SCCL: ఒక్కో కార్మికుడికి రూ.1.15 లక్షలు

7 Oct, 2021 02:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి బొగ్గు గనుల సంస్థ కార్మికులకు ప్రకటించిన 29 శాతం లాభాల బోనస్‌ సొమ్మును ఈ నెల 11న చెల్లించనున్నట్టు సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీని కింద రూ.79.07 కోట్లను కార్మికులకు పంపిణీ చేస్తామన్నారు. అలాగే ఇటీవల ప్రకటించిన దీపావళి బోనస్‌ (ప్రొడక్షన్‌ లింక్డ్‌ రివార్డ్‌ బోనస్‌)ను నవంబర్‌ 1న కార్మికుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ఇందుకోసం సంస్థ రూ.300 కోట్లను వెచ్చిస్తోందని, ప్రతి కార్మికుడు రూ.72,500 అందుకోనున్నాడని వివరించారు. ఇక పండుగ అడ్వాన్స్‌ కింద ప్రతి కార్మికుడికి రూ.25 వేల చొప్పున సంస్థ ప్రకటించిందని, ఈ డబ్బును ఈ నెల 8వ తేదీన చెల్లించనుందని పేర్కొన్నారు.

పై రెండు రకాల బోనస్‌లు, పండుగ అడ్వాన్స్‌ కలిపి కార్మికులు సగటున రూ.1.15 లక్షల వరకు రానున్న మూడు వారాల్లో అందుకోనున్నారని తెలిపారు. ఈ మొత్తాన్ని దుబారా చేయకుండా వినియోగించుకోవాలని, పొదుపు చేయడం లేదా గృహావసరాలకు వాడుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో మరింతంగా ఉత్సాహంగా, కలిసికట్టుగా పనిచేస్తూ నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని, తద్వారా ఈ ఏడాది మరింత మెరుగైన బోనస్‌లు, సంక్షేమం అందుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగుల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. కార్మికులకు దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. 
చదవండి: సాగర్‌ను పరిశీలించిన కేఆర్‌ఎంబీ ఇంజనీర్లు 

మరిన్ని వార్తలు