పదవీ విరమణ వయసు పెంపు కూడా..

31 Dec, 2020 15:26 IST|Sakshi

పదవీ విరమణ వయసు పెంపు కూడా..

తొలి వారంలో ఉద్యోగ సంఘాలతో ఐఏఎస్‌ల కమిటీ చర్చలు   

రెండో వారంలో సీఎంకు నివేదిక

మూడో వారం సీఎం ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన సంవత్సరం శుభవార్త. జనవరి మూడో వారంలో ఉద్యోగులకు వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) ఫిట్‌ మెంట్‌ శాతంతోపాటు పదవీ విరమణ వయసు పెంపుపై ప్రకటన చేస్తానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. ఉద్యోగుల వేతన సవరణపై నియమించిన వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) గురువారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను కలసి నివేదిక సమర్పించింది. సీఎస్‌ నేతృత్వంలోని ముగ్గురు ఐఏఎస్‌ అధికారుల కమిటీ రెండు, మూడు రోజుల్లో నివేదికపై అధ్యయనం జరుపుతుందని, అనంతరం జనవరి తొలి వారం లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరుపుతుందని సీఎం ప్రకటించారు. జనవరి 6, 7 తేదీల్లో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని సీఎస్‌ కు సూచించారు.

ఈ చర్చల సారం ఆధారంగా రెండోవారంలో తనకు నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించారు. ఈ నివేదిక అందిన తర్వాత జనవరి మూడో వారంలో పీఆర్సీ ఫిట్‌మెంట్‌ శాతా న్ని ప్రకటిస్తానని ముఖ్యమంత్రి పేర్కొ న్నారు. అదే సమయంలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై సైతం మరో కీలక ప్రకటన చేస్తానని సీఎం తెలియజేశారు. ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్‌ మరో దఫా చర్చలు జరిపి ఈ ప్రకటన చేయనున్నారు. టీఎన్జీవో, టీజీవో, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం, రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ల డైరీలు, క్యాలెండర్లను గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరించారు. అనంతరం వారితో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం ఈ సందర్భంగా కీలక హామీలు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు అన్ని రకాల ఉద్యోగుల వేతనాలను పెంచనున్నామని తెలియజేశారు.

ఈ సమావేశంలో టీఎన్జీవోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మామిండ్ల రాజేందర్, ప్రతాప్, టీజీవోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మమత, సత్యనారాయణ, హైదరాబాద్‌ అధ్యక్షుడు ఎంబీ కృష్ణ యాదవ్, నాలుగో తరగతి ఉద్యోగల సంఘం నాయకుడు జ్ఞానేశ్వర్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వంగ రవీందర్‌రెడ్డి, గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు. టీచర్లతో త్వరలో సీఎం భేటీ..: ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఎమ్మెల్సీలతో త్వరలో సమావేశమై వారి సమస్యలపై చర్చిస్తానని సీఎం ప్రకటించారు. టీచర్ల బదిలీలు, పదోన్నతులపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.  

జనవరిలోనే పదోన్నతులు 
అన్ని శాఖలు, హెచ్‌వోడీల్లోని అన్ని కేడర్ల ఉద్యోగులకు జనవరిలోనే పదోన్నతులు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఏపీలో పనిచేస్తున్న 857 మంది తెలంగాణ ప్రాంత 4వ తరగతి ఉద్యోగులు, ఎన్జీవోలను అంతర్రాష్ట బదిలీల ద్వారా తెలంగాణకు తీసుకొస్తామన్నారు.   

మరిన్ని వార్తలు