గవర్నర్‌ తమిళిసైతో సీఎం కేసీఆర్‌ భేటీ

30 Aug, 2020 08:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్యరాజన్‌తో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఇటీవల గవర్నర్‌ బాబాయి, తమిళనాడులోని కన్యాకుమారి ఎంపీ వసంత్‌కుమార్‌ మృతిపై సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. రాజ్‌భవన్‌కు వచ్చి సంతాపం తెలిపిన ముఖ్యమంత్రికి గవర్నర్‌ తమిళిసై ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి వెంట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌కుమార్‌, మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, రైతు బంధు సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఉన్నారు.

అగస్తీశ్వరంలో అంత్యక్రియలు
కాగా కరోనా వైరస్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వసంత్‌కుమార్‌ శుక్రవారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఆదివారం ఉదయం కన్యాకుమారి జిల్లా అగస్తీశ్వరంలో జరగనున్నాయి. ఇక పదవీకాలం ముగియకుండా మరణించిన ప్రజాప్రతినిధుల నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగడం సహజం. అయితే వసంతకుమార్‌  ప్రాతినిధ్యం వహించిన కన్యాకుమారీ లోక్‌సభ నియోజకవర్గంలో అర్థ శతాబ్ధం విరామం తర్వాత ఉప ఎన్నికల పరిస్థితి చోటుచేసుకోవడం గమనార్హం. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వసంత్‌కుమార్‌ గెలుపొందగా, ఆయన పదవీకాలం ఇంకా నాలుగేళ్లు ఉంది. 

మరిన్ని వార్తలు