14 నెలల తర్వాత ప్రధానిని కలిసిన సీఎం

13 Dec, 2020 01:00 IST|Sakshi
శనివారం ఢిల్లీలో సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ పరస్పర అభివాదం

ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ.. 

రాష్ట్ర సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని వినతి 

వరద సాయం, కృష్ణా జలాల పునఃపంపిణీ వంటి అంశాల ప్రస్తావన 

రాజకీయ అంశాలూ చర్చకు వచ్చి ఉండొచ్చంటున్న హస్తిన వర్గాలు

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం సమావేశమయ్యారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య రాజకీయ ఘర్షణ వాతావరణం తలెత్తిన అనంతరం తొలిసారిగా ప్రధానితో జరిగిన ఈ సమావేశం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది. దాదాపు 14 నెలల తర్వాత మోదీతో కేసీఆర్‌ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు 40 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, రాజకీయపరమైన అంశాలపైనా ఇరువురూ చర్చించి ఉండొచ్చని ఢిల్లీ రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాజకీయంగా ఎలాంటి చర్చ జరిగిందనే విషయం తెలియకపోయినా.. ఇటీవలి ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య రగిలిన వేడిని చల్లార్చడానికి ఈ భేటీ ఉపకరిస్తుందని విశ్లేషిస్తున్నాయి.

అంశాలవారీగా కేంద్రానికి మద్దతిస్తూ వస్తున్న టీఆర్‌ఎస్‌.. గతంలో మాదిరిగానే బీజేపీతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించే దిశగా ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందని అంచనా వేస్తున్నాయి. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వచ్చిన సీఎం కేసీఆర్‌.. రెండోరోజు శనివారం రాత్రి 7 గంటలకు ప్రధానితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గతంలో ప్రధానికి నివేదించిన దాదాపు 20 అంశాలను పరిష్కరించడంతో పాటు ఇటీవలి భారీ వర్షాలతో అతలాకుతలమైన హైదరాబాద్, ఇతర జిల్లాలకు వరద సాయం చేయాలని మోదీని కోరినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వరద సాయం, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కృష్ణా నదీ జలాల పునఃపంపిణీ, సాగునీటి ప్రాజెక్టులకు సాయం, విభజన చట్టంలోని హామీల అమలు తదితర కీలక అంశాలపై చర్చించినట్లు వివరించాయి. కేసీఆర్‌ రెండోసారి గద్దెనెక్కిన అనంతరం 2018 డిసెంబర్‌ 26న ఒకసారి, 2019 అక్టోబర్‌ 4న రెండోసారి మోదీతో భేటీ కాగా, తాజాగా మూడోసారి ఆయన్ను కలిశారు. ప్రభుత్వ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు ముఖ్యమంత్రి చర్చించిన అంశాలు ఇవీ.. 

సాగునీటి రంగంపై.. 
కృష్ణా నదీ పరివాహక ప్రాంత రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఉండేవని, కొత్తగా తెలంగాణ ఏర్పడిన నేపథ్యంలో ఆ నదీ జలాల పంపిణీని నాలుగు రాష్ట్రాల మధ్య తిరిగి చేపట్టాలని, ఇందుకు కొత్తగా ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ అంతర్రాష్ట నదీ జలాల వివాద చట్టం(ఐఎస్‌ఆర్‌డబ్ల్యూ)–1956లోని సెక్షన్‌–3 కింద తెలంగాణ 2014 జూలై 7న కేంద్ర జలవనరుల శాఖకు ఫిర్యాదు చేసిన సంగతిని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర జల వనరుల శాఖ ఈ చట్టంలోని సెక్షన్‌ 5(1) ద్వారా సంక్రమించిన అధికారాలతో ఈ ఫిర్యాదుపై విచారణకు కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయడం గానీ, ఉనికిలో ఉన్న ట్రిబ్యునల్‌ను విచారించమనడం కానీ చేయాలని వివరించారు. కానీ ఈ ఫిర్యాదును కేంద్రం పట్టించుకోకుండా కేవలం ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 89 అమలు అంశాల కోసం మాత్రమే బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ గడువు పొడిగించిందని తెలిపారు. సెక్షన్‌ 89 పరిధి చాలా పరిమితమని, ఇది తెలంగాణ హక్కులను కాపాడడంలో ఎంత మాత్రం న్యాయం చేయదని నివేదించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇచ్చిన ఫిర్యాదును కేంద్రం పునఃపరిశీలన చేసి అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టంలోని సెక్షన్‌ 5(1) కింద కేడబ్ల్యూడీటీ–2కు రెఫర్‌ చేయాలని కోరారు. అలాగే తెలంగాణకు జీవరేఖగా నిలుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వాలని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ భారీ నీటి పారుదల ప్రాజెక్టుకు ప్రత్యేక గ్రాంటు ఇవ్వాలని అభ్యర్థించారు.

వరద సాయంపై.. 
తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.5వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని కేసీఆర్‌ తెలిపారు. తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం రూ.1,350 కోట్ల సాయాన్ని అందించాలని ఇదివరకే ప్రధానికి లేఖ రాసిన సంగతిని గుర్తు చేశారు. జాతీయ విపత్తు నిధి నుంచి నిధులు విడుదల చేసి సాయం చేయాలని కోరారు. 

విద్యా సంస్థలపై.. 
కరీంనగర్‌లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐఐఐటీ), హైదరాబాద్‌లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్, రీసెర్చ్‌(ఐఐఎస్‌ఈఆర్‌) ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ విన్నవించారు. అలాగే జిల్లాకు ఒకటి చొప్పున 21 కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరారు. విభజన చట్టాన్ని అనుసరించి వరంగల్‌ జిల్లాలో త్వరితగతిన గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్నారు.

మౌలిక వసతుల స్థాపనపై.. 
కేంద్ర ఉపరితల రవాణా శాఖ ప్రతిపాదించిన మేరకు జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ)తో కలిసి సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) ఆదిలాబాద్‌లోని సీసీఐ ప్లాంటును పునరుద్ధరించాలని ప్రధానికి కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ‘జహీరాబాద్‌లోని నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మాన్యుఫ్యాక్ఛరింగ్‌ జోన్‌(నిమ్జ్‌)కు నిధులు విడుదల చేయాలి. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ అభివద్ధికి వీలుగా రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయాలి. హైదరాబాద్‌–నాగ్‌పూర్, వరంగల్‌–హైదరాబాద్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ను అభివృద్ధి చేయాలి. వెనుకబడిన ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి పీఎంజీఎస్‌వై ద్వారా రూ.4వేల కోట్లు కేటాయించాలి. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టే రహదారుల పనులకు 60:40 నిష్పత్తిలో కాకుండా, వంద శాతం ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరించాలి. నీతి ఆయోగ్‌ సిఫారసుల మేరకు మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథలకు రూ.24 వేల కోట్లు మంజూరు చేయాలి’అని కేసీఆర్‌ కోరారు. 

పెండింగ్‌ అంశాలపై.. 
ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సత్వరం పరిష్కరించాలని మోదీకి ముఖ్యమంత్రి విన్నవించారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన బిల్లు ప్రకారం తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఏటా కేంద్రం రాష్ట్రానికి విడుదల చేయాల్సిన రూ. 450 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని, రైల్వే పనులకు అవసరమైన నిధులు కేంద్రం వెంటనే విడుదల చేయాలన్నారు. రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని, వరద కాలువలకు సవరించిన అంచనాల ప్రకారం నిధులు విడుదల చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. 

 
ఆరు ఎయిర్‌పోర్టులకు అనుమతివ్వండి 
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి పెండింగ్‌లో ఉన్న విమానాశ్రయాల నిర్మాణానికి సంబంధించిన అనుమతుల విషయంలో చొరవ చూపించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురీకి సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్‌.. శనివారం మధ్యాహ్నం హర్దీప్‌సింగ్‌తో 20 నిమిషాలపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించిన లేఖ ఆయనకు అందజేశారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన వెంటనే మరో 5 నూతన విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి మోదీకి విజ్ఞప్తి చేశాం. 2018లో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) చైర్మన్‌తో సంప్రదింపుల తర్వాత రాష్ట్రంలోని 6 ప్రాంతాల్లో డొమెస్టిక్‌ ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు సంబంధించిన నివేదికను ఏఏఐకి పంపించాం. తొలుత చిన్న విమానాల కోసం నో–ఫ్రిల్స్‌ ఎయిర్‌పోర్టులు ఏర్పాటవుతాయని, అనంతరం భవిష్యత్తులో రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించుకొనే అవకాశం ఉంటుందనే విషయాన్ని ఏఏఐ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది’అని సీఎం గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలోని బసంత్‌నగర్‌ (బ్రౌన్‌ ఫీల్డ్‌), వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని మామునూరు (బ్రౌన్‌ ఫీల్డ్‌), ఆదిలాబాద్‌ (బ్రౌన్‌ ఫీల్డ్‌), నిజామాబాద్‌ జిల్లాలోని జక్రాపల్లి (గ్రీన్‌ ఫీల్డ్‌), మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దేవరకద్ర (గ్రీన్‌ ఫీల్డ్‌), భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో (గ్రీన్‌ ఫీల్డ్‌) విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలోని అన్ని ప్రతిపాదిత విమానాశ్రయాల స్థలాలను ఖరారు చేయడంలో సింగిల్‌ విండో ప్రతిపాదికన అన్ని చట్టబద్దమైన అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనుమతులు వచ్చిన వెంటనే నాన్‌–షెడ్యూల్డ్‌ ఆపరేటర్స్‌ పర్మిట్‌ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సొంత నిధులతో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ లేఖలో కేసీఆర్‌ పేర్కొన్నారు. 

పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయింపుపై కృతజ్ఞతలు 
దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థ్థలం కేటాయించినందుకు పట్టణ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న హర్దీప్‌సింగ్‌ పురీకి కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం కోసం, పట్టణాభివృద్ధికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన బకాయి నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. కేంద్రమంత్రితో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్‌తోపాటురాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పాల్గొన్నారు.  

పరస్పర అభినందనలు.. 
తెలంగాణలో ఇటీవలి కాలంలో అమెజాన్‌ వంటి బహుళ జాతి సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు హైదరాబాద్‌ను ఎంచుకోవడం, పలు కొత్త కంపెనీలతో పాటు పాత కంపెనీలు హైదరాబాద్‌ను పెట్టుబడుల గమ్యస్థానంగా ఎంచుకోవడాన్ని కేసీఆర్‌ వివరించగా.. ప్రధాని మోదీ అభినందించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే నూతన పార్లమెంటు భవన నిర్మాణం అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రధానిని కేసీఆర్‌ అభినందించినట్టు వివరించాయి.
 

>
మరిన్ని వార్తలు