CM KCR: ఆ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు

7 Aug, 2021 02:20 IST|Sakshi

రాష్ట్ర నీటి హక్కులను బోర్డుల సమావేశాల్లో వివరించండి: సీఎం కేసీఆర్‌

రాష్ట్ర వాణిని గట్టిగా వినిపించండి 

ప్రభుత్వ యంత్రాంగమంతా పట్టుదలగా ఉండాలి 

బోర్డుల గెజిట్‌పై సమీక్షలో ముఖ్యమంత్రి సూచన

రేపు కూడా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి చర్చ

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్రానికి దక్కే వాటాల విషయంగా ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తగ్గేదే లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యవసాయం, రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని.. ప్రభుత్వ యంత్రాంగం అంతా పట్టుదలతో కృషి చేయాలని సూచించారు. కృష్ణా, గోదావరి నదీ బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో నిర్వహించే నదీ బోర్డుల సమావేశాల్లో తెలంగాణ అనుసరించాల్సిన వ్యూహాలపై శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన అత్యున్నత సమీక్షా సమావేశం జరిగింది. తెలంగాణకు హక్కుగా కేటాయించిన, న్యాయమైన నీటివాటాలకు సంబంధించి బచావత్‌ ట్రిబ్యునల్, బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ తీర్పులు, తాజాగా కేంద్రం జారీ చేసిన గెజిట్‌లోని అంశాలపై క్షుణ్నంగా చర్చించారు.

గోదావరి, కృష్ణా జలాల్లో ఉభయరాష్ట్రాలకు ఉండే నీటివాటాల లెక్కలనూ పరిశీలించారు. కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశాల్లో తెలంగాణ వాణిని గట్టిగా వినిపించాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్‌ సూచించారు. ఈ అంశాలపై ఆదివారం కూడా సమావేశమై చర్చించాలని నిర్ణయించారు. సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సాగునీటిశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్, హరిరామ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌ పాండే, మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ రామకృష్ణారెడ్డి, సీనియర్‌ అడ్వొకేట్‌ రవీందర్‌రావు, సాగునీటిశాఖ అంతర్రాష్ట విభాగం సీఈ మోహన్‌కుమార్, ఎస్‌ఈ కోటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

రాష్ట్ర అభ్యంతరాలపై కేంద్రానికి లేఖ.. ఆపై సుప్రీంకు.. 
కేంద్ర గెజిట్‌లోని అంశాలు, వాటితో రాష్ట్ర ప్రాజెక్టులపై పడే ప్రభావం, బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులు తేవడం, వాటికి అనుమతులు, నిధుల చెల్లింపులు తదితర అంశాలపైనా సమీక్షా సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. గెజిట్‌లోని అంశాలకు సంబంధించి రాష్ట్రానికి ఉన్న అభ్యంతరాలపై వీలైనంత త్వరలో కేంద్రానికి లేఖలు రాయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. ప్రధానంగా ఉమ్మడి ప్రాజెక్టులు కాని వాటిని సైతం షెడ్యూల్‌–2లో చేర్చడం, వాటిపై బోర్డుల అజమాయిషీపై అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇక ప్రాజెక్టులకు ఆరు నెలల్లోగా అనుమతులు తీసుకోవాలని గెజిట్‌లో పేర్కొన్న దృష్ట్యా.. ఏ ప్రాజెక్టులకు ఏయే అనుమతులు పొందాలి, ఈ విషయంగా కేంద్ర ప్రభుత్వ శాఖలు అందించే సహకారంపై స్పష్టత కోరాలని సీఎం కేసీఆర్‌  నిర్ణయించినట్టు సమాచారం.

ఇక అనుమతుల్లేని ప్రాజెక్టులకు సంబంధించి రుణాలిచ్చిన సంస్థలు వివరణ కోరుతున్న నేపథ్యంలో.. నిర్దేశిత గడువులోగా వాటికి అనుమతులు సాధిస్తామన్న స్పష్టత ఇవ్వాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఆయా అంశాల్లో రాష్ట్రం లేవనెత్తే అభ్యంతరాలపై కేంద్రం స్పందించే తీరును బట్టి.. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయాలని సమావేశంలో సూచనలు వచ్చినట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇక సుప్రీంలో తెలంగాణ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ ఉపసంహరణ పూర్తయితే.. ఆ వెంటనే సెక్షన్‌–3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు, కృష్ణా జలాల పునఃపంపిణీ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించినట్టు తెలిసింది.   

మరిన్ని వార్తలు