మరిన్ని అనుమతులివ్వండి

7 Sep, 2021 11:18 IST|Sakshi
సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి గడ్కరీకి పుష్పగుచ్ఛం ఇస్తున్న సీఎం కేసీఆర్‌

ఆర్‌ఆర్‌ఆర్‌పై కేంద్ర రహదారుల మంత్రి గడ్కరీకి సీఎం కేసీఆర్‌ విన్నపం

ట్రాఫిక్‌ సమస్యకు ఇదే పరిష్కార మార్గమని వెల్లడి

భవిష్యత్తులో భూసేకరణ భారమవుతుందని నివేదన

సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత, భవిష్యత్‌ ట్రాఫిక్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా, భవిష్యత్తులో భూసేకరణ భారాన్ని పరిగణనలోకి తీసుకుని రహదారుల ప్రతిపాద నలకు త్వరితగతిన ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీకి విన్నవించారు. సోమవారం ఇక్కడ కేంద్ర మంత్రి నివాసంలో ఆయనతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. గంటకుపైగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని రహదారుల అభివృద్ధికి సంబంధించి కేసీఆర్‌ ఐదు వినతిపత్రాలు ఇచ్చారు. ఒక్కో ప్రతిపాదనలో ఇమిడి ఉన్న అవసరాలు, సమస్యలను సుదీర్ఘంగా వివరించారు.

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) నిర్మించినా ఇప్పటికే అది హైదరాబాద్‌ నగరంలో అంతర్భాగమై పోయిందని, ప్రస్తుత, భవిష్యత్‌ ట్రాఫిక్‌కు పరిష్కార మార్గం రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణమేనని కేసీఆర్‌ విన్నవించారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు నిధులు, వాణిజ్య యోగ్యత తదితర అంశాలపై కేంద్ర రహదారుల శాఖ ఉన్నతాధికారులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేస్తూ ముందుచూపుతో రహదారులు నిర్మించకపోతే భవిష్యత్తులో భూసేకరణ భారంగా మారుతుందని నివేదించారు. దీనికి గడ్కరీ సానుకూలంగా స్పందిస్తూ అన్ని ప్రతిపాదనలకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. సమావేశంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు బీబీ పాటిల్, పి.రాములు, తెలంగాణ ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్‌ బి.వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

రీజినల్‌ రింగ్‌ రోడ్డుపై..
రీజినల్‌ రింగ్‌ రోడ్డు ఎక్స్‌ప్రెస్‌వేలో దక్షిణ భాగమైన 182 కి.మీ. పొడవు గల చౌటుప్పల్‌–షాద్‌నగర్‌–సంగారెడ్డి సెక్షన్‌కు సంబంధించి అలైన్‌మెంట్‌ ప్రతిపాదనలు, ట్రాఫిక్‌ డేటా, కేంద్ర రహదారుల శాఖ అడిగిన వివరణలను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. 

ఆర్‌ఆర్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వేలో ఉత్తర భాగమైన 158 కి.మీ. పొడవు గల సంగారెడ్డి–గజ్వేల్‌–చౌటుప్పల్‌ సెక్షన్‌కు భారత్‌మాలా పరియోజన పథకం కింద మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపింది. దీని అలైన్‌మెంట్‌ ప్రతిపాదనలు 2018లో సమర్పించినవని, అయితే గత మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని వివరించింది.

ఉత్తరం నుంచి దక్షిణానికి, తూర్పు నుంచి పశ్చిమానికి ట్రాఫిక్‌ నిరంతర ప్రవాహానికి వీలుగా ఉత్తర, దక్షిణ ఎక్స్‌ప్రెస్‌ వే భాగాలు పూర్తయితే తెలంగాణకే కాకుండా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకూ మేలు జరుగుతుందని తెలిపింది.

కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం విన్నవించిందంటే..

హైదరాబాద్‌–విజయవాడ రహదారిపై...
హైదరాబాద్‌–విజయవాడ మధ్య జాతీయ రహదారి–65ను 2012లో బీఓటీ పద్ధతిన నిర్మించేందుకు జీఎంఆర్‌ హైదరాబాద్‌–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వేస్‌ లిమిటెడ్‌ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అత్యంత రద్దీతో కూడిన ఈ ఆరు లైన్ల రహదారి నిర్మాణం 2024లో పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ రహదారిపై 40 వేల ప్యాసింజర్‌ కార్‌ యూనిట్స్‌ (పీసీయూ) మేర రద్దీ ఉంది. అయితే ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ వివాదం లేవనెత్తడంతోపాటు ఆరు లైన్ల నిర్మాణం చేపట్టేందుకు ముందుకురావడం లేదని తెలిసింది. అందువల్ల ఈ విషయంపై దృష్టి పెట్టి ఆరు లైన్ల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలి.

హైదరాబాద్‌–కల్వకుర్తి రహదారి నాలుగు లైన్లుగా..
తెలంగాణలోని కల్వకుర్తి నుంచి ఏపీలోని నంద్యాల వరకు రహదారిని ఎన్‌హెచ్‌–167గా నోటిఫై చేసినందుకు ధన్యవాదాలు. నాగర్‌కర్నూలు జిల్లాలోని పలు వెనకబడిన ప్రాంతాలకు ఇది మేలు చేస్తుంది. ఈ రహదారిపై కృష్ణా నది మీదుగా సోమశిల వద్ద కొత్త వంతెన నిర్మాణం హైదరాబాద్‌ నుంచి తిరుపతికి 80 కి.మీ. దూరాన్ని తగ్గిస్తుంది. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలాన్ని అనుసంధానించే ఎన్‌హెచ్‌–765లో కల్వకుర్తి వరకు ప్రస్తుతం 14 వేల పీసీయూల ట్రాఫిక్‌ ఉంది. కల్వకుర్తి–కరివెన సెక్షన్‌ (ఎన్‌హెచ్‌–167కే) అభివృద్ధి చెందితే ఈ ట్రాఫిక్‌ మరింత పెరుగుతుంది. ప్రస్తుత, భవిష్యత్‌ ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ నుంచి కల్వకుర్తి వరకు ప్రస్తుతం ఉన్న రెండు లైన్ల రహదారిని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయండి.

సీఆర్‌ఐఎఫ్‌ కేటాయింపులు పెంచాలి
సెంట్రల్‌ రోడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (సీఆర్‌ఐఎఫ్‌) కింద 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.744 కోట్ల వ్యయంతో రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించింది. అయితే కేంద్ర రహదారుల శాఖ రూ.250 కోట్లు మాత్రమే కేటాయించింది. పెండింగ్‌ ప్రతిపాదనలను పరిష్కరిస్తూ నిధుల కేటాయింపులు పెంచుతూ ఆమోదం పొందిన రోడ్డు ప్రాజెక్టులను సీఆర్‌ఐఎఫ్‌ కింద 2021–22, 2022–23 ఆర్థిక సంవత్సరాల్లో పూర్తి చేయాలి.

మిగిలిన 1,138 కి.మీ.కు అనుమతులివ్వండి..
తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొత్తం 3,306 కి.మీ. మేర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం ఇచ్చి 2,168 కి.మీ. జాతీయ రహదారులుగా నోటిఫై చేసింది. మిగిలిన 1,138 కి.మీ. రహదారులను కూడా నోటిఫై చేయాల్సి ఉంది. ఈదిశగా కీలకమైన నాలుగు రహదారులను కూడా నోటిఫై చేయాలి. పర్యాటకం, అంతర్రాష్ట్ర రవాణాలో ఇవి కీలకమైన రహదారులు. చౌటుప్పల్‌–ఆమన్‌గల్‌– షాద్‌నగర్‌–కంది (ఆర్‌ఆర్‌ఆర్‌లో భాగం) – 182 కి.మీ., కరీంనగర్‌–సిరిసిల్ల–కామారెడ్డి–ఎల్లారెడ్డి–పిట్లం –165 కి.మీ., కొత్తకోట–గూడూరు (మంత్రాలయం వరకు)– 70 కి.మీ., జహీరాబాద్‌–బీదర్‌–డెగ్లూర్‌–25కి.మీ... మొత్తం 442 కి.మీ. రహదారులను జాతీయ రహదారులుగా నోటిఫై చేయాలి. 

‘భారత్‌మాల’లోకి కరీంనగర్‌– పిట్లం రహదారి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భారత్‌మాల జాబితాలోకి కరీంనగర్‌– వేములవాడ– సిరిసిల్ల– కామారెడ్డి– పిట్లం రహదారిని చేర్చుతామని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ హామీ ఇచ్చారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ వెల్లడించారు. త్వరలోనే దీనిని జాతీయ రహదారిగా ప్రకటించి నిధులు మంజూరు చేస్తామని, ఈ మేరకు డీపీఆర్‌ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారని ఒక ప్రకటనలో వినోద్‌ కుమార్‌ తెలిపారు. గడ్కరీ హామీపై వినోద్‌కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు