కృష్ణా బోర్డు & తెలంగాణ

3 Sep, 2023 02:44 IST|Sakshi

తెలంగాణకు 6.04 టీఎంసీలు, ఏపీకి 25.29 టీఎంసీలు

కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ పేరుతో మళ్లీ ప్రతిపాదనలు

ఇప్పటికే తీవ్రంగా అభ్యంతరం తెలిపిన తెలంగాణ

అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్‌

ఇరు రాష్ట్రాలకు మినిట్స్‌ పంపిన బోర్డు

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లో మిగిలి ఉన్న కొద్దిపాటి నిల్వల పంపిణీ విషయంలో..తెలంగాణ రాష్ట్రం, కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) మధ్య వివాదం తీవ్రమైంది. తాగునీటి అవసరాల కోసం సెప్టెంబర్‌ 30 వరకు ఏపీకి 25.29 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 6.04 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయాలని ప్రతిపాదిస్తూ గత నెలలో ‘త్రిసభ్య కమిటీ’ పేరుతో  రూపొందించిన వివాదాస్పద ముసాయిదా మినిట్స్‌ను ఆమోదించాలని తాజాగా కృష్ణా బోర్డు ఇరు రాష్ట్రాలను కోరినట్టు తెలిసింది.

ఈ మేరకు ముసాయిదా మినిట్స్‌ను తాజాగా రెండు రాష్ట్రాలకూ కృష్ణా బోర్డు పంపించింది. ఇప్పటికే తెలంగాణ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినా బేఖాతరు చేస్తూ మినిట్స్‌ను కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలకు పంపించడం గమనార్హం.

కృష్ణా బోర్డుపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం...
గత నెల 21న హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరగ్గా తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్‌ గైర్హాజర య్యారు. కమిటీ కన్వీనర్‌ డీఎం రాయిపూరే, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి హాజ రై నీటి కేటాయింపులపై చర్చించారు. ఈ సమా వేశా న్ని వాయిదా వేయాలని అంతకుముందే తెలంగాణ లేఖ రాసినా, కృష్ణా బోర్డు సమావేశాన్ని నిర్వహించింది.

సమావేశం నిర్ణయాల మేరకు ఏపీకి 25.29 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 6.04  టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించాలని ప్రతిపాదిస్తూ.. ముసాయిదా మినిట్స్‌ను కృష్ణా బోర్డు రూపొందించింది. తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ గైర్హాజరైనా, రాష్ట్రానికి అవసరమైన నీటి కేటాయింపులను కోరు తూ గతంలో ఆయన రాసిన లేఖను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. తెలంగాణకు నామమాత్రంగా నీటి కేటాయింపులు జరుపుతూ మినిట్స్‌ను రూపొందించినట్టు పత్రికల్లో వార్తలు రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు.

దీంతో ఈఎన్‌సీ సి.మురళీధర్‌ కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ కన్వీనర్‌ డీఎం రాయి పూరేను కలిసి మినిట్స్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు త్రిసభ్య కమిటీ సమావేశమే జరగలే దని, నీటి కేటాయింపులపై ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని, ఒకవేళ చేసినా తెలంగాణ సమ్మతి తెలపలేదని స్పష్టం చేస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. త్రిసభ్య కమిటీ సమావేశాన్ని సత్వరంగా నిర్వహించి నీటికేటాయింపులపై నిర్ణయం తీసుకోవాలని కృష్ణా బోర్డును కోరినట్టు వెల్లడించింది. మొత్తంగా..  తెలంగాణ అభ్యంతరాలను పట్టించుకోకుండా నీటి కేటాయింపుల ప్రతిపాదనలను కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలకు పంపించడం వివాదాస్పదంగా మారింది.

మరిన్ని వార్తలు