దసరాకు ధరణి

27 Sep, 2020 03:46 IST|Sakshi

ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌.. అంతకుముందే కొత్త రిజిస్ట్రేషన్‌ రేట్ల ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే దసరా రోజున ధరణి పోర్టల్‌ ప్రారంభిం చాలని సీఎం కె.చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. విజయదశమి రోజు (అక్టోబర్‌ 25)న ప్రజలు మంచి ముహూర్తంగా భావిస్తున్నందున.. ఆ రోజు సీఎం కేసీఆర్‌ స్వయంగా ధరణి పోర్టల్‌ను ప్రారంభిస్తారు. ధరణి పోర్టల్‌ ప్రారంభించడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను ఆలోపుగానే పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్‌ ప్రారంభం కావడానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నంబర్ల వారీగా రిజిస్ట్రేషన్‌  రేట్లను నిర్ణయించనున్నట్లు సీఎం చెప్పారు.

అదే రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. ధరణి పోర్టల్‌కు అవసరమైన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, బ్యాండ్‌ విడ్త్‌లను సిద్ధం చేయాలని కోరారు. మారిన రిజిస్ట్రేషన్‌  విధానం, వెంటనే మ్యుటేషన్‌  వివరాలను పోర్టల్‌కు అప్‌డేట్‌ చేయడం తదితర అంశాలపై, విధివిధానాలపై తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సబ్‌ రిజిస్ట్రార్‌లకు అవసరమైన శిక్షణ ఇవ్వ నున్నట్లు సీఎం వెల్లడించారు. డెమో ట్రయల్స్‌ కూడా నిర్వ హించి అధికారులకు అవ గాహన కల్పించాలని నిర్ణ యించినట్లు చెప్పారు.

ప్రతి మండలానికి, ప్రతి సబ్‌ రిజి స్ట్రార్‌ కార్యాలయంలో ఒకరు చొప్పున కంప్యూటర్‌ ఆపరేటర్ల నియామకాన్ని పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. తహశీల్దార్, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో డాక్యుమెంట్‌ రైటర్స్‌కు లైసెన్సులు ఇచ్చి వారికి శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దసరా లోగానే అన్ని రకాల ఆస్తులకు సంబంధించిన డేటా ధరణి పోర్టల్‌లో ఎంటర్‌ చేయాలని అధికారులను  కోరారు. ఆ తర్వాత జరిగే మార్పులు చేర్పులు వెంటవెంటనే నమోదు చేయడం జరుగుతుందని సీఎం చెప్పారు. దసరా రోజున పోర్టల్‌ ప్రారంభిస్తున్నందున అదే రోజు రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. ఈ లోగా ఎలాంటి రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ వ్యవహారాలు జరగవని స్పష్టం చేశారు. 

ఆస్తులన్నీ ఆన్‌ లైన్‌ !
భూముల, స్థలాల భద్రతకు ఢోకా ఉండదదకూడదని భావించిన సర్కారు.. స్థిరాస్తులన్నింటినీ ఆన్‌ లైన్‌ లో నమోదు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతి ఆస్తిని ఆన్‌ లైన్‌ లో అప్‌డేట్‌ చేయడానికి పక్షం రోజుల గడువు నిర్దేశించింది. ఆస్తులను ఆన్‌ లైన్‌ లో నూరు శాతం నమోదు చేసిన తర్వాతే ధరణి కార్యకలాపాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇంతకు ముందే స్పష్టం చేశారు. రికార్డుల్లో ఏ మాత్రం తప్పులు దొర్లినా మొదటికే మోసం వస్తుందని చెప్పిన ఆయన.. ధరణి ప్రారంభించాలనే తొందరలో తప్పులకు తావివ్వకూడదని సూచించారు. దీంతో మూడు రోజులుగా నగర/పురపాలక సంస్థలు, గ్రామ పంచాయతీల్లో ఆస్తుల ఆన్‌ లైన్‌  ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, ప్రభుత్వం నిర్దేశించిన 15 రోజుల గడువు సరిపోయే పరిస్థితి కనిపించడంలేదు. ఈ క్రమంలో తొలుత నిర్మాణాలను ఆన్‌ లైన్‌ లో నమోదు చేసి.. ఖాళీ స్థలాలను ఆ తర్వాత పొందుపరచాలని యంత్రాంగం భావిస్తోంది.  

>
మరిన్ని వార్తలు