ఉమ్మడి రాష్ట్రంలో కన్నా ఇప్పుడే అన్యాయం

7 Jul, 2021 02:54 IST|Sakshi

తెలంగాణకు నీటి వాటాల్లో  తీరని అన్యాయం

గ్రావిటీ కింద వచ్చే 11 టీఎంసీలను తెచ్చుకోలేక 3 టీఎంసీలకు లక్ష కోట్లు ఖర్చా? 

 టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ నీటి వాటాలో ఉమ్మడి రాష్ట్రం కన్నా ఇప్పుడే ఎక్కువ అన్యాయం జరుగుతోందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్‌ఎస్‌లే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియా భేటీలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్‌ ఉపాధ్యక్షుడు గోపిశెట్టి నిరంజన్, యూత్, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షులు శివసేనారెడ్డి, సునీతారావు తదితరులతో కలసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. నీటి వాటాను రక్షించలేని సీఎం కేసీఆర్‌కు ఆ కుర్చీలో కూర్చునే అర్హత లేదన్నారు. పోతిరెడ్డిపాడు విస్తరణ ద్వారా రోజుకు 4–8 క్యూసెక్కులు, సంగమేశ్వరం లిఫ్ట్‌ ద్వారా 3 క్యూసెక్కుల చొప్పున మొత్తం 11 క్యూసెక్కుల నీరు ఏపీ తరలించుకుపోతోందని చెప్పారు. గ్రావిటీ ద్వారా మన భూభాగంలోకి రావాల్సిన ఈ 11 క్యూసెక్కుల నీటి వాటాను కాపాడుకునే సమర్థత తెలంగాణ ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయమన్నారు. ఈ 11 టీఎంసీలను వదిలేసి 3 టీఎంసీల నీటి కోసం రూ. 1.18 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారన్నారు.
 
కార్యకర్తల చెమట చుక్కలే కారణం.. 
టీపీసీసీ కొత్త కార్యవర్గానికి ఉత్తమ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఆరున్నరేళ్ల పాటు టీపీసీసీ అధ్యక్షుడిగా తనకు పనిచేసే అవకాశమిచ్చిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎంపీ రాహుల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని 12,765 గ్రామపంచాయతీలు, 141 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ పార్టీ అన్ని పార్టీల కంటే బలంగా ఉందని, కార్యకర్తల చెమట, రక్తం, కన్నీళ్లే ఇందుకు కారణమని, తరాల నుంచి కాంగ్రెస్‌ పార్టీని నిలబెడుతున్న కార్యకర్తలకు సెల్యూట్‌ చేస్తున్నానని ఉత్తమ్‌ చెప్పారు.  
 

మరిన్ని వార్తలు