తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. అటు‌ రాజ్‌భవన్‌-ఇటు పబ్లిక్‌ గార్డెన్‌లో..

2 Jun, 2022 09:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం అట్టహాసంగా సాగుతున్నాయి. రాజధాని సహా ప్రతీ జిల్లాలోనూ పార్టీలన్నీ సంబురాలను నిర్వహిస్తున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌, బీజేపీలు జెండావిష్కరణ వేడుకల్లో పాల్గొంటున్నాయి. అయితే ఆవిర్భావ వేడుకల సాక్షిగా తెలంగాణ గవర్నర్‌, ప్రభుత్వం మధ్య గ్యాప్‌ మరోసారి బయటపడింది. 

గురువారం ఉదయం రాజ్‌భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. కొద్దిపాటి అధికార గణం.. కళాకారుల సమక్షంలో వేడుకలను నిర్వహించింది రాజ్‌భవన్‌. తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ నేను ఈ రాష్ట్రానికి గవర్నర్ మాత్రమే కాదు.. ఒక సహోదరిని కూడా. ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. 

నేను ఈ రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నా.  నా సేవ తెలంగాణ ప్రజలకి అందిస్తూనే ఉంటా. ఎంతో మంది త్యాగ శీలుల ఫలితం తెలంగాణా రాష్ట్రం అని పేర్కొన్నారు ఆమె. అలాగే ఇదే వేదికగా గవర్నర్‌ తమిళిసై పుట్టిన రోజు వేడుకలు కూడా జరిగాయి. కేక్‌ కట్‌ చేసిన సాంస్కతిక కార్యక్రమాలను వీక్షించారు. ఆపై కళాకారులను సత్కరించారామె. ఆమె ప్రసంగంలో ఎక్కడా ప్రభుత్వ ప్రస్తావన లేకపోవడం విశేషం.

మరోవైపు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. ఉదయం అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించి.. ఆపై పబ్లిక్‌ గార్డెన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. 

అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వనరులను అభివృద్ధి చేసుకున్నామని, జాతీయ అంతర్జాతీయ పురస్కారాలే తమ ప్రభుత్వ అభివృద్ధికి నిదర్శమన్నారు. తలసరి ఆదాయంలో రికార్డు సాధించామని, మౌలిక వసతుల విషయంలో దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. ‘‘ఇంటింటికీ స్వచ్ఛమైన నీరు అందిస్తున్నాం. నల్గొండ ఫ్లోరైడ్‌ సమస్యను అధిగమించాం. ఇతర రాష్ట్రాలకు మిషన్‌ భగీరథ ఆదర్శంగా నిలిచిందని అన్నారు.

రైతుల సంక్షేమ కోసం అనేక సంస్కరణలు, పథకాలు అమలు చేశాం అని తెలిపారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందజేస్తున్నాం. రైతులకు సకాలంలో ఎరువులు పంపిణీ చేస్తున్నాం. రైతు బంధు అందిస్తున్నాం. వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని నిరూపించాం. ఇతర రాష్ట్రాల మన పథకాలను ఆదర్భంగా తీసుకుంటున్నాయారు. 50 వేల కోట్లను రైతులకు పెట్టుబడులుగా అందజేసినట్లు తెలిపారు సీఎం కేసీఆర్‌.

మరిన్ని వార్తలు