చిత్తశుద్ధి.. సమన్వయం: అభివృద్ధిలో ‘చక్రాపూర్‌’ ఆదర్శం

29 Jun, 2021 16:18 IST|Sakshi

జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీగా  చక్రాపూర్‌

సర్పంచ్‌కు సీఎం కేసీఆర్‌ అభినందన

సాక్షి, మహబూబ్‌నగర్: పాలకవర్గం చిత్తశుద్ధి.. గ్రామస్థుల సంపూర్ణ సహకారం.. అధికారుల ప్రోత్సాహం వెరసి చక్రాపూర్‌ గ్రామ పంచాయతీ అభివృద్ధిలో దూసుకుపోయింది. జాతీయస్థాయి అవార్డును సొంతం చేసుకుంది. పరిశుభ్రత, పారిశుధ్యం, పచ్చదనానికి ఆ గ్రామం ఇప్పుడు కేరాఫ్‌గా మారింది. ఇతర గ్రామ పంచాయతీలకు ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామసర్పంచ్, వార్డు సభ్యులపై అభినందనలు వెల్లువెత్తున్నాయి.

చక్రాపూర్ గ్రామం మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలంలో ఉంది. 1638 మంది  జనాభా ఉంది. నిన్నమొన్నటి వరకు ఈ గ్రామ పంచాయతీ కూడ అన్ని పంచాయతీల మాదిరిగానే ఉండేది. కాని అభివృద్ధి పథకంలో సాగిన ఈ గ్రామం.. ఇప్పుడు జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దీన్‌దయాల్ ఉపాధ్యాయ పంచాయితీ సశక్తి కరణ్‌ కింద జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. 2019లో సర్పంచ్‌గా కొండపల్లి శైలజా ఎన్నికైన తర్వాత వార్డు సభ్యులు, గ్రామస్థులతో సమన్వయంతో వ్యవహరించి అధికారులు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సహకారంలో గ్రామాభివృద్ధికి బాటలు వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.

జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మించారు. వంద శాతం మరుగుదొడ్లు నిర్మించారు. 7 లక్షల 50 వేలతో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్‌ ఇచ్చి మిషన్ భగీరథ పథకం ద్వారా సురక్షిత తాగునీటిని సరఫరా చేస్తున్నారు. 12 లక్షల 50 వేలతో వైకుంఠ ధామం, 2 లక్షల 50 వేలతో డంపింగ్ యార్డ్, 2లక్షలతో ప్రభుత్వ నర్సరీ, లక్షా 40 వేలతో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. గ్రామంలో కంపోస్టు ఎరువు తయారు చేసే విధానాన్ని ప్రారంభించారు. త్వరలో ఎరువును సైతం  బ్యాగుల్లో నింపేందుకు సిద్ధం అయ్యారు. ఆ ఎరువును గ్రామంలో పెంచుతున్న మొక్కలకు ఎరువుగా వాడనున్నట్టు సర్పంచ్ శైలజా తెలిపారు. అధికంగా ఉంటే ఇతరులకు విక్రయించి వచ్చే ఆదాయాన్ని గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తామని ఆమె తెలిపారు.

ప్రతి ఇంటికి రెండు చెత్త బుట్టలను పంపిణీ చేశారు. పొడిచెత్తా, తడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలించి ఎరువును తయారు చేస్తున్నారు. ఎరువు తయారీలో ఈ గ్రామంలో మండలంలోనే మొదటి గ్రామంగా నిలిచింది. గ్రామంలోని రహదారులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయటం, మురుగుకాల్వల్లో చెత్తను తీసివేయటం చేస్తూ పారిశుధ్యం లోపించకుండా చూస్తున్నారు. వీధి దీపాల ఏర్పాటు, మొక్కల పెంపుదల వంటి వాటిలో కూడ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. గ్రామస్దులు కూడ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఇంటిపన్నులు సకాలంలో చెల్లిస్తుండటంతో వందశాతం ఇంటిపన్ను వసూలు అవుతోంది.

ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తమ గ్రామం భాగస్వామ్యం కావాలనే ఉద్దేశ్యంతో సర్పంచ్ శైలజా వార్డు సభ్యులు ఆసక్తిగా పాల్గొంటుండటంతో అభివృద్ది సాధ్యమవుతుందని అంటున్నారు. అయితే 44వ జాతీయ రహదారి నుంచి ఈ గ్రామం 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అందులో సగం వరకు రహాదారి బాగున్నా మిగిలిన సగం గతుకుల మయంగా మారిందని ఆ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. తమ గ్రామానికి దేశస్థాయియిలో గుర్తింపు రావటంపై గ్రామస్దులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల కేంద్రం ప్రకటించిన దీన్‌ దయాల్ ఉపాధ్యాయ పంచాయితీ సశక్తి కరణ్‌ కింద జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీగా  చక్రాపూర్‌ ఎంపిక కావటం సర్పంచ్‌గా తనకు ఎంతో గర్వంగా ఉందని సర్పంచ్ శైలజా తెలిపారు. ఈ అవార్డు రావటం తన బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. ఈ అవార్డు రావటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో గ్రామాభివృద్ది శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. అవార్డు రావటంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సర్పంచ్‌ శైలజను ప్రగతి భవన్‌కు పిలిచి సత్కరించి అభినందించారు. పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సర్పంచ్,గ్రామవార్డు  సభ్యులను అభినందించారు.

చదవండి: ‘మొక్క’వోని దీక్ష.. అంత పెద్ద చెట్టును మళ్లీ నాటాడు!
Telangana: డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదల

మరిన్ని వార్తలు