బటన్‌ ఒత్తినమంటే నీరు చివరిదాకా పారాలి

26 May, 2021 03:41 IST|Sakshi

 కాళేశ్వరం నీటితో అన్ని చెరువులు, రిజర్వాయర్లు నింపాలి 

 మేడిగడ్డ నుంచి తుంగతుర్తి దాకా ఉన్నవన్నీ నిండేలా చూడాలి

 పంటలకు నీరందించేందుకు అధికారులు సంసిద్ధం కావాలి 

 సీఎం కేసీఆర్‌ ఆదేశం ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై సమీక్ష 

వేలకోట్లు ఖర్చు పెట్టి కడుతున్న సాగునీటి ప్రాజెక్టులను వ్యూహాత్మకంగా రైతు సంక్షేమానికి వినియోగించే విధానాలు అవలంబించాలి. 

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని లిఫ్టు పథకాలన్నింటికీ ఒకేసారి టెండర్లు.

రైతు పండించే పంట రైతుకు మాత్రమే చెందదు. అది రాష్ట్ర సంపదగా మారుతుందనే విషయాన్ని గ్రహించాలి. 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వరప్రదాయి నిగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, వానా కాలం సీజన్‌ ప్రారంభం అయిన వెంటనే నీటిని ఎత్తిపోసి.. మేడిగడ్డ నుంచి తుంగతుర్తి దాకా ఉన్న అన్ని చెరువులను, రిజర్వాయర్లను, చెక్‌ డ్యాములను నింపాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఇప్పటికే కాళేశ్వరం నీటితో 90 శాతం చెరువులు, కుంటలు నిండి ఉండడంతో భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. బోర్లలో నీరు పుష్కలంగా లభిస్తున్న నేపథ్యంలో రైతులు వరిపంట విస్తృతంగా పండిస్తున్నారని చెప్పారు.

ప్రస్తుతం రోహిణి కార్తె ప్రారంభమైనందున, నారుమడి సిద్ధం చేసుకుంటే వరిపంటకు చీడపీడల నుంచి రక్షణ లభిస్తుందని, అధిక దిగుబడి వస్తుందనే విశ్వాసంతో రైతులు ఉంటారనీ, ఈ దృష్ట్యా పంటలకు నీరందించేందుకు ఇరిగేషన్‌ శాఖ సంసిద్ధం కావాలని సూచించారు. మంగళవారం ప్రగతి భవన్‌లో ఇరిగేషన్‌ శాఖ అధికారులతో సీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. గోదావరి బేసిన్‌లో చేపట్టిన ప్రాజెక్టుల పురోగతి, కృష్ణా బేసిన్‌లోని కొత్త లిఫ్టుల పనులు, వానాకాలం ఆరంభం అవుతున్న నేపథ్యంలో కాల్వల మరమ్మతులు వంటి అంశాలపై కేసీఆర్‌ చర్చించి పలు ఆదేశాలిచ్చారు.  

వచ్చిన నీటిని వచ్చినట్టే ఎత్తిపోయాలి 
‘ప్రాణహిత ప్రవాహం జూన్‌ 20 తర్వాత ఉధృతంగా మారుతుంది. అప్పడు వచ్చిన నీటిని వచ్చినట్టే ఎత్తిపోసి కాళేశ్వరం పరిధిలోని చెరువులు, కుంటలు, రిజర్వాయర్లను నింపుకోవాలె. కాల్వల మరమ్మతులు కొంత మిగిలి ఉన్నాయి. వాటిని సత్వరమే పూర్తి చేసుకొని, ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటినెన్స్‌ చేపట్టాలి. కాళేశ్వరాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. రూ.4 వేల కోట్లతో నిర్మిస్తున్న చెక్‌ డ్యామ్‌లు నీటి నిల్వను చేస్తూ అద్భుతమైన ఫలితాలు అందిస్తున్నయి. జూన్‌ 30 వరకు మొదటి దశ చెక్‌డ్యామ్‌లన్నింటినీ పూర్తి చేయాలి. 50 వేల చెరువుల్లో నిరంతరం నిండుకుండల్లా నీటిని నిల్వ ఉంచుకోవాలి..’ అని ముఖ్యమంత్రి సూచించారు.  

వ్యవసాయంతో 17 శాతం ఆదాయం 
    ‘రైతు పండించే పంట రైతుకు మాత్రమే చెందదని, అది రాష్ట్ర సంపదగా మారుతుందనే విషయాన్ని అంతా గ్రహించాలి. మొదటి దశ కరోనా కష్టకాలంలో రైతు పండించిన పంట ద్వారా 17 శాతం ఆదాయం అందించి రాష్ట్ర జీఎస్‌డీపీలో తెలంగాణ వ్యవసాయం భాగస్వామ్యం పంచుకుంది. రాష్ట్ర రెవెన్యూకు వెన్నుదన్నుగా నిలిచింది. ఇరిగేషన్‌ శాఖ కృషితో తెలంగాణ సాగునీటి రంగం, వ్యవసాయ రంగం ముఖచిత్రం మారిపోయింది.  ఒక్క కాళేశ్వరం ద్వారానే 35 లక్షల ఎకరాల్లో రెండు పంటలను పండించే స్థాయికి చేరుకున్నామంటే ఆషామాషీ కాదు. ధాన్యం దిగుబడిలో తెలంగాణ నేడు పంజాబ్‌ తర్వాత రెండో పెద్ద  రాష్ట్రంగా అవతరించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ వ్యవసాయాన్ని నాటి పాలకులు నిర్లక్ష్యం చేశారు.

ఫలితంగా రైతులు రూ.50 వేల కోట్ల సొంత ఖర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల బోర్లు వేసుకున్నారు. భార్యల మెడల మీది పుస్తెలమ్మి వ్యవసాయం చేసిన దీనస్థితి నాటి రైతులది. కానీ నేడు కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల నీళ్లతో భూగర్భజలాలు పెరగడం వల్ల నాడు తవ్వుకున్న బోర్లు నేడు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టు నీళ్లతో సాగవుతున్న ఆయకట్టుకు సమానంగా బోర్ల ద్వారా నేడు తెలంగాణ రైతులు పంటలు పండిస్తున్నారు. గోదావరి మీద కట్టుకున్న ప్రాజెక్టుల్లో గోదావరి నదీ గర్భంలోనే 100 టీఎంసీల నీటిని నిల్వచేసుకునే  స్థాయికి చేరుకున్నాం..’ అని కేసీఆర్‌ వివరించారు. 

15 లిఫ్టులకు ఒకేసారి టెండర్లు 
‘నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో, దేవరకొండ నుంచి కోదాడ వరకు ప్రభుత్వం ఇప్పటికే నిర్మించ తలపెట్టిన 15 లిఫ్టు పథకాల నిర్మాణ అంచనాలను జూన్‌ 15 వరకు పూర్తి చేసి అన్నింటికీ ఒకేసారి టెండర్లు పిలవాలి. అందుకు సంబంధించి ఇరిగేషన్‌ అధికారులతో సమన్వయ బాధ్యతలను మంత్రి జగదీష్‌రెడ్డి తీసుకోవాలి. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో ఇటీవల శంకుస్థాపన చేసిన నెలికల్లు లిప్టు కింద ఆయకట్టును 24 వేల ఎకరాలకు పెంచిన నేపథ్యంలో పాత టెండర్‌ను రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవాలి. ఇందుకు సంబంధించిన టెండర్‌ ప్రక్రియను వారంరోజుల్లో పూర్తి చేయాలి..’ అని ఆదేశించారు. 

ఓఅండ్‌ఎం పక్కాగా ఉండాలి...    
    ‘కాల్వల మరమ్మతులు, ఇతర అవసరాలకై ఇరిగేషన్‌ శాఖకు రూ.700 కోట్లు కేటాయించిన దృష్ట్యా ఆపరేషన్‌ అండ్‌ మెయింటినెన్స్‌ (ఓఅండ్‌ఎం) పక్కాగా ఉండాలి. రానున్న సీజన్‌కు గేట్ల మరమ్మతులు, కాల్వల మరమ్మతులు పూర్తిచేసి సిద్ధంగా ఉంచాలి. కాళేశ్వరంలో బటన్‌ ఒత్తినం అంటే చివరి ఆయకట్టు దాకా ఎటువంటి ఆటంకం లేకుండా నీరు ప్రవహించి పొలాలకు చేరాలె. అలా సర్వం సిద్ధం చేసిపెట్టుకోవాలñ...’ అని సూచించారు. 

ఇరిగేషన్‌ శాఖలో ఖాళీలన్నీ భర్తీ 
    ‘అత్యంత ప్రాధాన్యత ఉన్న ఇరిగేషన్‌ శాఖలో ఏ పోస్టు కూడా ఖాళీగా ఉండకూడదు. ఎప్పటికప్పుడు అర్హులకు ప్రమోషన్లు ఇస్తూ ఖాళీలను వెంటవెంటనే భర్తీ చేయాలి.   ఇరిగేషన్‌ శాఖకున్న ప్రత్యేకావసరాల దృష్ట్యా నియామక ప్రక్రియను బోర్డు ద్వారా సొంతంగా నిర్వహించుకునే విధానాన్ని అమలు చేస్తాం. కాల్వల నిర్వహణ కోసం త్వరలో లష్కర్లు, జేఈల నియామకాన్ని చేపడతాం. కింది స్థాయి నుంచి పైస్థాయి దాకా ఖాళీల వివరాలు తక్షణమే అందజేయాలి.

మేజర్‌ లిఫ్టులు, పంపులు ఉన్న దగ్గర స్టాఫ్‌ క్వార్టర్ల నిర్మాణం చేపట్టి, తక్షణమే పూర్తి చేయాలి. కాంట్రాక్టర్ల క్యాంపుల నిర్మాణాలకు భూసేకరణ నిలిపివేయాలి..’ అని కేసీఆర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు జి. జగదీష్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌ రెడ్డి, మాదిరెడ్డి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, హన్మంత్‌ షిండే, శానంపూడి సైదిరెడ్డి, ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌ కుమార్, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, ఈఎన్సీ మురళీధర్‌ రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే, ఈఎన్సీలు హరిరామ్, వెంకటేశ్వర్లు, సలహాదారు పెంటారెడ్డి పాల్గొన్నారు. 

వచ్చే ఏడాదికల్లా ‘సీతమ్మ సాగర్‌’ 
    ఖమ్మం జిల్లాలో చేపడుతున్న సీతమ్మసాగర్‌ బ్యారేజీ పనులు వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించి తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు స్మితా సభర్వాల్, శ్రీధర్‌ దేశ్‌పాండే దృష్టి్టకి తీసుకురావాలన్నారు. సీతారామ ఎత్తిపోతలు నిర్మాణంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా బంగారు పంటలతో, బంగారు తునకగా మారుతుందని చెప్పారు. ఇక వీటితో పాటే హుస్నాబాద్, పాత మెదక్, ఆలేరు, భువనగిరి, జనగామ జిల్లాలకు నీరందించే మల్లన్న సాగర్‌ను త్వరగా పూర్తి చేయాలని కేసీఆర్‌ సూచించారు.    
 

మరిన్ని వార్తలు