పాన్‌ ఇండియా పార్టీ.. దసరాకు విడుదల!

10 Sep, 2022 01:03 IST|Sakshi

జాతీయ రాజకీయాల్లో అరంగేట్రానికి రంగం సిద్ధం 

కొత్త పార్టీలో పలు చిన్న పార్టీల విలీనానికి మంతనాలు 

పార్టీ ఏర్పాటును స్వాగతిస్తూ దేశవ్యాప్త వేడుకలకు ఏర్పాట్లు 

రాష్ట్ర సీఎంగా కొనసాగుతూనే దేశవ్యాప్త పర్యటనలకు యోచన 

రేపు హైదరాబాద్‌కు జేడీఎస్‌ నేత కుమారస్వామి 

రాష్ట్రంలోనూ పార్టీ నాయకులు, కార్యకర్తలను సిద్ధం చేస్తున్న కేసీఆర్‌ 

జాతీయ రాజకీయాల్లోకి రావాలంటూ జిల్లాల్లో తీర్మానాలు

పేరు, జెండా, ఎజెండాపై ఇప్పటికే కసరత్తు 

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దసరాను ముహూర్తంగా ఎంచుకున్నారు. విజయదశమి రోజున హైదరాబాద్‌ వేదికగా జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్‌ గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జాతీయ పార్టీ పేరు, పతాకం, ఎజెండా తదితరాలపై ఇప్పటికే కసరత్తు పూర్తిచేసిన కేసీఆర్‌.. దేశ ప్రజల దృష్టిని ఆకర్షించేలా పార్టీ ప్రకటన ఉండాలని భావిస్తున్నారు.

పార్టీ ప్రారంభానికి జాతీయస్థాయిలో భావ సారూప్యత కలిగిన పార్టీలు, ముఖ్య నేతలు, ముఖ్యమంత్రులను ఆహ్వానించేందుకు మంతనాలు జరుగుతున్నాయి. కొత్త జాతీయ పార్టీ ప్రకటనను స్వాగతిస్తూ తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా వేడుకలు జరిగేలా సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. పార్టీ ప్రకటన తర్వాత సుమారు రెండు నెలల పాటు వివిధ రాష్ట్రాల్లో విస్తృతస్థాయిలో పర్యటించేలా షెడ్యూల్‌ కూడా రూపొందిస్తున్నట్టు టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. 

గులాబీ జెండా.. భారతదేశ చిత్రపటం? 
వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమాతోపాటు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమ్మేళనంగా కేసీఆర్‌ జాతీయ పార్టీ ఎజెండా ఉంటుందని అంచనా. రైతులు, దళితులు, సైనికులు, యువత తదితర వర్గాలకు పార్టీ ఎజెండాలో పెద్దపీట వేయనున్నారు. ప్రస్తుత టీఆర్‌ఎస్‌ జెండా తరహాలోనే జాతీయ పార్టీ జెండా కూడా గులాబీ రంగులో భారతదేశ చిత్రపటంతో ఉంటుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ పార్టీకి ‘భారతీయ రాష్ట్ర్‌ర సమితి’గా పేరు ఉంటుందనే ప్రచారం జరుగుతున్నా చివరి నిమిషం దాకా పేరుపై సస్పెన్స్‌ కొనసాగే అవకాశముంది. 

జిల్లాల్లో పార్టీ నేతల తీర్మానాలు 
సుమారు ఏడాదిన్నరగా జాతీయ పార్టీ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్‌.. టీఆర్‌ఎస్‌ ప్లీనరీ, పార్టీ సమావేశాలు, బహిరంగ సభల్లో కొత్త పార్టీ ఏర్పాటుకు ఆమోదం కోరుతూ వస్తున్నారు. తాజాగా శుక్రవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. ఇదే తరహాలో పార్టీ శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ నేతలు కూడా ప్రకటన చేయనున్నారు. సోమ, మంగళవారాల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు తమ ప్రసంగాల్లో సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించే అవకాశం ఉందని తెలిసింది. ఇక కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ జిల్లా, మండల స్థాయిలోనూ టీఆర్‌ఎస్‌ నేతలు తీర్మానాలు చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

కీలక టీమ్‌లో వినోద్, కవిత? 
కొత్త జాతీయ పార్టీ విస్తరణకు అవసరమైన టీమ్‌ను సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నట్టు టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలకు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిసింది. వీరితోపాటు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ తదితరుల సేవలను కూడా కొత్త జాతీయ పార్టీలో కేసీఆర్‌ ఉపయోగించుకుంటారని సమాచారం.

రేపు రాష్ట్రానికి జేడీఎస్‌ నేత కుమారస్వామి 
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పలువురు బీజేపీయేతర, కాంగ్రెసేతర సీఎంలు, ముఖ్య నేతలతో కేసీఆర్‌ వరుసగా భేటీలు జరిపిన విషయం తెలిసిందే. తాజాగా కేసీఆర్‌ ఆహ్వానం మేరకు కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్‌ అధ్యక్షుడు కుమారస్వామి ఆదివారం హైదరాబాద్‌కు వస్తున్నారు. కేసీఆర్‌ ఏర్పాటు చేసే జాతీయ పార్టీలో చిన్నా, చితకా ప్రాంతీయ పార్టీలు, దేశవ్యాప్తంగా పేరొందిన కొందరు ప్రముఖ నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఉంటారని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. ఆయా పార్టీల విలీనం, చేరికలకు సంబంధించి ఇప్పటికే మంతనాలు పూర్తయినట్టు సమాచారం. జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటన తర్వాత.. కేసీఆర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే దేశవ్యాప్త పర్యటనల ద్వారా కొత్త పార్టీ విస్తరణ, బలోపేతం దిశగా కృషి చేయనున్నట్టు టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. 


ఇదీ చదవండి: ఎన్నికలే టార్గెట్‌గా ఇన్‌చార్జ్‌ల నియామకం.. బీజేపీ మాస్టర్‌ ప్లాన్స్‌!

మరిన్ని వార్తలు