ఆగస్టు నుంచి కేసీఆర్‌ జిల్లాల బాట

18 Jul, 2021 00:49 IST|Sakshi

రెండు నెలలపాటు క్షేత్రస్థాయిలో పర్యటించేలా షెడ్యూల్‌కు కసరత్తు

పర్యటనల్లో ముఖ్య నేతలు,క్రియాశీల కార్యకర్తలతో సీఎం భేటీలు

కొత్త కలెక్టరేట్‌ భవనాలు.. పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలూ అప్పుడే

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం టూర్‌పై సర్వత్రా ఆసక్తి  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిరసనలు, ధర్నాలతో విపక్షాలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్న వేళ పొలిటికల్‌ హీట్‌ను మరింత పెంచేలా టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లా పర్యటనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లా సమీకృత కలెక్టరేట్ల ప్రారంభోత్సవాలతోపాటు టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాల ప్రారంభం పేరిట సుమారు రెండు నెలలపాటు క్షేత్రస్థాయిలోనే ఉండేలా ప్రణాళిక రచిస్తున్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికను టీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీ, కాంగ్రెస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వచ్చే నెలలో పాదయాత్రకు సిద్ధమవుతుండటం, ప్రభుత్వ విధానాలపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆందోళన కార్యక్రమాలు తదితరాల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ జిల్లా పర్యటనలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

తాను కలగన్న తెలంగాణను తీర్చిదిద్దేంత వరకు తన లైన్‌ ఎవరూ మార్చలేరని ప్రకటించిన కేసీఆర్‌... జిల్లా పర్యటనల్లో భాగంగా ఏడేళ్లలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించే యోచనలో ఉన్నారు. జిల్లా పర్యటనల్లో మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, క్రియాశీల కార్యకర్తలతో సీఎం భేటీ అయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పార్టీ వ ర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అధ్యక్షతన ఇటీవల జరిగిన కార్యనిర్వాహక సమావేశంలో సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటనకు సంబంధించి సూత్రప్రాయంగా చర్చించారు. పార్టీ జిల్లా కార్యాలయ భవనాల నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించేందుకు కేటీఆర్‌ అధ్యక్షతన ఈ నెల 21న మళ్లీ టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో సమావేశం జరగనుంది. 

నేటి నుంచి ‘హుజూరాబాద్‌’ బస్సు యాత్ర 
హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అనుబంధ విద్యార్థి సంఘం టీఆర్‌ఎస్‌వీ భాగస్వామ్యంతో ‘తెలంగాణ విద్యార్థి జేఏసీ’ ఆదివారం నుంచి బస్సు యాత్ర చేపట్టనుంది. అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం నుంచి యాత్రకు శ్రీకారం చుట్టనుంది. హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో 15 రోజులపాటు బస్సు యాత్ర సాగనుంది. నియోజకవర్గంలోని ఐదు మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో మొత్తంగా ఏడు విద్యార్థి బృందాలు పర్యటించనున్నాయి. మోదీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను విద్యార్థులు, యువతకు వివరించే లక్ష్యంతో బస్సు యాత్ర చేపడుతున్నట్లు టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ ‘సాక్షి’కి వివరించారు.  

తొలుత కలెక్టరేట్‌ భవనాలు... 
మొత్తంగా 28 జిల్లాల్లో కలెక్టరేట్‌ భవన సముదాయాలను ప్రభుత్వం ప్రతిపాదించగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ జూన్‌లో సిద్దిపేట, కామారెడ్డి, వరంగల్‌ అర్బన్, జూలై మొదటి వారంలో సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాలను ప్రారంభించారు. మరో 24 జిల్లా కలెక్టరేట్‌ సముదాయాలకుగాను జనగామ, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, వికారాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ భవనాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 13 జిల్లాల్లో పనులు వివిధ దశల్లో ఉండగా కరీంనగర్, నారాయణపేట, ములుగు జిల్లా కలెక్టరేట్‌లకు ఇటీవలే అనుమతులు జారీ చేశారు.

కలెక్టరేట్‌ భవన సముదాయాల పనులు పూర్తయిన చోట వచ్చే నెలలో సీఎం ఒక్కో పర్యటనలో రెండేసి జిల్లాల కలెక్టరేట్‌ సముదాయాలను ప్రారంభించేలా షెడ్యూల్‌ సిద్ధం చేస్తున్నారు. కొత్త కలెక్టరేట్ల ప్రారంభోత్సవాలు పూర్తయ్యాక ఆగస్టు నెలాఖరులో పార్టీ జిల్లా కార్యాలయ భవనాల ప్రారంభోత్సవాలు మొదలవుతాయి. 31 జిల్లాలకుగాను ఇప్పటివరకు సిద్దిపేట జిల్లా టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాన్నే పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రారంభించారు. 24 జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయ భవనాల పనులు పూర్తవగా పెద్దపల్లి, సూర్యాపేట, నల్లగొండ, సిరిసిల్ల, కామారెడ్డితోపాటు మొత్తంగా ఏడు జిల్లాల్లో 90 శాతం పనులు జరిగాయి. వాటిని ఈ నెలాఖరులోగా పూర్తి చేసేలా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పర్యవేక్షిస్తున్నారు. 

మరిన్ని వార్తలు