గ్రామ నిర్ణయం మేరకే.. పంచాయతీ నిధుల ఖర్చు 

27 Mar, 2021 01:51 IST|Sakshi

స్థానిక అవసరాలకు అనుగుణంగా వ్యయం చేసుకోవచ్చు: సీఎం కేసీఆర్‌ 

ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సమావేశం 

పలు పనులను మంజూరు చేస్తూ ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీల నిధులను అక్కడి ప్రజలు, పంచాయతీల నిర్ణయం మేరకే ఖర్చు చేసుకునేలా సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల స్థానిక అవసరాలకు అనుగుణంగా నిధులను ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. మొత్తం 142 మున్సిపాలిటీలు, పట్టణాల్లో వెజ్, నాన్‌ వెజ్, పండ్లు, పూల విక్రయానికి అనుకూలంగా సమీకృత మార్కెట్లను నిర్మించాలని నిర్ణయించారు. మహిళలకు అందుబాటులో ఉండే ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో ఇళ్ల మీదుగా ఉన్న విద్యుత్‌ లైన్లను ప్రభుత్వ ఖర్చుతోనే మార్చాలని ట్రాన్స్‌కో సీఎండీని ఆదేశించారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో పలువురు ఎమ్మెల్యేలతో సమావేశంలో సీఎం మాట్లాడారు. స్థానిక సంస్థల సాధికారతపై దృష్టి పెట్టామని, గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. 

కొత్త జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు
అన్ని కొత్త జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాల నిర్మాణ పనులను పర్యవేక్షించాలని ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్‌ సూచించారు. ట్రాఫిక్, మహిళా పోలీసు విభాగాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇక ఆర్‌అండ్‌ బీ, ఇరిగేషన్‌ , హోం, పంచాయతీరాజ్‌ తదితర శాఖలకు సంబంధించి.. పలు పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో చేపట్టాల్సిన పనులను మంజూరు చేస్తూ సీఎం నిర్ణయాలు తీసుకున్నారు. పట్టణాల్లో రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలు, అండర్‌పాస్‌ల నిర్మాణం, పలు పట్టణాల్లో రోడ్ల వెడల్పు, డివైడర్లు, సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం ఏర్పాటు, నదులు, వాగుల మీద అవసరమైన చోట చెక్‌ డ్యాంల నిర్మాణం వంటివి చేపట్టాలని ఆదేశించారు. 

యాసంగి పంటలకు నీళ్లు... 
కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ప్రాజెక్టుల కింద పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్‌ అధికారులను సీఎం ఆదేశించారు. కొల్లాపూర్, పెద్దపల్లి నియోజకవర్గాల పరిధిలో యాసంగి పంటలకు నీరందించాలని ఆయా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నవీన్‌రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, పెద్ది సుదర్శన్‌రెడ్డి, సుంకె రవిశంకర్, హర్షవర్ధన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డి, గంపా గోవర్దన్, అబ్రహం, సంజయ్‌ కుమార్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కాలె యాదయ్య, హన్మంత్‌ షిండే, పట్నం నరేందర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, రసమయి బాలకిషన్, జైపాల్‌ యాదవ్, సండ్ర వెంకటవీరయ్య, కృష్ణమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు