పనులు పరుగెత్తాలి: సీఎం కేసీఆర్‌

10 Jan, 2022 02:47 IST|Sakshi

సాగునీటి లక్ష్యం ఛేదించాలి: ముఖ్యమంత్రి కేసీఆర్‌

కొత్త ప్రాజెక్టులకు టెండర్లు పిలవండి.. మిగిలిపోయిన పనులకు కూడా .. 

నీటిపారుదల శాఖకు సీఎం కేసీఆర్‌ ఆదేశం

ఐదు ప్రాజెక్టులను గెజిట్‌ నోటిఫికేషన్‌ నుంచి తొలగించేలా చర్యలు చేపట్టండి

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత ఏడాదిలో చేయాల్సిన ముఖ్యమైన నీటిపారుదల ప్రాజెక్టుల పనులకు టెండర్లు పిలవాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. నాగార్జునసాగర్‌ ఎడమ కాలువపై నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకాలు, గట్టు ఎత్తిపోతల పథకం, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు మిగులు పనులు, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిపోయిన రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల పనులకు టెండర్లు పిలవాలని నీటిపారుదల శాఖను ఆదేశించారు.

అలాగే డా.బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా నిర్మించాల్సిన బ్యారేజీ, చెన్నూర్‌ ఎత్తిపోతల పథకం, కడెం నదిపై నిర్మించ తలపెట్టిన కుప్టి ప్రాజెక్టులకు టెండర్లు పిలవాలని సూచించారు. నీటిపారుదల, వైద్యారోగ్యం, రోడ్లు, భవనాల శాఖలపై ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాజెక్టులను పూర్తి చేస్తే రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రతిపాదించిన ముఖ్యమైన ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తవుతాయని చెప్పారు. సాగునీటి రంగంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకుంటామన్నారు. 

అనుమతులు రాకపోవడంపై అసహనం
సీతారామ, సమక్కసాగర్, ముక్తేశ్వర (చిన్నకాళేశ్వరం) ఎత్తిపోతల, చెనాక కొరాట బ్యారేజీ, చౌటుపల్లి హన్మంత్‌ రెడ్డి ఎత్తిపోతల, మోడికుంట వాగు ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించి ఐదు నెలలు గడిచినా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి ఇంకా అనుమతులు రాకపోవడం పట్ల ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. సీడబ్ల్యూసీ కోరుతున్న అన్ని వివరాలు, అదనపు సమాచారాన్ని సమర్పించి త్వరితగతిన అనుమతులు పొందాలని అధికారులను ఆదేశించారు. ప్రాణహిత ప్రాజెక్టు డీపీఆర్‌ను సత్వరం సిద్ధం చేసి సీడబ్ల్యూసీకి, గోదావరి బోర్డుకు సమర్పించాలని ఆదేశించారు. గోదావరి బోర్డు అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపి ఐదు ప్రాజెక్టులను గెజిట్‌ నోటిఫికేషన్‌ నుంచి తొలగించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర జల సంఘానికి పంపాలని సూచించారు.

సచివాలయం పనుల్లో వేగం పెరగాలి !
కొత్త సచివాలయం భవనం పనులతో పాటు లాండ్‌ స్కేపింగ్, రక్షణ వ్యవస్థ వంటి అనుబంధ భవనాల పనుల్లో వేగం పెంచాలని సీఎం ఆదేశించారు. సచివాలయానికి పటిష్టమైన భద్రత కల్పించడానికి కావాల్సిన సదుపాయాలపై డీజీపీ మహేందర్‌ రెడ్డిని సంప్రదించి చర్యలు తీసుకోవాలన్నారు. అధునాతన సాంకేతికతతో 24 గంటల నిఘా కోసం నిర్మిస్తున్న పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ భవనం పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. 

>
మరిన్ని వార్తలు