ఆ ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు : కేసీఆర్

21 Sep, 2020 04:41 IST|Sakshi

వాతావరణశాఖ హెచ్చరిక.. అప్రమత్తమైన ప్రభుత్వం  

ముందు జాగ్రత్త చర్యలపై సీఎస్‌తో సీఎం కేసీఆర్‌ సమీక్ష 

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలు సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో సమీక్షించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీ, అన్ని శాఖల అధికారులు జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.

కలెక్టర్లు, ఎస్పీలు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలని సూచించారు. ‘భారీ వర్షాలతో వరదలు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదముంది. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు పడిపోవడం వల్ల సాధారణ కార్యకలపాలకు అంతరాయం ఏర్పడుతుంది. రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నిండి పొంగి పోవటం వల్ల లోతట్టు ప్రాంతాలు, చిన్న బ్రిడ్జిలు, కాజ్‌వేలలో నీరు ప్రవహించే అవకాశముంది. ట్రాఫిక్‌ అంతరాయాలు, ప్రజలకు ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే జారీ చేసిన వరదల నిర్వహణ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను కోరింది’అని రాష్ట్ర సమాచార, ప్రజాసంబంధాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు