ఆస్తుల వివరాలను నమోదు చేసుకున్న కేసీఆర్‌

10 Oct, 2020 18:04 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట : తెలంగాణ వ్యాప్తంగా ఆ‍స్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన పలు కీలక సంస్కరణల్లో భాగంగా గ్రామ స్థాయి నుంచి నివాస వివరాలను గ్రామ అధికారులు నమోదు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన ఆస్తులను నమోదు చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని తన నివాసంలో ఆస్తుల వివరాలను శనివారం సీఎం స్వయంగా వెల్లడించారు. గృహ వివరాలతో పాటు వ్యవసాయేతర వివరాలను ఎర్రవల్లి గ్రామ కార్యదర్శి సిద్దేశ్వర్‌కు తెలియజేశారు. తనకున్న ఆస్తి వివరాల పత్రాలను చూపెట్టి ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకున్నారు. సాధారణ పౌరుడిగానే అంగు ఆర్భాటాలు లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్తులను వివరించారు. ఈనెల 15లోపు ప్రతిఒక్కరు తమ వివరాలను నమోదు చేసుకోవాలని సీఎం సూచించారు. (వెంటాడుతున్న గతం.. ఓటమి తప్పదా?)

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘గ్రామీణ, పుర ప్రజలు తమ స్థిరాస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. ఆస్తులపై ప్రజలకు హక్కు, భద్రత కల్పించేందుకే ఈ కార్యక్రమం. ఆస్తుల నమోదు అనేది దేశంలోనే మొట్టమొదటి, అతి పెద్ద ప్రయత్నం. సాగుభూముల తరహాలోనే వ్యవసాయేతర భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇస్తాం’’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆస్తుల‌పై ప్ర‌జ‌ల‌కు హ‌క్కు, భ‌ద్ర‌త క‌ల్పించేందుకు వివ‌రాలను న‌మోదు చేస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌తి కుటుంబం స్థిరాస్తుల వివ‌రాల‌ను విధిగా న‌మోదు చేసుకోవాల‌న్నారు. ఆస్తుల న‌మోదు అనేది దేశంలోనే మొట్ట‌మొద‌టి అతి పెద్ద ప్ర‌య‌త్న‌మ‌ని చెప్పారు. సాగు భూముల త‌ర‌హాలోనే వ్య‌వ‌సాయేత‌ర భూముల‌కు ప‌ట్టాదారు పాస్ పుస్త‌కాలు ఇస్తామ‌న్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టిన స్థిరాస్తుల న‌మోదు ప్ర‌క్రియ చ‌రిత్ర‌లో మైలురాయిగా నిలుస్తుంద‌ని సీఎం కేసీఆర్ అన్నారు. 

మరోవైపు దసరా నాటికి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు పునఃప్రారంభించాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ప్రస్తుతం కార్డ్‌ విధానంలో అమలవుతున్న రిజిస్ట్రేషన్ల విధానాన్ని ధరణి పోర్టల్‌లోకి మార్చే ప్రక్రియలో సబ్‌ రిజిస్ట్రార్లు బిజీగా ఉన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్‌ విలువలను ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. సర్వే నంబర్, ఇంటి నంబర్లవారీగా భూములు, ఆస్తుల విలువలను వాటి ఎదుటి కాలమ్‌లో నమోదు చేస్తున్నారు. రెండు వారాల క్రితం ప్రారంభమైన ఈ ప్రక్రియ మంగళవారం నాటికి పూర్తి కానుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్థానిక సంస్థలు కూడా అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తుల నమోదు ప్రక్రియను ‘ధరణి’లోకి అప్‌లోడ్‌ చేసే ప్రక్రియను సమాంతరంగా చేపడుతున్నాయి.

మరిన్ని వార్తలు