యాసంగి ధాన్యమే ఎజెండా!

12 Apr, 2022 01:46 IST|Sakshi

నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

సీఎం అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు భేటీ.. వరిసాగు విస్తీర్ణం, ఎంత కొనుగోలు చేయాల్సి ఉంటుంది.. తదితరాలపై చర్చ! 

ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఢిల్లీలో కేసీఆర్‌ సంకేతాలు 

కేంద్రంపై పోరాటానికి ఉద్యమ కార్యాచరణపైనా కేబినెట్‌లో నిర్ణయం 

వచ్చే నెలలో భారీ బహిరంగ సభ.. టికాయత్, ఒకరిద్దరు సీఎంల హాజరు!

సాక్షి, హైదరాబాద్‌: యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. ధాన్యం కొనుగోలుపై 24 గంటల్లో స్పందించాలని ఢిల్లీలో దీక్ష సందర్భంగా కేంద్రానికి గడువు విధించిన కేసీఆర్‌.. మంగళవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సీఎం అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో ఈ భేటీ జరుగుతుంది. ఢిల్లీలో దీక్ష సందర్భంగా.. కేంద్రం కొనుగోలు చేయకున్నా తెలంగాణ పేదరికంలో లేదని ప్రకటించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేస్తుందనే సంకేతాలు సీఎం ఇచ్చారు.

ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే కేబినెట్‌ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే అంశమే ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశముంది. యాసంగిలో వరిసాగు విస్తీర్ణం, విత్తనాలు, వ్యక్తిగత అవసరాలు, మిల్లర్లు కొనుగోలు చేసే ధాన్యం తదితరాలను మినహాయిస్తే ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన ధాన్యం ఎంత ఉంటుంది? తదితర అంశాలపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. యాసంగిలో 36 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగ్గా, 70 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశముందని ఇప్పటికే అంచనా వేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రమే కొనుగోలు చేస్తే ఎంత మేర ఆర్థిక భారం పడుతుందో చర్చించనున్నారు.  

15 తర్వాత పార్టీ విస్తృత స్థాయి భేటీ 
కేంద్రంపై పోరులో అనుసరించాల్సిన ఉద్యమ కార్యాచరణపైనా మంత్రివర్గ భేటీలో చర్చించే అవకాశముంది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తూనే కేంద్రం వైఖరిని రైతుల్లోకి బలంగా తీసుకెళ్లే యోచనలో కేసీఆర్‌ ఉన్నారు. ఈ నెల 15 తర్వాత మళ్లీ పార్టీ విస్తృత స్థాయి భేటీ నిర్వహించి ఉద్యమ కార్యాచరణను ప్రకటించే అవకాశముంది. 
నెలాఖరులో ఢిల్లీలో కీలక సమావేశం: ఈ నెలాఖరులో ఢిల్లీలో బీజేపీయేతర పార్టీల సీఎంలు, ఇతర నేతలతో సమావేశం నిర్వహించేందుకు సీఎం కేసీఆర్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ భేటీ తర్వాత మే మొదటి వారంలో మహబూబ్‌నగర్‌ లేదా కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ సభకు రైతు నేత రాకేశ్‌ టికాయత్‌ సహా ఇతర రాష్ట్రాల సీఎంలు ఒకరిద్దరు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ధాన్యం దుడ్లు... భరించేదెట్టా..?
యాసంగి ధాన్యం కొనుగోళ్లపై నేటి కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో అందుకు అవసరమైన నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ దృష్టి సారించింది. యాసంగి దిగుబడుల అంచనా ప్రకారం.. ధాన్యం కొనుగోలుకు ఏ మేరకు నిధులు అవసరమవుతాయో అంచనా వేసింది. ధాన్యాన్ని పచ్చి బియ్యంగా మార్చి కేంద్రానికి ఇచ్చాక.. మిగిలే ఉప్పుడు బియ్యంతో రూ. 3 వేల కోట్లకుపైగా రాష్ట్రంపై భారం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో «ధాన్యం కొనుగోలుకు అవసరమయ్యే నిధులు సమకూర్చుకోవడంతోపాటు ఖజానాపై పడే అదనపు భారం రూ. 3 వేల కోట్లను సర్దుబాటు చేసే అంశంపైనా ప్రణాళిక ప్రకారం ముందుకెళుతున్నామని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉన్నాయని, కొనుగోలు కేంద్రాలు, ఇతర వసతులు సమకూర్చుకోవాల్సి ఉందన్నారు.

మరిన్ని వార్తలు