నా ప్రస్థానాన్ని ఎవరూ ఆపలేరు: సీఎం కేసీఆర్

4 Jul, 2021 15:19 IST|Sakshi

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేసీఆర్

సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను సీఎం ప్రారంభించారు. 15 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. అనంతరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైవర్స్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌, ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజ్‌ హాస్టల్‌ను కేసీఆర్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తన ప్రస్థానాన్ని, ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరన్నారు. లక్ష్యంగా దిశగా వెళ్తున్నాం.. ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో కలెక్టరేట్‌ ఏర్పాటు కావడం సంతోషంగా ఉందన్నారు. 9 లక్షల టన్నుల ధాన్యం ఎఫ్‌సీఐకి ఇచ్చామని, రూ.8 వేల కోట్లు ఖర్చు పెట్టి గొర్రెల పంపిణీ చేస్తున్నామని సీఎం తెలిపారు. వలస వెళ్లినవారు తిరిగి ఊళ్లకు వస్తున్నారని పేర్కొన్నారు.

‘‘మిషన్ కాకతీయ కారణంగా భూగర్భ జలాలు పెరిగాయి. తెలంగాణలో నీళ్ల కోసం 500-600 మీటర్లు లిఫ్ట్‌ చేయాలని ప్రధాని అంటే.. నేను తీవ్రంగా వ్యతిరేకించా. తెలంగాణలో 50 మీటర్లు లిఫ్ట్ చేస్తే నీళ్లు వస్తాయని ప్రధానికి చెప్పా. కాళేశ్వరం పూర్తవుతుందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. కాళేశ్వరం ఇప్పుడు అద్భుతంగా కళ్లముందు కనిపిస్తోంది. డిస్కవరీలో కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని ప్రసారం చేశారని’’ సీఎం కేసీఆర్‌ ప్రస్తావించారు.

‘‘కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ బిల్లులపై రాద్ధాంతం చేస్తున్నారు. రైతుల కోసం కాళేశ్వరానికి రూ.10వేల కోట్ల బిల్లులైనా భరిస్తా. ఏప్రిల్, మే నెలలో అప్పర్ మానేరు నిండుతుందని ఎవరు ఊహించలేదు. అప్పర్ మానేరు నుంచి గోదావరిలో కలిసే వరకు సజీవ జలధారగా ఉంది. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో 3 లక్షల ఎకరాలకు నీళ్లు. మిషన్ భగీరథ ఒక అద్భుతం. 11 రాష్ట్రాల నుంచి వచ్చి మిషన్‌ భగీరథను పరిశీలించారు. చేనేత కార్మికుల కోసం బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చాం.చేనేత కార్మికులకు బీమా కల్పిస్తాం.

ఒక్కో చేనేత కార్మికుడికి రూ.5 లక్షల చొప్పున బీమా కల్పిస్తాం. రూ.10 వేల కోట్లతో మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తాం. తెలంగాణలో కొత్తగా 13 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం. నర్సింగ్ విద్యార్థులకు స్టైఫండ్‌ పెంచుతున్నాం. వేములవాడ రాజన్న దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం. దళితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం. త్వరలో 57 ఏళ్లు నిండిన అర్హులందరికి వృద్ధాప్య పింఛన్ అందిస్తామని’’ సీఎం కేసీఆర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు