‘ముందస్తు’ ఉండదు..

18 Oct, 2021 00:47 IST|Sakshi

గతంలో ముందస్తుకు వెళ్లడంతో ఎంపీ సీట్లు తగ్గాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు వేర్వేరుగా జరగడంతో కొంత నష్టం జరిగింది. ప్రస్తుతం లోక్‌సభ స్థానాల సంఖ్యను కూడా మరిన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువ ఎంపీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో మనం కేంద్రంలోనూ కీలక పాత్ర పోషించేందుకు వీలుంటుంది.

సాక్షి, హైదరాబాద్‌: ‘తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ముందుండి నడిపిన టీఆర్‌ఎస్‌కు ప్రజలు అప్పగించిన బాధ్యతకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే 2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాం. ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామనే అనవసర అపోహలతో ఆందోళన వద్దు. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది.  ముందస్తు ఎన్నికలు ఉండవు..’ అని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కూడిన లెజిస్లేచర్, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశంలో సుమారు రెండు గంటలకు పైగా ఆయన మాట్లాడారు. ఎన్నికలు, విపక్షాల విమర్శలు, ప్లీనరీ తదితర అంశాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. 

ఎక్కువ స్థానాలు గెలిచేలా కష్టపడండి
‘మరిన్ని ఎంపీ స్థానాలు సాధిస్తే రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, నిధుల కోసం మనం మరింత కొట్లాడేందుకు వీలుంటుంది. మరోవైపు మనం చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. మనముందున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని చేపట్టిన పనులన్నీ పూర్తి చేసుకుందాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా మరింత కష్టపడి పనిచేయండి..’ అని నేతలకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ‘అధికారంలోకి వచ్చిన సుమారు ఏడున్నరేళ్లలో మేనిఫెస్టోలో చెప్పిన వాటితో పాటు అనేక ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. కానీ వాటిని మనం సరైన రీతిలో ప్రజలకు చెప్పుకోలేక పోతున్నాం. ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ యంత్రాంగం ద్వారా మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. ఇదే సమయంలో విపక్షాలు చేసే విమర్శలను ఎక్కడిక్కడ తిప్పికొట్టాలి..’ అని సూచించారు. 

కుక్కలు, నక్కల నోర్లు మూయించాలి
‘ఓట్ల రాజకీయాలే పరమావధిగా పనిచేస్తున్న కొన్ని రాజకీయ పక్షాలు మనమీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాయి. అలాంటి కుక్కలు, నక్కల నోర్లు మూయించేలా వచ్చే నెల 15న వరంగల్‌లో ‘తెలంగాణ విజయ గర్జన’ సభను దిమ్మదిరిగేలా నిర్వహిద్దాం. ఒక్కో గ్రామం నుంచి కనీసం 50 మంది చొప్పున సభకు హాజరయ్యేలా సుమారు పది లక్షల మందితో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభ నిర్వహణ బాధ్యతలు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు నిర్వర్తిస్తారు. సభను విజయవంతం చేసేందుకు వెంటనే సన్నాహాలు ప్రారంభించాలి. 

నేటి నుంచి నేతలతో కేటీఆర్‌ భేటీలు
సోమవారం నుంచి రోజుకు 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ వేర్వేరుగా భేటీ అవుతారు. విజయగర్జన సభకు జన సమీకరణ, ఇతర ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేస్తారు. ఈ సన్నాహక సమావేశాలకు ఒక్కో నియోజకవర్గం నుంచి 20 మంది వరకు ముఖ్య నేతలు హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత ఎCమ్మెల్యేలపై ఉంటుంది. సభకు హాజరయ్యే వారి కోసం కనీసం 22 వేల బస్సులు, ఇతర వాహనాలు సమకూర్చుకునేందుకు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసుకోవాలి..’ అని కేసీఆర్‌ ఆదేశించారు.

హుజూరాబాద్‌లో 13% ఆధిక్యత
 ‘హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీ కంటే మనమే 13 శాతానికి పైగా ఓట్ల ఆధిక్యతలో ఉన్నాం. ఈ నెల 25న హైదరాబాద్‌లో పార్టీ ప్లీనరీ సమావేశం ముగిసిన తర్వాత 26 లేదా 27వ తేదీన హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్లీనరీ సమావేశానికి హాజరయ్యే ప్రతినిధుల సంఖ్యను 14 వేల నుంచి 6 వేలకు కుదించాలి. గ్రామ, మండల కమిటీల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులకు ఆహ్వానం పంపాలి. ప్లీనరీకి హజరయ్యేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి. చేయాల్సిన తీర్మానాలపై పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా సూచనలు ఇవ్వవచ్చు. ప్రజా సమస్యలు, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై తీర్మానాలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టన దళితబంధుపై దేశ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమవుతోంది. ప్లీనరీలో ఈ అంశానికి తగిన ప్రాధాన్యత ఇచ్చి చర్చించాలి..’ అని సీఎం ప్రతిపాదించారు. ‘సుమారు 60 లక్షల మందితో కూడిన పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి గ్రామ, వార్డు, మండల, పట్టణ స్థాయిలో కమిటీల ఏర్పాటు పూర్తయింది. త్వరలో పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభం, ఆ తర్వాత కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి..’ అని ప్రకటించారు.  

మరిన్ని వార్తలు