రిటైర్‌మెంట్‌ వయసు పెంపుతో 43,811మందికి లబ్ధి

24 Mar, 2021 02:38 IST|Sakshi

2025 దాకా ఇంతమంది ఉద్యోగులకు ప్రయోజనం

12 నెలల్లో రిటైర్‌ అయిన 7,080 మందికి గ్రాట్యుటీ ప్రయోజనాలు

అంతకుముందు 21 నెలల్లో రిటైర్‌ అయిన వారికి దక్కని ప్రయోజనం

2018 జూలై 1 నుంచి 2020 మార్చి 31 వరకు రిటైరైన వారు 12,500 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల రిటైర్మెంట్‌ వయసును ప్రభుత్వం 61 ఏళ్లకు పొడిగించడంతో 43,811 మందికి (2025 వరకు లెక్కిస్తే) ఉద్యోగంలో కొనసాగే అవకాశం దక్కింది. వివిధ శాఖల్లో జనవరిలో 440 మంది, ఫిబ్రవరిలో 444 మంది పదవీ విరమణ పొందారు. ఈ నెలలో మరో 563 మంది రిటైర్‌ కావాల్సి ఉండగా సీఎం ప్రకటనతో వారు సర్వీసులో కొనసాగే అవకాశం దక్కింది. వారితో సహా ఈ ఏడాది పదవీ విరమణ పొందే వారు 7,954 మంది మరో మూడేళ్లు కొలువులో కొనసాగనున్నారు. వచ్చే ఏడాది రిటైరయ్యే వారు, ఆ తరువాత ఏళ్లలో రిటైరయ్యే వారికి రిటైర్మెంట్‌ వయసు పెంపు ప్రయోజనం లభించనుంది.

2025 వరకు తీసుకుంటే మొత్తంగా 43,811 మందికి అదనంగా మూడేళ్లు ఉద్యోగంలో కొనసాగే అవకాశం దక్కనుంది. మరోవైపు ఉద్యోగులు రిటైరయ్యాక లభించే రూ. 12 లక్షల గ్రాట్యుటీని రూ. 16 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. దీంతో ఆ ప్రయోజనాలు సర్వీసులో ఉన్న అందరికీ లభించనున్నాయి. పీఆర్‌సీని 12 నెలల ముందు నుంచే అమలు చేస్తామని సీఎం పేర్కొనడంతో 2020 ఏప్రిల్‌ 1 నుంచి మార్చి 21 వరకు రిటైరైన 7,080 మంది పెన్షనర్లకు కూడా గ్రాట్యుటీ ప్రయోజనాలు అందనున్నాయి. వారికి అదనంగా రూ. 4 లక్షల చొప్పున ప్రయోజనం చేకూరనుంది.

వాస్తవానికి పీఆర్‌సీని 2018 జూలై 1 నుంచి అమలు చేయాల్సి ఉంది. అయితే కటాఫ్‌గా దానినే తీసుకున్నా.. 2020 ఏప్రిల్‌ 1 నుంచే అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. అంటే అప్పటి నుంచి 2021 మార్చి 31 వరకు బకాయిలను పెన్షన్‌లో జమ చేయనున్నారు. దీంతో పీఆర్‌సీ అమలు చేయాల్సిన 2018 జూలై 1 నుంచి 2020 మార్చి 31లోగా రిటైర్‌ అయిన దాదాపు 12,500 మందికి గ్రాట్యుటీ పెంపు రూపంలో అందాల్సిన రూ. 4 లక్షల అదనపు నగదు ప్రయోజనాలు అందకుండా పోయే పరిస్థితి నెలకొంది.  

మరిన్ని వార్తలు