయమన్నానని.. ఇప్పుడా పల్లేర్లు మాయం అయ్యాయని పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కష్టాలు, ఇప్పుడవి తొలగిపోవడంపై సీఎం కేసీఆర్‌ స్వయంగా కాస్త పాట పాడి వినిపించారు. 

‘‘వలసలతో వలవల విలపించు పాలమూరు.. పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తి చేసి.. చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి.. పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నద’ని రాయమన్నానని వివరించారు.   

మరిన్ని వార్తలు