TS: తక్షణ సాయమందాలి 

19 Jul, 2022 01:47 IST|Sakshi

ముంపు ప్రాంతాల్లో వెంటనే సర్వే చేయండి

అధికార యంత్రాంగానికి సీఎం కేసీఆర్‌ ఆదేశం

దెబ్బతిన్న రోడ్లు, చెరువులకు త్వరగా మరమ్మతులు చేయండి

బాధితులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి

ములుగు, ఏటూరునాగారం ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన

మంత్రి సత్యవతి రాథోడ్,హనుమకొండ, వరంగల్‌ కలెక్టర్లకు బాధ్యతలు

సాక్షిప్రతినిధి, వరంగల్‌: రాష్ట్రవ్యాప్తంగా వరద బాధితులకు తక్షణ సాయం అందించాలని.. ఇందుకోసం పంటలు, ఇళ్లు, ఇతర ఆస్తి నష్టంపై వెంటనే సర్వే నిర్వహించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దెబ్బతిన్న రహదారులు, చెరువులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా ములుగు, ఏటూరునాగారం ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని స్పష్టం చేశారు. శని, ఆదివారాల్లో గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్‌ ఆదివారం రాత్రి హనుమకొండలోనే బస చేశారు. సోమవారం హైదరాబాద్‌కు బయలుదేరే ముందు ఉమ్మడి వరంగల్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇతర అధికారులతో సమీక్షించారు. 

సత్వరమే చర్యలు చేపట్టండి
భవిష్యత్‌లో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ముంపు ప్రమాదం ఏర్పడకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఈసారి దెబ్బతిన్న ప్రాంతాల్లో సత్వరమే మౌలిక వసతులు కల్పించేలా ప్రభుత్వ యంత్రాంగం చొరవ తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాలు కురిసి, వరదలు వచ్చినా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులను అభినందించారు. పరిస్థితి చక్కబడే వరకు ప్రతీశాఖ అధికారులు 3 షిఫ్టులుగా పనిచేసి.. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు, సహాయ కార్యక్రమాలకు అవసరమైన చర్య లు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. గత ప్రభుత్వాలు  తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే చేపట్టాయని.. ఎన్ని నిధులు ఖర్చయినా శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు.

ములుగు, ఏటూరునాగారం ప్రాంతాల్లో పరిస్థితి చక్కబడే వరకు మంత్రి సత్యవతి రాథోడ్‌ ఏజెన్సీ ప్రాంతంలోనే ఉండి పర్యవేక్షించాలని సూచించారు. ఈ రెండు ప్రాంతాల్లో అవసరమైన పనులు, సహాయ చర్యలకు ఇన్‌చార్జులుగా హనుమకొండ, వరంగల్‌ జిల్లాల కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, డాక్టర్‌ గోపిలను నియమిస్తున్నట్టు కేసీఆర్‌ ప్రకటించారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్, చీఫ్‌ సెక్రెటరీ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నరేందర్, వెంకటరమణారెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బండా ప్రకాశ్, బస్వరాజు సారయ్య, కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, డాక్టర్‌ గోపి, మరికొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

వరంగల్‌లో ‘సూపర్‌ స్పెషాలిటీ’పై ఆరా
వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులపై కేసీఆర్‌ ఆరా తీశారు. ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించి, పరిస్థితిని వివరించాలని మంత్రులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఉదయం మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, తదితరులు
వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించారు.  

రోడ్డుమార్గంలో హైదరాబాద్‌కు..
శనివారం సాయంత్రం రోడ్డుమార్గంలో హనుమకొండకు చేరుకున్న సీఎం కేసీఆర్‌.. సోమవారం అదే రోడ్డుమార్గంలో తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌ సోమవారం మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో మాట్లాడిన అనంతరం కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు నివాసం నుంచే ప్రత్యేక బస్సులో హైదరాబాద్‌కు బయలుదేరారు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఓటేయాల్సి ఉన్నందున ఆయనతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అదే బస్సులో హైదరాబాద్‌కు వచ్చారు.  

మరిన్ని వార్తలు