CM KCR Jagtial Tour: మనకు మనమే సాటి.. ఎవరూ లేరు పోటీ: సీఎం కేసీఆర్‌

7 Dec, 2022 14:33 IST|Sakshi

సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయాన్ని కేసీఆర్‌ ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక అన్ని వర్గాలకు మేలు జరిగేలా కార్యక్రమాలు రూపొందించామని తెలిపారు. అనేక రంగాల్లో ఇప్పటికే తెలంగాణ దేశంలో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని అన్నారు.

వ్యవసాయం చేస్తున్న రైతుల్లో ధీమా వచ్చేలా చేశామని కేసీఆర్‌ తెలిపారు. దేశానికే ఆదర్శంగా అనేక పనులుచేసి చూపించామన్నారు. గురుకుల విద్యలో మనకు మనమే సాటి, ఎవరూ లేరు పోటీ అని పేర్కొన్నారు.  ఎన్నో అద్భుత విజయాలు సాధించామని, మనందరి సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందన్నారు.

కాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా జగిత్యాల చేరుకున్న సీఎం కేసీఆర్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని కేసీఆర్‌ ప్రారంభించారు.

పార్టీ కార్యాలయంలో గులాబీ జెండాను ఎగుర వేశారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, సంజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీ ఎల్‌ రమణ తదితరులు పాల్గొన్నారు.

సీఎం పర్యటన నేపథ్యంలో జగిత్యాల జిల్లా కేంద్రమంతా గులాబీమయమైంది. ఎటు చూసినా సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తూ పెద్ద ఫ్లెక్సీలు, కటౌట్లను ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్‌ పర్యటనతో మేడిపల్లి జగిత్యాల మధ్య భారీగా టట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. జగిత్యాలలో జరిగే సీఎం సభకు బస్సులు, వాహనాల్లో భారీగా జనాలు తరలివస్తుండటంతో అయిదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ క్లియర్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు