సీఎం కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌.. 250 యూనిట్ల కరెంట్‌ ఫ్రీ

5 Apr, 2021 01:40 IST|Sakshi

సీఎం కేసీఆర్‌ నిర్ణయం..జీవో విడుదల

కటింగ్‌ షాపులు, లాండ్రీలు, ధోబీ ఘాట్లకు వర్తింపు

ఏప్రిల్‌ 1 నుంచి అమలు ..

హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో హెయిర్‌ కటింగ్‌ షాపులు, లాండ్రీలు, ధోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాలు, నాయీ బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వానికి ఇప్పటికే చేసిన విజ్ఞప్తులను పరిశీలించిన మీదట సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. తక్షణమే జీవో జారీ చేయాల్సిందిగా సీఎంవో కార్యదర్శి భూపాల్‌ రెడ్డిని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం ఆదివారం జీవో విడుదల చేశారు. ఉచిత విద్యుత్‌ సరఫరా ఏప్రిల్‌ 1 నుంచే అమల్లోకి రానున్నది.

అత్యంత బలహీన వర్గాల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, వారి సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా గ్రామ స్థాయినుంచి జీహెచ్‌ఎంసీ వరకు ఉన్న కటింగు షాపులు, లాండ్రీ షాపులకు, ధోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన కరెంటు ఉచితంగా అందుబాటులోకి రానున్నదన్నారు. కులవృత్తిని ఆధారం చేసుకుని జీవనం సాగిస్తున్న తెలంగాణలోని లక్షలాది రజక, నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు.

మరిన్ని వార్తలు