రైతులంతా సంఘటితం కావాలి

28 Aug, 2022 01:56 IST|Sakshi

ప్రజల కోసం పనిచేసే వాళ్లను.. దేశ పాలకులే ఇబ్బందులకు గురిచేస్తున్నారు

జాతీయ రైతు సంఘాల నాయకులతో సమావేశంలో సీఎం కేసీఆర్‌ 

ఈ పరిస్థితుల నుంచి దేశాన్ని బయటపడేయాల్సి ఉందని వ్యాఖ్య

ప్రజల సంక్షేమం కోరుకునే శక్తులు ఆ దిశగా కలిసి పోరాడాలని పిలుపు

రాష్ట్రంలో రైతు సంక్షేమ పథకాలపై నాయకుల హర్షం

సాక్షి, హైదరాబాద్‌:‘‘చట్టసభల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన వాళ్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రజల కోసం పనిచేసే వాళ్లను దేశ పాలకులే ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి దేశంలో కొనసాగుతుండటం మనందరి దురదృష్టం..’’ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి దేశాన్ని బయటపడేసేందుకు ప్రజల సంక్షేమం కోరుకునే శక్తులు పోరాడాల్సి ఉందని చెప్పారు. ఈ సంఘర్షణ ప్రారంభ దశలో కలిసి వచ్చే శక్తులు కొంత అనుమానాలు, అపోహలకు గురవుతుంటాయని.. ఈ అడ్డంకులు దాటుకొంటూ ఐక్యత సాధించి లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

తెలంగాణలో వ్యవసాయ రంగ పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు వచ్చిన 26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలతో సీఎం కేసీఆర్‌ శనివారం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమపథకాలను రైతు నేతలు తెలుసుకున్నారు. తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతు సంక్షేమ విధానాలు దేశవ్యాప్తంగా అమలయ్యేలా చూసేందుకు జాతీయ రైతు ఐక్యవేదిక ఏర్పాటు కావాలని అభిప్రాయపడ్డారు. అనంతరం ఉత్తర, దక్షిణ, ఈశాన్య రాష్ట్రాల్లో రైతుల సమస్యలపై సీఎం కేసీఆర్‌ ఆరా తీయగా.. కేంద్ర రైతు వ్యతిరేక, అసంబద్ధ విధానాలతో నష్టం జరుగుతోందని రైతు నాయకులు వివరించారు. తెలంగాణలో మాదిరిగా తమకూ సహకారం దొరికితే కష్టాల నుంచి బయటపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలపై కలిపి ముందుకెళదామని సీఎం కేసీఆర్‌ వారికి సూచించారు.

ఇంకా వ్యవసాయ సంక్షోభం ఎందుకు?
‘‘దేశంలో సాగునీరుంది. కరెంటుంది. కష్టపడే రైతులున్నారు. అయినా వ్యవసాయ సంక్షోభం ఎందుకుంది? రైతుల ఆత్మహత్యలు ఎందుకు కొనసాగుతున్నాయి? కేంద్ర పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణం. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచాక కూడా కేంద్రంలో పాలనా వ్యవస్థ ఇంకా గాడిన పడకుండా, ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేరకుండా పోవడానికి గల కారణాలను మనం అన్వేషించాలి. అనేక వర్గాలు తమ ఆకాంక్షలను, హక్కులను నెరవేర్చుకునేందుకు ఇంకా పోరాటాలకు సిద్ధపడుతుండటం ఎందుకో ఆలోచించాలి. దేశంలో రైతు సమస్యలకు ఇంకా ఎందుకు పరిష్కారం దొరకడం లేదో, ఈ దేశ పాలకులు ఎందుకు వైఫల్యం చెందుతున్నారో చర్చించుకోవాలి.

దేశంలో అవసరానికి మించి నీళ్లు ఉన్నా ప్రజలు సాగునీటికి, తాగునీటికి ఇంకా ఎందుకు ఎదురు చూడాల్సి వస్తోంది? దేశంలో నాలుగు లక్షల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యమున్నా 2 లక్షల మెగావాట్ల విద్యుత్‌ను కూడా వినియోగించుకోలేకపోతున్నాం. మేం తెలంగాణలో రైతులందరికీ ఉచిత విద్యుత్‌ ఇస్తూ, సాగునీటిని అందిస్తున్నపుడు.. ఇదే పనిని కేంద్రం దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయదు? తెలంగాణలో ఉన్నట్టు దేశంలో ఎక్కడైనా కిసాన్‌ మంచ్‌లు ఉన్నాయా?’’అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. దేశ వనరులను సరిగా వినియోగించుకుంటూ.. రైతు వ్యవసాయ సంక్షేమ దిశగా సాగే సుపరిపాలన కోసం దేశంలోని రైతాంగమంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు.

దేశానికి కేసీఆర్‌ వంటి నాయకత్వం కావాలి!
నిన్నటితరం రైతు సంఘాల నేతలు చరణ్‌ సింగ్, దేవీలాల్, జయప్రకాశ్‌ నారాయణ్, శరద్‌ పవార్‌ తదితరులతో కలిసి పనిచేసిన 80 ఏళ్ల వయసు పైబడిన పలువురు రైతు నేతలు కేసీఆర్‌తో సమావేశంలో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. దేశానికి సీఎం కేసీఆర్‌లాంటి నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. వ్యవసాయం, సాగునీరు తదితర రంగాల్లో తెలంగాణ ప్రగతిపై ప్రదర్శించిన డాక్యుమెంటరీ చూసి మెచ్చుకున్నారు.

తమ రాష్ట్రాల్లోనూ ఇలాంటి రైతు సంక్షేమ పథకాలు ఉంటే.. తాము కూడా ఎంతో అభివృద్ధి చెందేవారమని పేర్కొన్నారు. తెలంగాణ సహా ఢిల్లీ, ఒడిశా, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, హరియాణా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, అసోం, మిజోరం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, పాండిచ్చేరి, దాద్రానగర్‌ హవేలి తదితర రాష్ట్రాల రైతు సంఘాల నేతలు 100 మంది వరకు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారం కూడా రైతుల సమావేశం కొనసాగనుంది.

మరిన్ని వార్తలు