చండూరులో కేసీఆర్‌ సభ

30 Oct, 2022 04:18 IST|Sakshi
మునుగోడు నియోజకవర్గం చండూరులోని బంగారిగడ్డ వద్ద సీఎం సభ కోసం ముస్తాబైన వేదిక

నేడు చండూరులో కేసీఆర్‌ సభచివరి అంకానికి మునుగోడు ప్రచారం 

భారీగా జన సమీకరణకు టీఆర్‌ఎస్‌ కసరత్తు 

సభకు సీఎంతో పాటు ‘ఆ నలుగురు‘ ఎమ్మెల్యేలు? 

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక ప్రచార పర్వం చివరి అంకానికి చేరుకుంటున్న నేపథ్యంలో, ఆదివారం చండూరులో భారీ బహిరంగ సభ నిర్వహణ ద్వారా పారీ్టకి ఊపు తెచ్చేందుకు టీఆర్‌ఎస్‌ సన్నద్ధమవుతోంది. టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్య­మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మండల కేంద్రంలోని బంగారిగడ్డ ప్రాంతంలో 30 ఎకరాల విస్తీర్ణంలో సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉప ఎన్నిక షెడ్యూల్‌ వెలువడక ముందే ఆగస్టు 20న మునుగోడు నియో­జకవర్గ కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్‌ పాల్గొన్నారు.

మరో సభను చండూరులో ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో సభను విజయవంతం చేసేందుకు టీఆర్‌ఎస్‌ యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. జన సమీకరణకు సంబంధించి ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికలో మండల ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్న మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. యూనిట్‌ ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్న మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జన సమీకరణకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి.  

చండూరు సభకు ప్రాధాన్యత 
ఒకవైపు మునుగోడులో అన్ని రాజకీయ పక్షాల ప్రచారం ముమ్మరంగా సాగుతుండగా, రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాలతో చండూరు సభకు ప్రాధాన్యత ఏర్ప­డింది. ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంపై కేసీఆర్‌ ఇప్పటివరకు స్పందించలేదు. ఆయనతో పాటు పార్టీ యంత్రాంగం అంతా ప్రస్తుతం వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. దీంతో చండూరు సభలో సీఎం ఏమైనా మాట్లాడతారా? అనే ఉత్కంఠ నెలకొంది.

ఆగస్టు 20న జరిగిన సభలో కేవలం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలకు మాత్రమే పరిమితమైన ముఖ్యమంత్రి.. ఆదివారం జరిగే సభలో రాజకీయ అంశాలపై స్పందించే అవకాశముందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంతో సంబంధం కలిగిన నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చండూరు సభకు సీఎం కేసీఆర్‌తో పాటు హాజరవుతారని టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసం రాజగోపాల్‌ రెడ్డి అమ్ముడు పోయినందునే ఉప ఎన్నిక వచి్చందని ఆరోపిస్తున్న టీఆర్‌ఎస్‌.. తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగలేదనే విషయాన్ని సభ ద్వారా చెప్పే అవకాశాలున్నట్లు తెలిసింది.  

భద్రతా కారణాల వల్లే అజ్ఞాతంలో.. 
ఎమ్మెల్యేలకు ఎర అంశంపై దర్యాప్తు దశలో స్పందించకూడదని టీఆర్‌ఎస్‌ నిర్ణయించుకుంది. ఈ ఘటనతో సంబంధం కలిగిన నలుగురు ఎమ్మెల్యేలు ఈ నెల 26న పోలీసు భద్రత నడుమ ప్రగతిభవన్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజులుగా వీరు ప్రగతిభవన్‌లోనే బస చేసినట్లు ప్రచారం జరుగుతుండగా, భద్రతా కారణాల దృష్ట్యా వారు ఎక్కడ ఉన్నారనే అంశంపై గోప్యత పాటిస్తున్నట్లు తెలిసింది. అయితే వారు తమ కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.   

మరిన్ని వార్తలు