రైతులకు అన్యాయం జరగనివ్వొద్దు: సీఎం కేసీఆర్‌

27 Sep, 2021 03:11 IST|Sakshi

కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌కు సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి

సాక్షి, న్యూఢిల్లీ:  కొంతకాలంగా నెలకొన్న బాయిల్డ్‌ రైస్‌ (ఉప్పుడు బియ్యం) సేకరణ సమస్యను పరిష్కరించాలని, తెలంగాణ రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. వానాకాలంలో వచ్చే దిగుబడిలో కనీసం 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. సీఎం కేసీఆర్‌ ఆదివారం సాయంత్రం ఢిల్లీలో పీయూష్‌ గోయల్‌ నివాసానికి వెళ్లి కలిశారు. వారు సుమారు గంటా 40 నిమిషాల పాటు భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. వాస్తవానికి 2020–21 యాసంగి సీజన్‌కు సంబంధించి 62.79 లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంకాగా.. 24.75 లక్షల టన్నులే తీసుకుంటామని ఇంతకుముందే కేంద్రం పేర్కొంది.

మిగతా 38.04 లక్షల టన్నులను పచ్చి బియ్యం రూపంలో ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్‌ ఇద్దరూ ఈ నెల 1న కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో, 2న ఆ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండేతో చర్చించారు. ఈ సందర్భంగా అదనంగా 20 లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ వరకు తీసుకొనేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. కానీ అధికారిక ఉత్తర్వులు రాలేదు.

సీఎం కేసీఆర్‌ తాజా భేటీలో ఈ అంశాలను పీయూష్‌ గోయల్‌ దృష్టికి కేసీఆర్‌ తీసుకెళ్లినట్టు తెలిసింది. రాష్ట్రంలో బాయిల్డ్‌ రైస్‌ నిల్వలు పేరుకుపోతున్నాయని, ఎఫ్‌సీఐ తీసుకోకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతుందని, రైస్‌ మిల్లులు మూతపడి ఉపాధిపై ప్రభావం చూపుతుందని వివరించినట్టు సమాచారం. ఇక వర్షాలు బాగుండటం, వరిసాగు విస్తీర్ణం పెరగడంతో వానాకాలంలో కేంద్రం తీసుకునే ధాన్యం కోటా పెంచాలని, ఈ సారి కనీసం 90 లక్షల టన్నులు తీసుకోవాలని కోరినట్టు తెలిసింది. కేంద్రమంత్రితో భేటీలో సీఎంతోపాటు సీఎస్‌ సోమేశ్‌మార్, సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి కూడా ఉన్నారు.   

మరిన్ని వార్తలు