మంత్రులతో కేసీఆర్‌ భేటీ: వ్యూహాలపై చర్చ

3 Sep, 2020 19:34 IST|Sakshi

మంత్రులు, విప్‌లతో ముగిసిన సీఎం కేసీఆర్‌ సమావేశం

సాక్షి, హైదరాబాద్‌ : ఈ నెల 7 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రులు, విప్‌లతో సమావేశం నిర్వహించారు. సభలో విపక్షాలు కోరిన అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉండాలని, ఎన్ని రోజులైనా అసెంబ్లీని నిర్వహిద్దామని సీఎం అన్నారు. వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు మంత్రులు సిద్ధం కావాలని సూచించారు. అల్లర్లు, దూషణలకు అసెంబ్లీ వేదిక కారాదని పేర్కొన్నారు. జీఎస్టీ అమలులో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై సభలోనే చర్చించాలని కేసీఆర్‌ స్పష్టం చేశారు. అలాగే ఈనెల 7న టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చించనున్నారు. గురువారం ప్రగతిభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో కేసీఆర్‌తో పాటు మంత్రులు, విప్‌లు పాల్గొన్నారు.

ఈ శాసనసభ సమావేశాల్లోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసు కురావాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ఇప్పటికే సిద్ధం చేసిన ముసాయిదా చట్టానికి తుదిరూపునిచ్చి అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని ఆయన నిర్ణయించినట్టు తెలిసింది. రెవెన్యూ శాఖ ప్రక్షాళన, అవినీతి నిర్మూలన లక్ష్యంగా కొత్తచట్టం రూపకల్పనపై సీఎం గత వారమే సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. మరోవైపు దివంగత మాజీ ప్రధానమంత్రి, పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలంటూ వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని కేసీఆర్‌ ఇదివరకే వెల్లడించారు.

సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండండి
ఈ నెల 7 నుంచి శాసనసభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. బీఆర్‌కేఆర్‌ భవన్‌లో గురువారం వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. శాసనసభలో పెండింగులో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపాలని, అసెంబ్లీ అధికారులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శాసన మండలి సమావేశాలకు సీనియర్‌ అధికారులు హాజరయ్యేలా చూడాలని ఆయా శాఖల కార్యదర్శులను ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు లేవనెత్తే అంశాలకు సంబంధించి నోట్స్‌ చేసుకోవాలన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా