సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్‌ దసరా కానుక

6 Oct, 2021 01:50 IST|Sakshi

లాభాల్లో 29% వాటా

పండుగకు ముందే అందజేయాలని ఆదేశం

ఇతర ఖనిజాలపై సంస్థ దృష్టి పెట్టాలని సూచన

రిటైర్డ్‌ కార్మికులకు సహాయంపై ముఖ్యమంత్రి హామీ

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి బొగ్గు గనుల సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన లాభాల్లో కార్మికులకు 29 శాతం వాటాను ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. గత ఏడాది.. లాభాల్లో 28% వాటాను కార్మికులకు ప్రకటిం చగా, ఈ ఏడాది దసరా కానుకగా దానిని 29 శాతానికి పెంచినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం ప్రగతి భవన్‌లో సింగరేణిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం వివరాలను సీఎంఓ ఆ ప్రకటనలో వెల్లడించింది.

కార్యకలాపాలు విస్తరించాలి
సింగరేణి లాభాల్లో వాటాను పండుగకు ముందే కార్మికులకు చెల్లించాలని సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ను సీఎం ఆదేశించారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటిం చారు. కార్మికుల భవిష్యత్తు దృష్ట్యా సంస్థ కార్యకలాపాలను బొగ్గు తవ్వకంతో పాటు ఇసుక, ఇనుము, సున్నపురాయి తదితర ఖనిజాల తవ్వకాల్లోకి విస్తరించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కార్మికుల నైపుణ్యాన్ని ఆయా ఖనిజాల తవ్వకాలలో కూడా వినియోగించుకోవాల్సిన సందర్భం వచ్చిందన్నారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

రిటైర్డ్‌ కార్మికులను ఉపయోగించుకుందాం
‘ప్రైవేట్, కార్పొరేట్‌ కంపెనీలు రిటైర్డ్‌ సింగరేణి కార్మికులను వినియోగించుకుని బొగ్గు తదితర ఖనిజాల గనులను నిర్వహిస్తూ లాభాలు గడిస్తున్నాయి. మనమే ఎందుకు ఆ పని చేయకూడదు? వారి నైపుణ్యాన్ని, శక్తిని తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా వినియోగించుకుంటుంది. బొగ్గుతో పాటు రాష్ట్రంలోని ఇతర మైనింగ్‌ రంగాలను నిర్వహిస్తూ కార్మికులకు పని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చర్యలు చేపడుతుంది..’అని సీఎం స్పష్టం చేశారు.

సాయంపై సానుకూల స్పందన:
రిటైర్డ్‌ సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా అందుతున్న పింఛను నెలకు రూ.2 వేల లోపే ఉందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చేసిన విజ్జప్తిపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఎటువంటి చర్యలు చేపట్టడం ద్వారా వారికి సాయం చేయగలమో.. నివేదికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశం అనంతరం లాభాల్లో వాటా ను ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి సింగరేణి కోల్‌ బెల్టు ఏరియా ప్రజా ప్రతినిధులు, టీజీబీకేఎస్‌ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు, టీబీజీకేఎస్‌ నేతలు పాల్గొన్నారు. 

ఒక్కో కార్మికుడికి రూ.18 వేలు
హైదరాబాద్‌: సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరం ఆర్జించిన లాభాల్లో 29 శాతం వాటా ను కార్మికులకు అందజేస్తే .. సంస్థలో పనిచేస్తున్న 43 వేల మంది కార్మికులు సగటున రూ.18 వేలు పొందనున్నారు. సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరం (2020–21)లో రూ.272 కోట్ల నికర లాభాలను మాత్రమే ఆర్జించింది. ఇందులో 29 శాతం అంటే రూ.79 కోట్లను కార్మికులకు లాభా ల్లో వాటాగా పంచనున్నారు. మూడు రకాలుగా కార్మికులకు లాభాల్లో వాటాల చెల్లింపులుంటలాయి. భూగర్భ గనుల కార్మికులకు కొంత అధికంగా, ఉపరితల గనుల కార్మికులకు మధ్యస్తంగా, ఇతర సివిల్‌ విభాగాల్లో పనిచేసే వారికి కొంత తక్కువగా వాటాలు చెల్లిస్తారు. పనిచేసే గనులు/విభాగం, పనిచేసిన రోజుల ఆధారంగా ఒక్కో కార్మికుడికి రూ.17 వేల నుంచి రూ.25 వేల వరకు లాభాల్లో వాటా వచ్చే అవకాశముందని సింగరేణి అధికారవర్గాలు తెలిపాయి.

కరోనా ఎఫెక్ట్‌:
కరోనా ప్రభావం సింగరేణి సంస్థ లాభాలపై పడింది. 2019–20లో సంస్థ రూ.999.86 కోట్ల లాభాలు ఆర్జించింది. ఆ ఏడాది లాభాల్లో 28 శాతం అనగా రూ.278 కోట్లను కార్మికుల వాటాగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఒక్కో కార్మికుడు సగటున రూ.60,468 వాటాను అందుకున్నాడు. ఈసారి లాభాల్లో వాటాను 29 శాతానికి పెంచినా కార్మికులకు లభించేది సగటున రూ.18 వేలు మాత్రమే కావడం గమనార్హం.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు