వారంలోగా పూర్తి చేయండి

12 Jan, 2021 02:36 IST|Sakshi

ధరణి సమస్యలపై కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగానికి సీఎం దిశానిర్దేశం

మ్యుటేషన్ల కోసం మళ్లీ దరఖాస్తు తీసుకోండి..

పార్ట్‌–బీ భూములకూ త్వరలోనే పరిష్కారం చూపండి

కింది స్థాయి అధికారులకు బాధ్యతలు వద్దు..

అన్నీ కలెక్టర్లే చూసుకోవాలన్న ముఖ్యమంత్రి 

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్ల విషయంలో మరింత వెసులుబాటు కల్పించేందుకు వీలుగా అవసరమైన మార్పులను వారం రోజుల్లోగా ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. భూరికార్డుల నిర్వహణ, అమ్మకాలు, కొనుగోళ్లు తదితర ప్రక్రియలన్నీ పారదర్శకంగా, అవినీతి రహితంగా, ఎలాంటి జాప్యం లేకుండా ఉండేందుకు తెచ్చిన ధరణి పోర్టల్‌ వందకు వంద శాతం విజయవంతమైందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం మంత్రులు, జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో ప్రగతిభవన్‌లో జరిగిన సమావేశంలో భాగంగా ధరణి పోర్టల్, క్షేత్రస్థాయిలో కలుగుతున్న ఇబ్బందులు, అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు.

‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రెవెన్యూ రికార్డుల నిర్వహణ ఎంతో అస్తవ్యస్తంగా ఉండేది. దీని కారణంగా ఘర్షణలు, వివాదాలు తలెత్తేవి.. రెవెన్యూ రికార్డులు స్పష్టంగా లేకపోవడం వల్ల కలిగే అనర్థాలను రూపుమాపేందుకు, ప్రతి గుంటకూ యజమాని ఎవరో స్పష్టంగా తెలిసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. భూరికార్డుల సమగ్ర ప్రక్షాళన, కొత్త పాస్‌ పుస్తకాల పంపిణీ, కొత్త రెవెన్యూ చట్టం తదితర సంస్కరణల ఫలితంగా భూ యాజమాన్య విషయంలో స్పష్టత వస్తున్నది..’అని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

వారికి మరో అవకాశం ఇవ్వండి.. 
రెవెన్యూ పరమైన అంశాలన్నింటినీ జిల్లా కలెక్టర్లే స్వయంగా చూసి, సత్వరం పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌ కోరారు. ‘ధరణి పోర్టల్‌ను మరింత యూజర్‌ ఫ్రెండ్లీగా మార్చాలి. ఇందుకోసం తక్షణం కొన్ని మార్పులు, చేర్పులు చేయాలి. ఎన్నారైలకు తమ పాస్‌పోర్ట్‌ నంబరు ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయడానికి ధరణి పోర్టల్‌లో అవకాశం కల్పించాలి. కంపెనీలు, సొసైటీలు కొనుగోలు చేసిన భూములకు కూడా పాస్‌బుక్‌ పొందేవిధంగా ధరణిలో వెసులుబాటు కల్పించాలి. గతంలో ఆధార్‌ కార్డు నంబర్‌ ఇవ్వని వారి వివరాలను ధరణిలో నమోదు చేయలేదు.

అలాంటి వారికి మరోసారి అవకాశమిచ్చి, ఆధార్‌ నంబరు నమోదు చేసుకుని పాస్‌ పుస్తకాలు ఇవ్వాలి. ఏజెన్సీ ఏరియాల్లోని ల్యాండ్‌ ట్రాన్స్‌ఫర్‌ రెగ్యులేషన్స్‌ వివాదాలన్నింటినీ జిల్లా కలెక్టర్లు నెల రోజుల్లో పరిష్కరించాలి. స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్న వారు తమ బుకింగ్‌ను అవసరమైతే రద్దు చేసుకోవడానికి, రీషెడ్యూల్‌ చేసుకోవడానికి ధరణిలోనే అవకాశం కల్పించాలి..’అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

అవి మినహా మిగతావి పరిష్కరించండి.. 
‘నిషేధిత భూముల జాబితాను ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులతో సవరించాలి. కోర్టు తీర్పులకు అనుగుణంగా మార్పులు చేయాలి. ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన భూమిని కూడా వెనువెంటనే నిషేధిత జాబితాలో చేర్చాలి. కోర్టు కేసులు మినహా పార్ట్‌–బీలో చేర్చిన అంశాలన్నింటినీ పరిష్కరించాలి. సాదాబైనామాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పరిశీలించి, పరిష్కరించాలి.. ధరణి పోర్టల్‌లో జీపీఏ, ఎస్‌పీఏ, ఏజీపీఏ చేసుకోవడానికి అవకాశం కల్పించాలి. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఏర్పడే జిల్లా స్థాయి ట్రిబ్యునళ్లకు ఇప్పటివరకు రెవెన్యూ కోర్టుల పరిధిలో ఉన్న కేసులను బదలాయించి త్వరితగతిన పరిష్కరించాలి.

రెవెన్యూ పరమైన అంశాలన్నింటినీ కిందిస్థాయి అధికారులకు అప్పగించి, కలెక్టర్లు చేతులు దులుపుకుంటే ఆశించిన ఫలితం రాదు. కాబట్టి కలెక్టర్లే అన్ని విషయాల్లో స్వయంగా పరిశీలన జరిపి, నిర్ణయాలు తీసుకోవాలి.’అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తయిన వ్యవసాయ భూముల మ్యుటేషన్‌ను వెంటనే నిర్వహించాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. పెండింగ్‌ మ్యుటేషన్ల కోసం తాజాగా దరఖాస్తులు తీసుకోవాలని, వారం రోజుల్లోగా మ్యుటేషన్లు చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు