అపెక్స్‌ భేటీలో దీటైన సమాధానం

1 Oct, 2020 01:54 IST|Sakshi

మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను చెప్పాలి 

కేంద్ర నిష్క్రియాపరత్వాన్ని, అలసత్వాన్ని ఎండగట్టాలి 

అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌: ‘నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ కావాలనే కయ్యం పెట్టుకుంటోంది. అపెక్స్‌ సమావేశంలో ఆ రాష్ట్రం చేస్తున్న వాదనలకు దీటైన సమాధానం చెప్పాలి. మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను స్పష్టం చేయాలి. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని, ఏడేళ్ల అలసత్వాన్ని ఎండగట్టాలి. తెలంగాణ హక్కులను హరించడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రతిఘటించాలి’అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ఆదేశించారు. అక్టోబర్‌ 6న జరిగే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సీఎం కేసీఆర్‌ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ‘రాష్ట్రాల పునర్విభజన చట్టాల ప్రకారం.. దేశంలో ఎప్పుడైనా కొత్త రాష్ట్రం ఏర్పడితే వెంటనే ఆ రాష్ట్రానికి నీటిని కేటాయించాలి. 2014, జూన్‌ 2న తెలంగాణ ఏర్పడితే జూన్‌ 14న ప్రధానికి లేఖ రాశాం.

ఇంటర్‌ స్టేట్‌ రివర్‌ వాటర్‌ డిస్ప్యూట్‌ యాక్ట్‌ 1956 సెక్షన్‌ 3 ప్రకారం.. ప్రత్యేక ట్రబ్యునల్‌ వేసైనా తెలంగాణకు నీటి కేటాయింపులు జరపాలని కోరాం. తెలంగాణ, ఏపీ మధ్య లేదా నదీ పరివాహక రాష్ట్రాల మధ్య అయినా.. నీటి పంపిణీ జరపాలని విజ్ఞప్తి చేశాం. ఏడేళ్లు దాటినా ఆ లేఖకు ఈ నాటికి స్పందన లేదు. పైగా అపెక్స్‌ సమావేశాల పేరిట ఏదో చేస్తున్నట్లు భ్రమింపజేస్తున్నారు. కానీ, కేంద్రం చేస్తుంది ఏమీ లేదు. 6న జరిగే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా గట్టిగా ఎండగట్టాలి. తెలంగాణకు నీటి కేటాయింపుల విషయంలో స్పష్టత ఇవ్వాలని పట్టుపట్టాలి’అని కేసీఆర్‌ అధికారులకు చెప్పారు. తెలంగాణ కోరుతున్న న్యాయమైన డిమాండ్ల విషయంలో అవసరమైన అన్ని వాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.  

 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు