రూ.5 వేల కోట్ల నష్టం..

16 Oct, 2020 01:16 IST|Sakshi

తక్షణ సహాయంగా రూ.1,350 కోట్లు విడుదల చేయండి

ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేఖ

మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఆర్థిక సాయం

ఇళ్లు పూర్తిగా కూలిన వారికి కొత్త ఇళ్లు

పాక్షికంగా కూలిన ఇళ్ల మరమ్మతులకు ఆర్థిక సహాయం

నాలాలపై కూలిన ఇళ్ల స్థానంలో ప్రభుత్వ స్థలాల్లో కొత్త ఇళ్లు

వరదలపై సమీక్షలో సీఎం కేసీఆర్‌ ఆదేశం

వరద నష్టంపై ముఖ్యమంత్రికి అధికారుల నివేదిక

సాక్షి, హైదరాబాద్‌: భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రవ్యాప్తంగా రూ.5వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రక టించారు. వర్షాలతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు రూ.600 కోట్లు, జీహెచ్‌ఎంసీ సహా ఇతర ప్రాంతాల్లో సహాయ, పున రావాస, పునరుద్ధరణ చర్యల కోసం మరో రూ.750 కోట్లు కలిపి మొత్తం రూ.1,350 కోట్లను తక్షణ సహా యంగా విడుదల చేయా లని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్ర«ధాని మోదీకి గురువారం లేఖ రాశారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో తలెత్తిన పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లో వరదల ప్రభావం అధికంగా ఉన్నందున ఇక్కడ పరిస్థితిని చక్కదిద్దడంపై ప్రత్యేకంగా చర్చించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్‌ నగర పరిధిలో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు తక్షణమే జీహెచ్‌ఎంసీకి రూ.5 కోట్లు విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

బాధితులకు నిత్యావసరాలు..
భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయం అందించా లని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశిం చారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు బియ్యం, పప్పు, ఇతర నిత్యావసర సరుకులతో పాటు ప్రతీ ఇంటికి మూడు రగ్గులను ప్రభుత్వ పక్షాన వెంటనే అందించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు వెల్లడిం చారు. ఇళ్లు పూర్తిగా కూలిపోయిన వారికి కొత్త ఇళ్లు మంజూరు చేస్తామని, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులకు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. నాలాలపై కట్టిన ఇళ్లు కూడా కూలిపోయా యని, వాటి స్థానంలో ప్రభుత్వ స్థలంలో కొత్త ఇళ్ల నిర్మాణం జరుపుతామని తెలిపారు.

నీళ్లు తొలగించాకే విద్యుత్‌ పునరుద్ధరణ...
లోతట్టు ప్రాంతాలు, అపార్ట్‌మెంట్ల సెల్లార్లలో నీళ్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించి, విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. నీళ్లుండగానే విద్యుత్‌ సరఫరా చేయడం ప్రమాదకరమని, ఒకటి రెండు రోజులు ఇబ్బంది కలిగినా ప్రాణనష్టం కలగకుండా ఉండేం దుకు నీళ్లు పూర్తిగా తొలగిన తర్వాతే విద్యుత్‌ సరఫరా చేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో వరదల పరిస్థితిని గమనిస్తే, చాలా చోట్ల చెరువుల పూర్తి నిల్వ స్థాయి(ఎఫ్‌టీఎల్‌) పరిధిలో ఏర్పాటైన కాలనీలే జలమయమయ్యాయని పేర్కొన్నారు. అపార్టుమెంట్ల సెల్లార్లలో నీళ్లు నిలవడం వల్ల కూడా చాలా చోట్ల ఇబ్బందులు తలెత్తుతు న్నాయ న్నారు. ఇక నుంచి అపార్టుమెంట్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చే సమయంలో వరద నీరు సెల్లార్ల లో నిలిచి ఉండకుండా చూసే ఏర్పాటు చేయాలనే నిబంధన పెట్టాలని ఆదేశించారు. కాలనీలు, అపార్టుమెంట్లలో నిలిచిన నీళ్లను తొలగించడానికి మెట్రో వాటర్‌ వర్క్స్, ఫైర్‌ సర్వీస్‌ సేవలను విని యోగించుకోవాలని సూచించారు. ఇళ్లపై హైటె న్షన్‌ లైన్లు వెళ్లే ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే అవ కాశం ఉన్నందున, రాష్ట్రవ్యాప్తంగా ఈ లైన్ల తొల గింపునకు కార్యాచరణ రూపొందించాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు. సమీక్షలో మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్‌ అలీ, సీఎస్‌ సోమేశ్‌ కుమార్, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌ రావు పాల్గొన్నారు. 

50 మంది మృతి.. రూ.2 వేల కోట్ల పంట నష్టం
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, వరదల వల్ల గురువారం నాటికి 50 మంది మరణించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా 7.35 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వీటిలో సగం పంటలకు నష్టం కలిగినా వాటి విలువ రూ.2 వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. వర్షాలు, వరదల వల్ల ప్రాణ, ఆస్తి నష్టంపై సంబంధిత శాఖల అధికారులు సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక సమర్పించారు. 

రోడ్లకు భారీ నష్టం..
రాష్ట్రవ్యాప్తంగా 101 చెరువు కట్టలు తెగాయి. 26 చెరువు కట్టలకు బుంగలు పడ్డాయి. జల వనరుల శాఖకు రూ.50 కోట్ల వరకు నష్టం జరిగినట్లు అంచనా. పంచాయతీ రాజ్‌ రోడ్లు 475 చోట్ల దెబ్బతిన్నాయి. 269 చోట్ల రోడ్లు తెగిపోయాయి. రూ.295 కోట్ల వరకు నష్టం జరిగినట్లు అంచనా. ఆర్‌అండ్‌బీ రోడ్లు 113 చోట్ల దెబ్బతిన్నాయి. ఆర్‌అండ్‌బీ పరిధిలో రూ.184 కోట్లు, నేషనల్‌ హైవేస్‌ పరిధిలో రూ.11 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా. 

వరదల్లో 20 వేల ఇళ్లు..
జీహెచ్‌ఎంసీ పరిధిలో 1916 తర్వాత ఒకేరోజు 31 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం ఇదే ప్రథమం. హైదరాబాద్‌లో 72 ప్రాంతా ల్లోని 144 కాలనీల్లో 20,540 ఇళ్లు నీటిలో చిక్కుకున్నాయి. 35వేల కుటుంబాలు ప్రభావి తమయ్యాయి. ఎల్‌బీనగర్, చార్మినార్, సికిం ద్రాబాద్, ఖైరతాబాద్‌ జోన్లలో వరదల ప్రభా వం ఎక్కువగా ఉంది. హైదరాబాద్లో 14 ఇళ్లు పూర్తిగా, 65 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 445 చోట్ల బీటీ రోడ్లు, 6 చోట్ల నేషనల్‌ హైవేలు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలోని మరో 30 పట్టణా ల్లో వర్షాలు, వరదల ప్రభావం ఉంది. 238 కాల నీలు జలమయ మయ్యాయి. 150 చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. ఇక ట్రాన్స్‌కో పరిధిలో 9 సబ్‌ స్టేషన్లు, ఎస్పీడీసీఎల్‌ పరిధిలో 15 సబ్‌స్టేషన్లు, ఎన్పీడీసీఎల్‌ పరిధిలో 2 సబ్‌ స్టేషన్లలోకి నీళ్లు వచ్చాయి. మూసీ నది వెంట ఉన్న ట్రాన్స్‌ ఫార్మ ర్లు, కరెంటు సం్తభాలు కొట్టుకు పోయాయి. మొత్తమ్మీద విద్యుత్‌ శాఖకు రూ.5 కోట్ల వరకు నష్టం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనా. 

మరిన్ని వార్తలు