T-Hub 2.0: మనం దేశానికే రోల్‌ మోడల్‌

29 Jun, 2022 01:42 IST|Sakshi

దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం ఇది రోడ్‌ మ్యాప్‌ 

ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడే తర్వాతి తరం స్టార్టప్‌లకు ప్రోత్సాహం 

రాష్ట్రానికే కాదు దేశానికే ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుంది

టీ–హబ్‌ 2.0 సదుపాయాన్ని దేశ యువతకు అంకితం చేస్తున్నామని వెల్లడి 

టీ–హబ్‌ రెండో దశ ప్రారంభం 

దేశాన్ని ప్రపంచ పటంపై ప్రత్యేకంగా నిలిపేలా.. 
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంలో దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం యువతకు స్పష్టమైన రోడ్‌ మ్యాప్‌ను అందించడం చాలా కీలకం. యువత ఇక్కడి సవాళ్లతోపాటు అంతర్జాతీయ స్థాయిలోనూ పోటీ పడాలని అనుకుంటోంది. ఆ ఆకాంక్షను ముందుగా అర్థం చేసుకుని భారత్‌ను ప్రపంచ పటంపై ప్రత్యేకంగా నిలపాలనే అంశాన్ని తొలుత గుర్తించింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే. ఎంటర్‌ప్రెన్యూర్, టెక్నాలజీ సామర్థ్యమున్న భారత్‌ను నిర్మించడమే మా లక్ష్యం. 
– సీఎం కేసీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: స్టార్టప్‌ల వాతావరణాన్ని, యువతలో అత్యుత్తమ ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు ‘టీ–హబ్‌’ను ఏర్పాటు చేశామని.. ఇది దేశానికే రోల్‌ మోడల్‌ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన మూలస్తంభాలుగా నిలిచే తర్వాతి తరం స్టార్టప్‌లను పెంచడమే తమ లక్ష్యమని.. రెండో దశ ద్వారా రాష్ట్రంతోపాటు దేశానికి స్టార్టప్‌ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు వస్తుందని చెప్పారు. ‘ఆలోచనలతో రండి.. ఆవిష్కరణలతో వెళ్లండి’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ–హబ్‌ రెండో దశను సీఎం కేసీఆర్‌ మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. రూ.400 కోట్ల వ్యయంతో హైదరాబాద్‌లోని మాదాపూర్‌–రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్‌ క్యాంపస్‌గా ఈ టీ–హబ్‌ 2.0ను నిర్మించిన విషయం తెలిసిందే. దీనిని ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

ప్రపంచస్థాయి సంస్థను సృష్టించాం..
‘‘ఎనిమిదేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన కొద్దిరోజులకే ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని నిర్ణయించాం. అందులో భాగంగా 2015లో ఏర్పాటైన టీ–హబ్‌ను విస్తరిస్తూ అత్యంత పెద్దదైన టీ–హబ్‌ రెండో దశను ప్రారంభించాం. స్టార్టప్‌ల వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు ప్రారంభించిన టీ–హబ్‌ ఇప్పుడు దేశానికే రోల్‌ మోడల్‌గా మారింది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్లను ప్రోత్సహించేందుకు టీ–హబ్‌ రూపంలో ప్రపంచ స్థాయి సంస్థను సృష్టించగలిగాం. ప్రగతిశీల స్టార్టప్‌ విధానం ద్వారా కార్పోరేట్లు, విద్యాసంస్థల మధ్య ఫలవంతమైన భాగస్వామ్యం ఏర్పడింది. టీ–హబ్‌ ఏర్పాటు ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్లకు అవసరమైన వీ–హబ్, టీ–వర్క్స్, టాస్క్, రిచ్, టీఎస్‌ఐసీ వంటి సోదర సంస్థల ఏర్పాటుకు బాటలు పడ్డాయి. 

దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు ఇచ్చేలా.. 
టీ–హబ్‌ తొలిదశ ద్వారా 2 వేలకుపైగా స్టార్టప్‌లకు ఊతమివ్వడంతోపాటు 1.19 బిలియన్‌ డాలర్ల నిధులు సమకూరాయి. వెంచర్‌ క్యాపిటలిస్టులు, ఏంజిల్‌ ఇన్వెస్టర్లతో స్టార్టప్‌లను అనుసంధానం చేయడంలో టీ–హబ్‌ ఎనలేని పాత్ర పోషించింది. ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వస్తున్న టీ–హబ్‌ రెండో దశ తొలిదశ కంటే ఐదు రెట్లు పెద్దది. టీ–హబ్‌తో ప్రపంచంలో పది అగ్రశ్రేణి స్టార్టప్‌ వాతావరణం కలిగిన ప్రాంతాల జాబితాలో తెలంగాణ కూడా ఒకటిగా నిలిచింది. నిధులను రాబట్టడంలో ఆసియాలోని 15 అగ్రశ్రేణి స్టార్టప్‌ వాతావరణాల్లో తెలంగాణకు చోటు దక్కింది. 2021లో తెలంగాణ స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ విలువ 4.8 బిలియన్‌ డాలర్లుగా ఉంది. తెలంగాణ స్టార్టప్‌లు మన ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఐటీ, లైఫ్‌ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమోటివ్‌ రంగాలకు తోడ్పాటును అందిస్తున్నాయి. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పారిశుధ్యం, పర్యావరణం వంటి సామాజిక రంగాలకు సంబంధించిన ఉత్పత్తుల రూపకల్పన, ఆయా రంగాల్లో సమస్యలకు పరిష్కారాలనూ కనుగొన్నాయి. తెలంగాణ స్టార్టప్, ఇన్నోవేషన్‌ పాలసీ వంటి ప్రగతిశీల విధానాల వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయి. టీ–హబ్‌ 2.0 సదుపాయాన్ని దేశ యువతకు అంకితం చేస్తున్నాం’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. 

ఈ సమావేశంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, సైయంట్‌ సంస్థ వ్యవస్థాపకుడు బీవీఆర్‌ మోహన్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా 21 యూనికార్న్‌లు, పలు స్టార్టప్‌ సంస్థల ప్రతినిధులను సీఎం కేసీఆర్‌ సన్మానిం చారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మర్రి జనార్దనరెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, టీఎస్‌టీఎస్‌ చైర్మన్‌ పాటిమీది జగన్‌మోహన్‌రావు, సీఎస్‌ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో వివి« ద కంపెనీలు, స్టార్టప్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు. 

టార్చ్‌ అందుకుని.. కలియతిరిగి
టీ–హబ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఇన్నోవేషన్‌ టార్చ్‌ (కాగడా)ను అధికారులు సీఎం కేసీఆర్‌కు అందించగా.. టీ–హబ్‌ 2.0 నమూనాను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీ–హబ్‌ ప్రాంగణమంతా కేసీఆర్‌ కలియదిరిగారు. వివిధ అంతస్తుల్లో ఏర్పాటు చేసిన కార్యాలయాలను పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. పైఅంతస్తులో కారిడార్‌లో నడుస్తూ నాలెడ్జ్‌ సిటీ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అంకుర సంస్థల ప్రతినిధులు, కంపెనీల ప్రతినిధులు పనిచేయడానికి, చర్చించుకోవడానికి ఏర్పాటు చేసిన వర్క్‌ స్టేషన్లు, మీటింగ్‌ హాళ్లనూ పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి కోసం శ్రమిస్తున్న మంత్రి కేటీఆర్, అధికారుల బృందాన్ని సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా అభినందించారు. దేశ విదేశాల్లోని ఐటీ కేంద్రాలను తలదన్నేలా భవనాలు, ఏర్పాట్లు ఉన్నాయని ప్రశంసించారు. 
మౌలిక వసతులు మరింత పెంచండి 

టీ–హబ్‌ రెండో దశ భవనం, ఏర్పాట్లు, ఇన్నోవేషన్‌ సెంటర్లను పరిశీలించిన సందర్భంగా అధికారులకు సీఎం కేసీఆర్‌ పలు సూచనలు చేశారు. రోజురోజుకు పెరుగుతున్న సాంకేతికత, ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా.. సామాన్య ప్రజల జీవితాలు పురోగమించేందుకు తోడ్పడేలా అంకుర సంస్థలు కృషి చేయాలని, ఆ దిశగా టీ–హబ్‌ ప్రోత్సాహం అందించాలని ఆదేశించారు. భవిష్యత్తులో హైదరాబాద్‌ ఐటీ రంగం పురోగతి మరింతగా పెరుగుతుందని, దానికి అనుగుణంగా మౌలిక వసతులను పెంచడంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఇక పోలీసు శాఖలో సాంకేతికతను మరింతగా మెరుగుప ర్చుకునేందుకు, సైబర్‌ క్రైమ్‌ను అరికట్టేందుకు, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను మరింతగా అభివృద్ధి చేసేందుకు టీ–హబ్‌తో సమన్వయం చేసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డికి సూచించారు. 

మరిన్ని వార్తలు